మండపేట : గుడ్డు ధర కోళ్ల రైతులను కలవరపరుస్తుండగా, రిటైల్ మార్కెట్‌లో వినియోగదారులనూ బెంబేలెత్తిస్తోంది. రూ.ఐదుకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. జిల్లాలో సుమారు 1.4 కోట్ల కోళ్లు ఉండగా, రోజుకు సుమారు 1.19 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో 65 శాతం గుడ్లు బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి.
సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఫౌల్ట్రీ పరిశ్రమకు సీజన్‌గా భావిస్తారు. శీతల ప్రభావంతో ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని గుడ్డు ధర పెరగడం పరిపాటి. ఇదేక్రమంలో నెల రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులకు డిమాండ్ పెరిగి, గుడ్డు ధర పెరుగుతూ వచ్చింది. కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీ జిల్లా పరిశ్రమకు ప్రతికూల వాతావరణాన్ని కల్పిస్తోందని కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 27న రూ.3.80కు చేరుకున్న ధర అక్కడే నిలిచిపోయింది. డిమాండ్ లేక నాలుగు రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ధర తగ్గే అవకాశం ఉందని ఫౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గుడ్లు తేలేస్తున్న వినియోగదారులు :
సాధారణంగా రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు అమ్మకాలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం రైతు ధర రూ.3.80 ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.ఐదు వరకు అమ్మకాలు చేస్తుండడంతో సామాన్య వర్గాల వారు వాటిని కొనుగోలు చేసేందుకు గుడ్లు తేలేస్తున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న అనపర్తి, మండపేట, పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే రకంగా అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో రూ. 5.50 వరకు కూడా విక్రయిస్తున్నట్టు సమాచారం. కాగా రిటైల్ మార్కెట్‌లో రూ. ఐదు పలుకుతుండడం ఫౌల్ట్రీ పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో ఇప్పటికే స్థానిక ఎగుమతులకు డిమాండ్ పడిపోగా ధరాభారంతో స్థానిక వినియోగం తగ్గే
అవకాశముందంటున్నారు.
ఎగ్‌సిపడుతూ..
Published Wed, Dec 3 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement