వచ్చే ఏడాది ఆరంభానికల్లా మరో 100 స్టోర్ల ఏర్పాటు
ప్రస్తుత 900 స్టోర్లలో 330కి పైగా తెలుగు రాష్ట్రాల్లోనే..
తొలి స్టోర్ కూడా ఇక్కడే... అందుకే ఈ ప్రాంతం ప్రత్యేకం
‘సాక్షి’తో రిలయన్స్ రిటైల్ సీఈవో దామోదర్ మాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చమురు నుంచి టెలికామ్ వరకూ అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్... తన రిటైల్ బిజినెస్‌ను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం సుమారు 900 పైచిలుకు ఉన్న బిగ్ బాక్స్ స్టోర్స్ (స్మార్ట్ బజార్, స్మార్ట్ స్టోర్స్) సంఖ్యను వచ్చే ఏడాది ఆరంభానికల్లా వెయ్యికి పెంచుకోనుంది. చిన్న పట్టణాల్లో కూడా స్టోర్స్‌కి ఆదరణ లభిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ గణనీయంగా విస్తరిస్తున్నట్లు సంస్థ రిలయన్స్ రిటైల్ సీఈవో (గ్రోసరీ రిటైల్ బిజినెస్) దామోదర్ మాల్ తెలియజేశారు.
‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన... రిలయన్స్ రిటైల్‌కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలను సమగ్రంగా వివరించారు. ఐఐటీ, ఐఐఎంలో విద్యాభ్యాసం చేసిన దామోదర్, యూనిలీవర్‌లో తన కెరీర్‌ను ఆరంభించారు. వ్యాపారవేత్తగా సొంతంగా సూపర్‌మార్కెట్ వెంచర్‌ను కూడా నిర్వహించారు. ఫ్యూచర్ గ్రూప్ తర్వాత రిలయన్స్ రిటైల్‌లో వేల్యూ ఫార్మాట్‌కి (స్మార్ట్ బజార్, రిలయన్స్ ఫ్రెష్ మొదలైనవి) సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే భారతీయ వినియోగదారుల పోకడలను, సూపర్ మార్కెట్ల తీరుతెన్నులను గురించి వివరిస్తూ ‘సూపర్‌మార్కెట్‌వాలా’, ‘బీ ఎ సూపర్‌మార్కెట్‌వాలా’ పుస్తకాలు కూడా రాశారు. రిలయన్స్ రిటైల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.
తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది...
రిలయన్స్ రిటైల్‌కి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యముంది. ఎందుకంటే తొలి రిటైల్ స్టోర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించాం. అలాగే తక్కువ ప్రాంతంలో ఎక్కువ స్టోర్స్ ఉన్నది కూడా ఇక్కడే. పండ్లు, ఎఫ్‌ఎంసీజీ, దుస్తులు, ఆహారోత్పత్తులు మొదలైనవన్నీ లభించే మా స్మార్ట్ బజార్ స్టోర్స్‌కి కూడా ఇక్కడ ప్రాధాన్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఫార్మాట్లకు సంబంధించి 180 పైచిలుకు స్టోర్స్ ఉండగా వీటిలో 75 పైగా బిగ్ బాక్స్ స్టోర్స్ ఉన్నాయి.
తెలంగాణలోనూ వివిధ ఫార్మాట్ల స్టోర్స్ 145 పైచిలుకు ఉండగా వాటిలో సుమారు 45 బిగ్ బాక్స్ ఫార్మాట్లో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 330 పైగా స్టోర్స్ ఉన్నాయి. ఇక చిన్న పట్టణాల విషయానికొస్తే, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు, మదనపల్లె మొదలైనవి... అలాగే తెలంగాణలో బోధన్, సిద్దిపేట్ వంటి టౌన్లలో కూడా మా స్టోర్స్‌ను విస్తరించాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మా బిగ్ బాక్స్ స్టోర్స్ 900 పైచిలుకు ఉండగా వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోబోతున్నాం. పెద్ద నగరాల్లోలాగే చిన్న పట్టణాల్లోనూ వేల్యూ యాడెడ్, ప్రీమియం ఉత్పత్తుల కు మంచి డిమాండ్
ఉంటోంది.
ఇక్కడి నుంచే భారీగా కొనుగోళ్లు..
తెలుగు రాష్ట్రాల్లో ఆహారోత్పత్తులకు గణనీయమైన డిమాండ్ ఉంది. ఇక్కడ వాటి విక్రయాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా ఉత్పత్తులను విక్రయించుకునేలా స్థానిక వ్యాపారులకు అవకాశాలు కల్పిస్తున్నాం. పలు లోకల్ బ్రాండ్లకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్లతో కలిసి పని చేస్తున్నాం. ప్రాంతీయంగా వినియోగదారులతో మరింతగా మమేకం అవుతూ ఇటీవల పలు స్టోర్స్‌లో బతుకమ్మ వేడుకలను కూడా నిర్వహించాం.
మెరుగ్గా పండుగ సీజన్..
ప్రస్తుతం పండుగ వేడుకలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. వివిధ పండుగలను కలిసి జరుపుకుంటున్నారు. సాధారణంగా కొన్నాళ్ల క్రితం వరకు ఒక ప్రాంతానికి పరిమితమైన నవరాత్రి, దాండియా, పూజో మొదలైన వాటిని ఇపుడు మిగతా ప్రాంతాల వారు కూడా చేసుకునే ధోరణి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి, వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి మొదలైనవి పెద్ద స్థాయిలో జరుపుకుంటారు. ఇలాంటి పండుగ సీజన్‌లో ఆహారోత్పత్తులు, దుస్తులు, బహుమతులు మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటుంది. కాబట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల నుంచి ఉండే డిమాండ్‌కి అనుగుణంగా మా స్టోర్స్‌ను నిర్వహిస్తున్నాం.
పండుగ సీజన్ సందర్భంగా మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాం. మా స్టోర్స్ విషయానికొస్తే పండుగ సీజన్ చాలా సానుకూలంగా ప్రారంభమైంది. వివిధ కేటగిరీలవ్యాప్తంగా విక్రయాలు బాగున్నాయి. పూజాద్రవ్యాలు, దుస్తులు మొదలైన వాటికి డిమాండ్ ఉంటోంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రిటైల్ పోటీపడుతున్నాయని అనుకోవడం కన్నా ఒకదానికి మరొకటి అనుబంధంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. అందుకే వీటన్నింటినీ కలిపి ఆమ్నిచానల్‌గా వ్యవహరిస్తున్నాం. ఇక, ఆన్‌లైన్‌లో ఫేక్ ఆఫర్ల విషయాల్లో వినియోగదారులు జాగ్రత్త వహించక తప్పదు. అపరిచితుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకుండా, విశ్వసనీయమైన చోటే కొనుగోలు చేయడం శ్రేయస్కరం.
Comments
Please login to add a commentAdd a comment