రిటైల్‌ మార్కెట్లోకి కేపీఆర్‌ గ్రూప్‌ | KPR Group launches organic innerwear | Sakshi
Sakshi News home page

రిటైల్‌ మార్కెట్లోకి కేపీఆర్‌ గ్రూప్‌

Published Sat, Sep 21 2019 4:54 AM | Last Updated on Sat, Sep 21 2019 4:55 AM

KPR Group launches organic innerwear - Sakshi

ఫాసో ఉత్పత్తులతో శక్తివేల్, నటరాజ్, అరుణ్‌ (ఎడమ నుంచి)

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న తమిళనాడుకు చెందిన కేపీఆర్‌ గ్రూప్‌ కంపెనీ కేపీఆర్‌ మిల్‌.. ఫాసో పేరుతో సొంత బ్రాండ్‌లో లోదుస్తుల విభాగంలోకి ప్రవేశించింది. భారత్‌లో తొలిసారిగా నూరు శాతం ఆర్గానిక్‌ కాటన్‌తో వీటిని తయారు చేశారు. ఇటీవలే తమిళనాడు, కేరళలో ఫాసో ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా ఫాసో అడుగు పెడుతుందని కేపీఆర్‌ మిల్‌ ఈడీ ఇ.కె.శక్తివేల్‌ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. 2021లో మహిళలు, పిల్లల లోదుస్తుల తయారీలోకి వస్తామన్నారు. ఆ తర్వాతి ఏడాది నుంచి సొంత స్టోర్లను ప్రారంభిస్తామన్నారు. ఫాసో ధరల శ్రేణి రూ.139–1,199 మధ్య ఉంది.

విస్తరణకు రూ.400 కోట్లు..
కేపీఆర్‌ మిల్‌కు భారత్‌తోపాటు ఇథియోపియాలో అంతర్జాతీయ స్థాయిలో 12 ప్లాంట్లున్నాయి. 60 దేశాల్లోని 40 ప్రముఖ కంపెనీలకు వివిధ బ్రాండ్లలో లోదుస్తులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ ఎండీ పి.నటరాజ్‌ తెలిపారు. ‘రోజుకు 2,75,000 కిలోల యార్న్, 50,000 కిలోల ఫ్యాబ్రిక్, 60,000 కిలోల ప్రాసెసింగ్‌ సామర్థ్యం ఉంది. రూ.400 కోట్లతో విస్తరణ చేపట్టాం. విస్తరణ పూర్తి అయితే విభాగాన్నిబట్టి తయారీ సామర్థ్యం 50 శాతం వరకు పెరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్‌ టర్నోవర్‌ రూ.4,000 కోట్లు. ఇందులో టెక్స్‌టైల్‌ విభాగం వాటా రూ.3,016 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం టర్నోవరులో 15 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని కంపెనీ ఎండీ పి.నటరాజ్‌  వివరించారు.  

పరిశ్రమ రూ.30,000 కోట్లు..
‘ఇన్నర్‌ వేర్‌ మార్కెట్‌ భారత్‌లో రూ.30,000 కోట్లుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 40%. ఆసియాలో హొజైరీ తయారీలో అతి పెద్ద కేంద్రంగా తమిళనాడులోని తిరుపూర్‌ నిలిచింది. ఇక్కడ 3,000లకుపైగా ప్లాంట్లు కొలువుదీరాయి. రూ.50,000 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇక్కడ ఏటా తయారవుతున్నాయి. 8 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు’ అని నటరాజ్‌ చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్లాంటు?
ప్లాంటు ఏర్పాటు చేయాల్సిందిగా పలు రాష్ట్రాలు కేపీఆర్‌ గ్రూప్‌ను ఆహ్వానించాయి. ఇందులో తెలుగురాష్ట్రాలూ ఉన్నాయి. 13వ ప్లాంటును తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పుతారా అని సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎండీ స్పందిస్తూ.. ‘రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కొత్త యూనిట్‌ విషయమై బోర్డు అనుమతి పొందాలి. ఎంత కాదన్నా ఫ్యాక్టరీకి రూ.500 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుంది.’ అని పేర్కొన్నారు. రెండేళ్లలో కొత్త ప్లాంటు సాకా రం అయ్యే అవకాశం ఉందని కంపెనీ డైరెక్టర్‌ టి.ఎన్‌.అరుణ్‌ వెల్లడించారు. కేపీఆర్‌ మిల్‌ షేరు శుక్రవారం 19 శాతం వృద్ధి చెంది రూ.554.60 వద్ద స్థిరపడింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement