వీరేందర్ హయత్‌నగర్‌లో కిరాణా స్టోర్ నిర్వహిస్తున్నాడు. దసరా సీజన్ కావడంతో దుకాణంలోకి సరుకులు తెచ్చేందుకు రెండ్రోజుల క్రితం మార్కెట్‌కు బయలుదేరాడు. చింతలకుంట సమీపంలో రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. అతని వెంట ఉన్న రూ.2.30 లక్షల నగదును సీజ్ చేశారు. కిరాణా దుకాణం నిర్వాహకుడినని, సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్నట్లు చెప్పినా ఫలితం లేక పోయింది. దుకాణంలో రోజువారీ సేల్స్ తాలూకు డబ్బులు కావడంతో సంబంధిత పత్రాలు లేవు.దీంతో నగదును వెనక్కు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం.. దీనిపై క్షేత్రస్థాయి లో అవగాహన లేకపోవడంతో చాలామంది నగదును తీసుకెళ్తూ పట్టుబడుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు కోట్లాది రూపాయలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల సంఘం విధించిన రూ.50 వేల గరిష్ట పరిమితి నిబంధన వల్ల సామాన్యులు పలు సందర్భాల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ చిల్లర వర్తకంలో నగదు లావాదేవీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. హోల్‌సేల్‌తోపాటు రిటైల్ మార్కెట్‌లోనూ నగదు లావాదేవీలు పెద్దసంఖ్యలోనే జరుగుతున్నాయి. అలా నగదు లావాదేవీలు జరిగినప్పుడు దుకాణా దారులు చాలాచోట్ల రసీదులు ఇవ్వడం లేదు. హోల్‌సేల్ దుకాణాల్లో వస్తువుల కొనుగోలుకు రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది.
డిజిటల్ లావాదేవీలు మేలు: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది. చిల్లర వ్యాపారులు పలు అవసరాలకు నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. అంతేగాకుండా సరుకుల కొనుగోలుకు జనాలు సైతం నగదు తీసుకెళ్తుంటారు. ఇవేగాకుండా వైద్య, వ్యాపార అవసరాల నిమిత్తం అప్పులు తెచ్చుకోవడం లాంటివి చేస్తుంటారు. వీటికి లిఖిత పూర్వక ఆధారాలేమీ ఉండవు.
చేబదులు రూపంలో తీసుకునే మొత్తానికి ఎలాంటి రసీదు ఉండదు. మరోవైపు వైద్య ఖర్చులు, శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లే వారు, కాలేజీ ఫీజులు చెల్లించే వాళ్లు తమ వెంట రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఎక్కువగా ఇలాంటివే ఎక్కువ వెలుగు చూస్తున్నాయి. అందువల్ల ఈ పరిస్థితుల్లో నగదును తీసుకెళాల్సి ఉంటే సరైన ఆధారాలను వెంట ఉంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే సమీప బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం మంచిదని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment