న్యూఢిల్లీ: దేశీయంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలుకు కేంద్రం కొత్త పేరు పెట్టింది. ఇప్పటివరకూ ‘ట్రైన్ 18’గా వ్యవహరిస్తున్న ఈ రైలుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ అని నామకరణం చేసినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వారణాసి–ఢిల్లీ మధ్య ఈ రైలు పరుగులు పెడుతుందని వెల్లడించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూ.97 కోట్ల వ్యయంతో 16 బోగీలున్న ఈ రైలును నిర్మించిందని పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారత ఇంజనీర్లు 18 నెలల్లోనే పూర్తి ఏసీ సౌకర్యం ఉన్న ఈ రైలును అభివృద్ధి చేశారన్నారు. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉంటాయన్నారు. లోకోమోటివ్‌ల అవసరం లేకుండా నడిచే తొలి రైలుగా ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ చరిత్ర సృష్టించిందని గోయల్ తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద ప్రపంచస్థాయి ప్రమాణాలతో రైళ్లను నిర్మించగలమని ఈ ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’తో తేటతెల్లమయిందన్నారు. వారణాసి–ఢిల్లీ మధ్య పరుగులు పెట్టే ఈ రైలు కాన్పూర్, అలహాబాద్‌లో ఆగుతుందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనల ఆధారంగానే ఈ పేరును ఖరారు చేసినట్లు గోయల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ త్వరలోనే ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభిస్తారని ప్రకటించారు. ఈ తరహా రైళ్ల తయారీని వేగవంతం చేయాలని తాను రైల్వే బోర్డును కోరారనీ, దీనివల్ల రైళ్ల సగటు ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment