న్యూఢిల్లీ: దేశీ రిటైల్ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా రిలయన్స్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇప్పటికే పలు సంస్థలను కొనుగోలు చేసిన కంపెనీ తాజాగా జర్మనీ దిగ్గజం మెట్రో ఏజీకి భారత్‌లో ఉన్న టోకు వ్యాపార విభాగాన్ని దక్కించుకుంటోంది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్) మెట్రో ఏజీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ డీల్ విలువ రూ. 2,850 కోట్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ డీల్ పూర్తి కానుంది. ‘చిన్న వ్యాపారస్తులు, సంస్థల క్రియాశీలక భాగస్వామ్యంతో విశిష్టమైన వ్యాపార వ్యూహాన్ని రూపొందించుకోవాలన్న మా లక్ష్యానికి మెట్రో ఇండియా కొనుగోలు తోడ్పడుతుంది‘ అని ఆర్‌ఆర్‌వీఎల్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ‘వృద్ధి చెందుతున్న, లాభదాయక హోల్‌సేల్ వ్యాపారాన్ని సరైన సమయంలో విక్రయిస్తున్నాం.
మెట్రోను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు రిలయన్స్ సరైన భాగస్వామి కాగలదని మేము విశ్వసిస్తున్నాం‘ అని మెట్రో ఏజీ సీఈవో స్టీఫెన్ గ్రూబెల్ పేర్కొన్నారు. రిలయన్స్ ఇప్పటిదాకా భారీ కిరాణా స్టోర్స్ వ్యవస్థపై ప్రధానంగా దృష్టి పెట్టిందని, మెట్రో హోల్‌సేల్ బిజినెస్ కొనుగోలు చేయడం దానికి ఉపయోగకరంగా ఉండగలదని కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ వెల్లడించింది. లాట్స్ హోల్‌సేల్ సొల్యూషన్స్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న సియామ్ మాక్రో వంటి సంస్థలు కూడా మెట్రోను కొనుగోలు చేసేందుకు పోటీపడినా చివరికి రిలయన్స్ దక్కించుకుంది.
రూ. 7,700 కోట్ల అమ్మకాలు ..
భారత్‌లో మెట్రో కార్యకలాపాలు 2003లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 21 నగరాల్లో 31 స్టోర్స్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. వీటిలో సగం స్టోర్స్ దక్షిణాదిలోనే ఉన్నాయి. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. పండ్లు, కూరగాయలు మొదలుకుని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తుల వరకూ వివిధ ఉత్పత్తులను హోటల్స్, రెస్టారెంట్లు, ఆఫీసులు, కంపెనీలు, చిన్న రిటైలర్లు, కిరాణా స్టోర్స్ మొదలైన వర్గాలకు మెట్రో విక్రయిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 7,700 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. కంపెనీ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం. 30 లక్షల మంది వ్యాపార కస్టమర్లు ఉండగా 10 లక్షల కస్టమర్లు క్రమం తప్పకుండా కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు.
16 వేల పైగా రిలయన్స్ స్టోర్స్..
ఆర్‌ఆర్‌వీఎల్‌కు 16,600 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. 18 బిలియన్ డాలర్ల ఆదాయాలతో ప్రపంచంలో టాప్ రిటైలర్ల జాబితాలో 56వ స్థానంలో ఉంది. అత్యంత వేగంగా వృద్ధి చెందితున్న రిటైల్ సంస్థల లిస్టులో దక్షిణ కొరియాకు చెందిన కూపాంగ్ తర్వాత రెండో స్థానంలో ఉంది. జస్ట్ డయల్, డన్‌జోలను కొనుగోలు చేయడంతో పాటు ఇటీవలే ఇండిపెండెన్స్ పేరిట సొంత ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌ను కూడా ఆవిష్కరించింది.
దేశీ రిటైల్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 60 లక్షల కోట్లుగాను, ఇందులో సంఘటిత రంగం వాటా 12%గా ఉంటుందని అంచనా. సంఘటిత రంగంలోని ఫుడ్, గ్రోసరీ విభాగంలో రిలయన్స్‌కు ఇప్పటికే 20 శాతం వాటా ఉంది. పోటీ సంస్థ ‘మోర్’తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని కూడా రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు 2020లో రిలయన్స్ ప్రకటించింది. కానీ, రుణదాతల నుంచి మద్దతు లభించకపోవడంతో దాన్నుంచి విరమించుకుంటున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది.
ఎగ్జిన్‌లో 23.3% వాటాలు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎగ్జిన్ టెక్నాలజీస్‌లో తమ అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్ 23.3 శాతం వాటాలు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకోసం 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 207 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. జీపీఎస్ వంటి నేవిగేషన్ టెక్నాలజీ లేకపోయినా క్లిష్టమైన ప్రాంతాల్లోనూ డ్రోన్లు, రోబోలు తిరిగేందుకు ఉపయోగపడే అటానమీ సాంకేతికతను ఎగ్జిన్ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment