ఇంటికే వచ్చేస్తుంది షాపింగ్ కార్ట్! | online shopping is easy process to buy | Sakshi
Sakshi News home page

ఇంటికే వచ్చేస్తుంది షాపింగ్ కార్ట్!

Published Wed, Jan 22 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

ఇంటికే వచ్చేస్తుంది షాపింగ్ కార్ట్!

ఇంటికే వచ్చేస్తుంది షాపింగ్ కార్ట్!


 క్లిక్ చేసి కొనేద్దాం!
 
 రిటైల్ మార్కెట్ల హవా ఇదివరకటి మాట! ‘ఈ’టైల్ మార్కెట్ల హవా లేటెస్ట్ ట్రెండ్!! ఉప్పు- పప్పు, పెన్‌డ్రైవ్ - కెమెరా, పుస్తకాలు, ఇండక్షన్ స్టవ్‌లు... ఆటబొమ్మల నుంచి దుస్తుల వరకు... గృహోపకరణాలు, వ్యాయామ పరికరాలు... ఏది కొనాలన్నా బోలెడన్ని ఆప్షన్లు... ఒక్క క్లిక్కు దూరంలో! నాణ్యతకు ఢోకా ఉండదు. పనిగట్టుకుని బయటకు వెళ్లనక్కర లేదు. అన్నిటికీ ఆన్‌లైన్ మంత్రమే. ఒక్క గంట సమయం వెచ్చిస్తే చాలు. నమ్మకమైన నాలుగైదు వెబ్‌సైట్లను జల్లెడపట్టి.. ఎవరు తక్కువకిస్తున్నారో తేల్చుకోవచ్చు. ఆపై జస్ట్ ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే చాలు.. వస్తువు రెక్కలు కట్టుకు వచ్చి ఇంటిముందు వాలుతుంది.
 సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొనాలంటే నాలుగైదు షాపులు తిరుగుతాం. అదే వస్తువును వివిధ కంపెనీలు ఏ ధరకు ఇస్తున్నాయో లెక్కలు వేస్తాం. వాటిని కళ్లారా చూసి, తాకిన తర్వాతే డబ్బు చెల్లించి ఇంటికి తీసుకెళతాం. దీనికి భిన్నంగా ఆన్‌లైన్‌లో వస్తువులను కంప్యూటర్ తెరమీదే చూడాలి. ఆన్‌లైన్‌లో ఆర్డరివ్వాలి. డబ్బులు డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా కట్టాలి.
 
  క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా ఉన్నప్పటికీ.. ఇంటికి వచ్చిన వస్తువును విప్పి చూసుకోకముందే డబ్బులు కట్టాలి. మొత్తమ్మీద ఇదంతా రిస్కుతో కూడిన వ్యవహారంలా కనిపించడంతో ఎక్కువమంది ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపేవారు కాదు. కానీ, 2010 తర్వాత పరిస్థితిలో క్రమంగా మార్పు వచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ మరీ అంత ప్రమాదకరమైనదేమీ కాదన్న నమ్మకం చాలామందిలో కుదిరింది. దీనికితోడు, ఉద్యోగ రీత్యా ప్రత్యేకంగా షాపింగ్ చేయలేనంత బిజీ జీవితం.. ఒకవేళ తీరిక కుదిరినా నానా ఇబ్బంది పెట్టే ట్రాఫిక్ కష్టాల నేపథ్యంలో ‘ఇ-ట్రేడింగ్ ’ ఊపందుకుంది.
 
 టికెట్లూ ఆన్‌లైన్‌లోనే...
 ఐఆర్‌సీటీసీ, ఆర్టీసీ వంటి నమ్మకమైన వెబ్‌సైట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేస్తారు. వస్తువుల విషయానికి వచ్చేసరికి ‘‘ఆన్‌లైన్‌లో కొంటే సెకండ్ హ్యాండ్‌వి, పాడైనవి, పనికిరానివి అంటగడతారేమో’’ అనే ఆందోళన ఉంటుంది. అలాగే.. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేటప్పుడు డెబిట్/క్రెడిట్ కార్డు నంబర్ వంటివి ఎంటర్ చేయడానికి భయపడి కొందరు ‘ఇ-కొనుగోళ్ల’ పట్ల అంత ఆసక్తి చూపరు. కానీ, నమ్మకమైన సైట్లలో కొనుగోలు చేస్తే ఎలాంటి భయాలకూ తావుండదు. వారంటీతో సహా, చక్కటి ప్యాకింగ్‌లో తక్కువ సమయంలో మనం ఆర్డర్ చేసిన వస్తువులు చేతికందుతాయి. సైట్‌లో చూసినట్టుగా లేకున్నా.. దాని పనితీరులో ఏవైనా లోపాలున్నా మామూలు దుకాణాల్లోలాగానే పదిహేను రోజుల్లోగా తిరిగిచ్చే (కొన్నిరకాల వస్తువులైతే వాడకుండా) సదుపాయం ఆన్‌లైన్‌లో కూడా ఉంది.
 
 తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 ప్రముఖ వెబ్‌సైట్లలో కొనేటప్పుడు పెద్దగా ఇబ్బందులు ఎదురవవుగానీ.. మనకు నచ్చిన వస్తువు, నచ్చిన ధరలో ఇతర వెబ్‌సైట్‌లలో కనిపించనప్పుడు తొందరపడి కొనుగోలు చేయకూడదు. ఆ సైట్‌కు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ‘అబౌట్ అజ్’ విభాగంలో పూర్తి అడ్రస్, 1800తో మొదలయ్యే (లేదా) ఇతరత్రా స్పష్టమైన ఫోన్ నంబర్ ఉంటేనే ఆ సైట్ ద్వారా కొనుగోలు చేయండి. లేనిపక్షంలో అలాంటి సైట్ల జోలికి వెళ్లొద్దు.
 
     ఒకే వస్తువు రేటు వివిధ సైట్లలో ఎలా ఉందో పరిశీలించాలి. అలాగే, వస్తువు సరఫరా ఏ సైట్‌వారు వేగంగా చేస్తారో నిర్ధారించుకోవాలి. ఆయా సైట్లలో ఉన్న యూజర్ రివ్యూల ద్వారా ఆ విషయం తెలుసుకోవచ్చు.
 
 మనం కొనుగోలు చేసిన వస్తువు నచ్చకుంటే లేదా పనికిరాకపోతే వెనక్కి తిరిగిచ్చే వీలుందా? అలాంటి అవకాశం ఉంటే అందుకు ఏయే షరతులున్నాయో ‘రిటర్న్ పాలసీ’ ద్వారా తెలుసుకోవాలి.
 
 10 % డిస్కౌంటు.. 20% డిస్కౌంటు అని ఆయా సైట్లు చెప్పే కబుర్లను నమ్మక్కర్లేదు. ఎందుకంటే ఆ డిస్కౌంట్లన్నీ ఆయా వస్తువుల గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) మీద మాత్రమే ఇస్తారు.
 
 డెబిట్/క్రెడిట్ కార్డులపై ముందే చెల్లింపులు జరిపే కన్నా.. వీలైనంతవరకూ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోండి. ఈ విధానంలో వస్తువు ఇంటికొచ్చాక డెబిట్/క్రెడిట్ కార్డులపై చెల్లించవచ్చు.
   మరీ ఖరీదైన వాటిని ఆన్‌లైన్‌లో కొనడం కన్నా దుకాణానికి వెళ్లి స్వయంగా పరీక్షించుకుని కొనడమే మంచిది.    
 
 నమ్మకమైన టాప్-5 సైట్లు...
  ఫ్లిప్‌కార్ట్ (www.flipkart.com)
  ఈ-బే (www.ebay.in)
  హోమ్‌షాప్-18 (www.homeshop18.com)
  యెభి (www.yebhi.com)
 జబంగ్ (www.jabong.com)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement