భారీగా తగ్గిపోయిన ఉల్లి సరఫరా
షోలాపూర్ : అసలే ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు సరఫరా కూడా భారీగా తగ్గిపోయింది. దీంతో మధ్య తరగతి వినియోగదారుడికి ఉల్లి కన్నీళ్లు తప్పేట్టు కనిపించడం లేదు. షోలాపూర్ వ్యవసాయ కమిటీకి ఉల్లి సరఫరా భారీగా పడిపోయింది. రాష్ర్టంలో ఉల్లిని దిగుమతి చేసుకునే మార్కెట్లలో ఒక్కటైన షోలాపూర్ వ్యవసాయ కమిటీలోకి ప్రతి రోజు 30 నుంచి 35 లారీల్లో ఉల్లి వస్తుంది. అయితే అకాల వర్షాలు పడటంతో నాసిక్, అహ్మద్‌నగర్, పుణే, సాంగ్లి ప్రాంతాల్లోని ఉల్లి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
దీంతో ప్రస్తుతం అన్ని మార్కెట్‌లో నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. మామూలుగా మార్కెట్ వచ్చే దానిలో సగం కూడా రావటం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై ఉన్న ఎగుమతుల సుంకాన్ని పెంచింది. అయినప్పటికీ ధరలు నియంత్రణలోకి రాకపోవడంతో పాకిస్తాన్, చైనాల నుంచి 10 వేల టన్నుల ఉల్లి దిగుమతులకు ఆర్డర్ ఇచ్చింది.
ధరలు పైపైకి..
కూరగాయల మార్కెట్లలో ఉల్లి ధర రూ.50 నుంచి 60 వరకు పలుకుతోంది. డిమాండ్ పెరిగిపోవడంతో ధర కూడా ఆమాంతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం క్వింటాల్ రూ.4000 నుంచి 4,800 వరకు ధర పలుకుతుంది. రీటైల్ మార్కెట్‌లో రూ.50 నుంచి రూ. 60 వరకు విక్రయిస్తున్నారు. గత నెల రోజులుగా ధరలు కొద్ది కొద్దిగా పెరిగిపోతున్నాయి.