రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు ఇటీవల మందగించడానికి కారణమైన రిఫైనింగ్ మార్జిన్లు పుంజుకున్నా, రిటైల్ విభాగం తీరుతెన్నులను అంచనా వేయడం కష్టతరమేనని బ్రోకరేజి సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. రిటైల్ ఆదాయంపై అనిశ్చితి నెలకొన్నట్లు ఒక నివేదికలో వివరించింది. మార్కెట్లు బలహీనంగా ఉండడంతో జియో/రిటైల్ విభాగాల లిస్టింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
నివేదిక ప్రకారం జూన్ నుంచి గణనీయంగా పడిపోయిన రిఫైనింగ్ మార్జిన్లు క్రమంగా మెరుగుపడ్డాయి. అయితే, రిటైల్ రంగం మందగమనంతో పాటు కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రభావాలు ఉండటంతో రిలయన్స్ రిటైల్‌కి సంబంధించి సమీప భవిష్యత్తు అంచనాలను వేయలేని పరిస్థితి నెలకొందని నివేదిక వివరించింది. జులై 8 నాటి గరిష్ట స్థాయి నుంచి రిలయన్స్ షేరు 22 శాతం క్షీణించిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా వాటితో పోలిస్తే రిలయన్స్ ఆకర్షణీయమైన ధరలో లభిస్తోందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ గవర్నర్‌కు ఛాతీ నొప్పి
రిలయన్స్‌లో ప్రధానంగా మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. మొదటిది ఆయిల్ రిఫైనింగ్.. పెట్రోకెమికల్, రెండోది టెలికం విభాగం జియో, మూడోది రిటైల్ సెగ్మెంట్. వీటితో పాటు మీడియా, న్యూఎనర్జీ వ్యాపారాలూ ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయంలో సుమారు 50 శాతం వాటా రిటైల్, టెలికం విభాగాలదే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment