ఉల్లి.. నీకు దండమే
స్టాకు పెంచుతున్నా తప్పని తిప్పలు
బారులు తీరుతున్న ప్రజలు
నేటి నుంచి మరిన్ని కౌంటర్లు
ఉదయం 6 నుంచి 11 గంటల వరకే సరఫరా
తెల్లారితేచాలు..ఉల్లి కష్టాలు మొదలవుతున్నాయి. మార్కెట్లో చుక్కలను తాకిన పాయలను అందుకోలేక సామాన్య మధ్యతరగతి వర్గాలు రైతుబజారు బాట పడుతున్నారు. తీరా వెళ్లేసరికి చాంతాడంత క్యూ దర్శనమిస్తోంది. ఎక్కడ ఉల్లిపాయలు నోస్టాక్ బోర్డు పెట్టేస్తారేమోననే భయంతో తోపులాట..ఈ లైన్లలో ఎదురవుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎండయినా..వానయినా అడుగు కదలకుండా నిలబడుతున్నారు. తమవరకూ ఉల్లి వస్తుందా రాదా అని క్షణమొక యుగంగా లైన్‌లో ఎదురుచూస్తున్నారు. నిత్యం రైతు బజార్లలో ఇదే పరిస్థితి..రేపూ మారుతుందని నమ్మకం లేదు.
విశాఖపట్నం: ఉల్లికష్టాలు ఇప్పట్లో తీరేటట్టు కన్పించడం లేదు. రోజురోజుకు ఉల్లి పాట్లు ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా డిమాండ్ తగ్గ సరుకులేకపోవడంతో ఉల్లిపాయ కూడా దొరకడం గగనంగా మారింది. ఇదే సమయంలో ఉల్లిదొంగతనాలు జోరందుకుంటున్నాయి. మరొకపక్క తార్‌మార్ తక్కెడ మార్ అంటూ తూకాల్లో మోసాలు ఎక్కువయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి ధరలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలు ఏ మాత్రం సత్ప లితాలనివ్వడంలేదు. రైతుబజార్లలోనే హోల్‌సేల్, రిటైల్‌మార్కెట్‌లలో సైతం బోర్డుల్లో అధికారులు నిర్ధేశించిన ధరల కంటే కనీసం 20శాతం అదనంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతవాసులకు ఉల్లిపాయ చూద్దామంటే కన్పించని పరిస్థితి నెలకొంది.విశాఖపరిసర ప్రాంతాల్లో ఉన్న 12 రైతు బజార్లలో ఇప్పటి వరకు అధికారికలెక్కల ప్రకారం 9562.20 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల విక్ర యాలు జరిగాయి. వీటిలో కనీసం 20 శాతం పక్కదారి పట్టినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఇప్పటివ రకు రైతుబజార్ల ద్వారా రోజుకు 30నుంచి 40 మెట్రిక్ టన్నుల ఉల్లివిక్రయాలు జరుగుతుండగా నేటి నుంచి స్టాక్‌ను పెంచుతున్నారు. ఇవన్నీ రికార్డులకే పరిమితమవుతున్నాయి తప్ప వాస్తవానికి ఆ స్థాయిలో అమ్మకాలు జరగడంలేదనే విమర్శలు వస్తున్నాయి. బుధవారం కంచరపాలెం రైతు బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ ఉన్న అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏర్పాట్లు ఇలా చేస్తే ఎలా అంటూ నిల దీశారు. బుధవారం రాత్రికి కర్నూలు నుంచి 60 ఎంటీల దిగుబడి చేయిస్తున్నారు. గురువారం 11 రైతుబజార్లకు అదనంగా నగరంలోని సూపర్‌బజార్‌తో పాటు తగరపువలసలోని ఫుట్‌బాల్‌గ్రౌండ్‌లో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ విక్రయాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌లోని రైతుబజార్‌లో మాత్రం గురువారంవిక్రయాలను నిలిపి వేశారు.
రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని రైతుబజార్లలో ప్రస్తుతం ఉన్న కౌంటర్లను రెట్టింపు చేస్తున్నారు. తోపులాటలు జరగకుండా ఉండేందుకు దాదాపు అన్ని రైతుబజార్లలో ప్రత్యేకంగా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే స్టాక్‌ను కూడా పెంచుతున్నారు. రద్దీ పెరిగినప్పటికీ ఇబ్బంది లేకుండా ప్రతీ ఒక్కరికి ఉల్లి అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటి వరకు తెల్లకార్డుపై కిలో ఉల్లి పాయలు మాత్రమే ఇస్తుండగా..నేటి నుంచి రెండుకిలోలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసారు.అలాగే కౌంటర్ల వద్ద మంచీనీరు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.