న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లలో ఒకటైన భారత్ 2032 నాటికల్లా 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఇది 844 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో అసంఘటిత రిటైల్ మార్కెట్ వాటా 87%గా ఉంది. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ సుబ్రమణియం వి. ఈ విషయాలు తెలిపారు.
‘రిటైల్ రంగం ఏటా 10 శాతం వృద్ధితో 2032 నాటికి ఏకంగా 2 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలవనుంది‘ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వ హించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అమ్మకాల పరిమాణం తక్కువ స్థాయిలో ఉండటం, ఆర్థిక వనరుల కొరత వంటి సమస్యల కారణంగా అసంఘటిత రిటైల్ రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ వినియోగం ఉండటం లేదని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో పరిశ్రమ సమ్మిళిత, సుస్థిర వృద్ధికి తోడ్పడేలా వ్యాపార నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సుబ్రమణియం చెప్పారు. అసంఘటిత రంగంలోని చిన్న వ్యాపారా ల సమ్మిళిత వృద్ధికి సహకరించేలా ప్రభుత్వ పాలసీ లు, బడా కంపెనీల వ్యాపార విధానాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న స్థాయి తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆధునీకరించుకుని, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు దోహదపడే విధమైన కొనుగోళ్ల వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
లైసెన్సింగ్ విధానం మెరుగుపడాలి ..
రిటైల్ రంగానికి లైసెన్సింగ్ వంటి అంశాలపరంగా సమస్యలు ఉంటున్నాయని సుబ్రమణియన్ చెప్పారు. ప్రస్తుతం ఒక రిటైల్ స్టోర్ ప్రారంభించాలంటే 10 నుంచి 70 వరకు లైసెన్సులు తీసుకోవాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ఇలా వివిధ లైసెన్సుల అవసరం లేకుండా వ్యాపార సంస్థకు ఒకే లైసెన్సు సరిపోయేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. మరోవైపు దేశీయంగా సరఫరా వ్యవస్థపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరిన్ని పెట్టుబడులు అవసరమని సుబ్రమణియన్ తెలిపారు.
ప్రధానమైన సోర్సింగ్ ప్రాంతాలను అవసరానికి తగినట్లు విస్తరించుకోగలిగేలా గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానించాలని ఆయన చెప్పారు. తద్వారా సోర్సింగ్‌కు పట్టే సమయం తగ్గుతుందని, ఉత్పత్తుల రవాణా కూడా వేగవంతం కాగలదని పేర్కొన్నారు. ఇటు స్టోర్స్‌లోనూ, అటు ఈ–కామర్స్‌లోను కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం రిటైల్ రంగంలో క్రమంగా పెరుగుతోందని సుబ్రమణియన్ వివరించారు. 5జీ రాకతో ఇది మరింతగా పుంజుకోగలదని పేర్కొన్నారు.
రిటైల్, ఈ–కామర్స్ పాలసీలపై కేంద్రం కసరత్తు
డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్
దేశీయంగా రిటైల్ రంగం వృద్ధికి ఊతమిచ్చే దిశగా జాతీయ స్థాయిలో రిటైల్ వాణిజ్యం, ఈ–కామర్స్ విధానాలను రూపొందించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన రుణ లభ్యత మొదలైన వాటి రూపంలో భౌతిక స్టోర్స్‌ను నిర్వహించే వ్యాపార వర్గాలకు ఇది తోడ్పాటునిచ్చే విధంగా ఉంటుందని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు.
అటు ఆన్‌లైన్ రిటైలర్ల కోసం కూడా ఈ–కామర్స్ పాలసీని రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. రిటైల్ ట్రేడర్ల కోసం ప్రమాద బీమా పథకంపైనా కసరత్తు జరుగుతోందని, ప్రధానంగా చిన్న ట్రేడర్లకు ఇది సహాయకరంగా ఉండగలదని ఎఫ్‌ఎంసీజీ, ఈ–కామర్స్‌పై సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ చెప్పారు. భౌతిక, ఆన్‌లైన్ రిటైల్ వాణిజ్యం రెండింటి మధ్య వైరుధ్యమేమీ లేదని, ఒకటి లేకుండా రెండోది మనలేదని ఆయన తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)తో ఈ–కామర్స్ వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, కొన్ని ఈ–కామర్స్ దిగ్గజాల గుత్తాధిపత్యానికి బ్రేక్ పడుతుందని సంజీవ్ వివరించారు. నాణ్యతలేని ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే లక్ష్యంతో వివిధ ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడంపై కేంద్రం దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment