ఘాటెక్కిన మిర్చి..
- రిటైల్ మార్కెట్లో కిలో రూ.60
- విలవిల్లాడుతున్న వినియోగదారులు
- సరఫరా తగ్గిన ఫలితం
సాక్షి, సిటీబ్యూరో: నగర మార్కెట్లో పచ్చిమిర్చి ధరల ఘాటు నషాలానికి ఎక్కింది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కేజీ రూ.60కి చేరింది. టోకు మార్కెట్లో కేజీ రూ.38 ఉండగా, రైతుబజార్‌లో రూ.41 పలుకుతోంది. ఇదే సరుకు తోపుడుబండ్లపై పావు కిలో రూ.20 చొప్పున కేజీకి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు.
గత నెల వరకు కేజీ రూ.25-30కి లభించిన మిర్చి ఇప్పుడు ఏకంగా రూ.60కి ఎగబాకింది. డిమాండ్- సరఫరా మధ్య అంతరం పెరగడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గత వారం రోజుల్లోనే రెండు రెట్లు ధర పెరగడం ఇందుకు నిదర్శనం. మిర్చి ధరకు రెక్కలు రావడంతో ఈ ప్రభావం ఇతర కూరగాయలపైనా పడింది.
మొన్నటివరకు కేజీ రూ.20-25 ధర పలికిన టమోట ఇప్పుడు రూ.40కి చేరింది. దోస, వంకాయ, క్యాబేజీ ధరలు మిగతా అన్నిరకాల కూరగాయలు రూ.30-60 మధ్య పలుకుతున్నాయి. మిచ్చితో పాటు బెండ, బీర, కాకర, చిక్కుడు, గోకర, క్యారెట్, బీన్స్, బీట్ రూట్‌లదీ అదే దారి. వంటింట్లో ప్రధాన నిత్యావసర వస్తువైన మిర్చి ధర పెరగడం గృహిణుల్లో కలవరం మొదలైంది. వర్షాలు మొదలైతే మిర్చి సరఫరా తగ్గి ధరలు మరింత పెరగొచ్చని వ్యాపారులు అంటున్నారు.
తగ్గిన సరఫరా
నగర అవసరాలకు నిత్యం 90-100 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ఇప్పుడు 30-40 టన్నులకు మించట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా మిర్చి సాగు లేకోవడంతో కర్నూలు, గుంటూరు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చే సరుకుపైనే నగర మార్కెట్ ఆధారపడుతోంది. అక్కడా మిర్చికి డిమాండ్ ఉండటంతో నగర అవసరాలకు తగినంత సరుకు సరఫరా కావట్లేదని తెలుస్తోంది. సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.