ముంబై: ఆఖరి గంటలో బ్యాంకింగ్, ఐటీ, ఇంధన షేర్లలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు క్షీణించి 57,061 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 143 పాయింట్లు పతనమై 17,103 వద్ద నిలిచింది. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతుండటం దేశీయ మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు.
అధిక వెయిటేజీ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు 1% చొప్పున క్షీణిం చా యి. విస్తృత స్థాయి అమ్మకాలతో బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ అర శాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,872 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.3,981 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, చైనా, ఇండోనేసియా మార్కెట్లు నష్టపోగా.., జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యుద్ధం తారాస్థాయికి చేరడంతో యూరప్ మార్కెట్లు ఆరశాతానికి పైగా పతనమయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి 18 పైసలు బలపడి 76.43 వద్ద స్థిరపడింది.
అమ్మకాల మోత
సెన్సెక్స్ ఉదయం 297 పాయింట్ల లాభంతో 57,818 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 17,245 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు సాఫీగా ర్యాలీ చేశాయి. ఒకదశలో సెన్సెక్స్ 454 పాయింట్లు పెరిగి 57,975 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు ఎగసి 17,378 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ మరోగంటలో ముగుస్తుందనే సమయంలో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు ఎగబడ్డారు.
దీంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోవడమే కాకుండా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.‘‘అంతర్జాతీయ అనిశ్చితులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో వారాంతాన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. మార్కెట్ పతనంతో దిగివచ్చిన వృద్ధి ఆధారిత, రక్షణాత్మక షేర్లను కొనుగోలు చేయడం మంచిది. ఎల్‌ఐసీ ఐపీఓ రానున్న రోజుల్లో మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే వీలుంది’’ అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
రెయిన్‌బో చిల్డ్రన్ ఐపీఓ 12.43 రెట్ల సబ్‌స్క్రిప్షన్
మల్టీ స్పెషాలిటీ పిల్లల హాస్పిటల్ చెయిన్ రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ పబ్లిక్ ఇష్యూకు చివరి రోజు నాటికి 12.43 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ 2.05 కోట్ల షేర్లను జారీ చేయగా.., 25.49 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి అత్యధికంగా 38.90 రెట్లు బిడ్స్ దాఖలుకాగా.. సంస్థాగతేతర పెట్టుబడిదారుల విభాగంలో 3.73 రెట్లు స్పందన లభించింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.38 రెట్లు అధిక బిడ్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment