న్యూఢిల్లీ: దేశ రిటైల్ మార్కెట్ 2032 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు (రూ.164 లక్షల కోట్లు) చేరుకుంటుందని రిటైల్ వర్తకుల అసోసియేషన్ (రాయ్), ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సంయుక్తంగా విడుదల చేసిన ఓ నివేదిలో పేర్కొన్నాయి. 2021 నాటికి రిటైల్ మార్కెట్ పరిమాణం 690 బిలియన్ డాలర్లు (56.5 లక్షల కోట్లు)గా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. సంఘటిత రిటైల్ రంగం విక్రయాలు 2021–22 నాటికి 52 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2028 నాటికి 136 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని పేర్కొంది.
వచ్చే 4–5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 25 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో కొత్త మాల్ వసతులను అభివృద్ధి చేయనున్నట్టు అంచనా వేసింది. 2022లో ఈ ఏడు పట్టణాల్లో 2.6 మిలియన్ చదరపు అడుగుల కొత్త మాల్ విస్తీర్ణం తోడైనట్టు తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువని పేర్కొంది.
2022 చివర్లో పండుగల సమయంలో విక్రయాల విలువ రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని, గతేడాదితో పోలిస్తే ఇది 2.5 రెట్లు అధికమని అనరాక్ రిటైల్ సీఈవో, ఎండీ అనుజ్ కేజ్రీవాల్ తెలిపారు. సంఘటిత రిటైల్ మార్కెట్ ఏటా 25 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చూస్తుందని చెప్పారు.
మూడు పట్టణాల్లో ఎక్కువ వసతులు
భారత రిటైల్ రంగం 2019 నుంచి 2022 మధ్య 1,473 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 51 మిలియ్ చదరపు అడుగులకు పైన మాల్ వసతులు ఉంటే, అందులో ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు 62 శాతం వాటా ఆక్రమిస్తున్నట్టు చెప్పారు.
2022లో సగటున మాల్ అద్దె 15 శాతం పెరిగిందని, బెంగళూరులో అత్యధికంగా అద్దెలు 27 శాతం పెరిగితే, ఆ తర్వాత కోల్‌కతాలో 20 శాతం అధికమైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ–రిటైల్ మార్కెట్ పరిమాణం 2025–26 నాటికి 120–140 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment