టమా‘ఠా’
- భగ్గుమంటున్న ధరలు
- రిటైల్ మార్కెట్లో కేజీ రూ.60-70
- నగరానికి దిగుమతులు తగ్గిన ఫలితం
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసులకు టమాటా బాంబులా కన్పిస్తోంది. స్థానికంగా దిగుబడులు లేకపోవడం.. అనుకున్న స్థాయిలో దిగుమతి కాకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజురోజుకూ వీటి ధరలు పైకి ఎగబాకుతున్నాయి. సామాన్యుడు మాత్రం వీటిని కొనలేని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ధరల కారణంగా టమాటా కాస్త టమోతగా మారింది.
నగర మార్కెట్లో టమాటా ధరలు మోతమోగిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లోనే శనివారం టమాటా కిలో ధర రూ.52, రైతు బజార్లలో రూ.55 పలికింది. రిటైల్ మార్కెట్లో దాని ధర మరింత ఎక్కువగా ఉంది. గిరాకీని బట్టి కేజీ టమాటాను రూ.60 నుంచి 70 వరకు విక్రయిస్తున్నారు. ఇళ్లవద్దకు వచ్చే తోపుడుబండ్ల వ్యాపారులు కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. సరుకు నాణ్యత, గిరాకీని బట్టి వ్యాపారులు ధర నిర్ణయిస్తూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అమ్మకాలు సాగిస్తున్నారు.
వీటి ధరలు పెరగడంతో వంటింట్లో టమాటాకు స్థానం లేకుండా పోయింది. దీని ధర ప్రభావం మిగతా కూరగాయలపైనా పడింది. ముఖ్యంగా పచ్చి మిర్చి ధర ఎగబాకుతోంది. మిగతా కూరగాయల్లోనూ శనివారం కిలోకు రూ.2-3 పెరుగుదల కన్పించింది. ఫ్రెంచి బీన్స్, క్యారెట్, చిక్కుడు, బీర, బెండ, కాప్సికమ్ కిలో ధర రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. వంకాయ, దొండ, దోస, సొర, కాకర, క్యాబేజీ, గోరుచిక్కుడు, బీట్‌రూట్, పొట్ల, కంద వంటివన్నీ కేజీ రూ.20-36 మధ్యలో లభిస్తున్నాయి.
తగ్గిన సరఫరా..
శివార్లలో పండిన మిర్చి, టమాటా దిగుబడులు పూర్తికావడంతో దిగుమతులపైనే నగర మార్కెట్ ఆధారపడాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటా, అనంతపూర్, బెల్గామ్‌ల నుంచి పచ్చి మిర్చి నగరానికి సరఫరా అవుతోంది. ఇప్పుడు అక్కడే మంచి ధరలు లభిస్తుండటంతో హైదరాబాద్‌కు తక్కువ మొత్తంలో సరుకు దిగుమతి అవుతోంది. నగర డిమాండ్‌కు తగినంతగా సరుకు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నగర అవసరాలకు నిత్యం 350-400 టన్నుల టమాటా దిగుమతయ్యేది.
శనివారం బోయిన్‌పల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు మదనపల్లి నుంచి కేవలం 900 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయింది. రోజుకు 80-100 టన్నులు దిగుమతి అయ్యే పచ్చిమిర్చి శనివారం కేవలం 230 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు గణనీయంగా పడిపోవడంతో ప్రధానంగా మిర్చి, టమాటాకు నగరంలో కొరత ఏర్పడిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కొరతే ధరలు పెరగడానికి దారితీసినట్టు వారు పేర్కొంటున్నారు. ఇదే అదనుగా భావించి ఉత్పత్తి పుష్కలంగా ఉన్న కూరగాయల ధరలను కూడా పెంచేసి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు.
ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి..
కూరగాయల ధరలు పెరిగినప్పుడు గృహిణులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. టమాటా, పచ్చిమిర్చిల స్థానే చింతపండు, ఇమ్లీ పౌడర్, ఎండు మిర్చి, కారం పౌడర్‌ను వినియోగించడం శ్రేయస్కరం. స్థానికంగా సాగవుతున్న కొత్తపంట చేతికి రావడానికి మరో రెండు నెలలు పడుతుంది. అప్పటివరకు కూరగాయల ధరలు అస్థిరంగా ఉంటాయి. ప్రస్తుతం టమాటా, మిర్చి అధికంగా ఉత్పత్తి అవుతున్న ప్రాంతాల నుంచి నగరానికి దిగుమతి చేసుకునేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపడుతోంది. ఉన్నంతలో ధరల నియంత్రణకు గట్టిగా కృషి చేస్తున్నాం.
- వై.జె.పద్మహర్ష, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ