పడకేసిన ‘జెట్‌’ | Jet Airways Finally Ended Its Journey Facing Debt Crisis | Sakshi
Sakshi News home page

పడకేసిన ‘జెట్‌’

Published Fri, Apr 19 2019 3:45 AM | Last Updated on Fri, Apr 19 2019 3:45 AM

Jet Airways Finally Ended Its Journey Facing Debt Crisis - Sakshi

నాలుగైదు నెలలుగా ఆకాశయానంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎలాగోలా నెట్టుకొస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ చివరకు తన ప్రయాణాన్ని ముగించింది. అమృత్‌సర్‌–న్యూఢిల్లీ మధ్య బుధవారం రాత్రి నడిపిన విమానంతో ఆ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిధుల కొరతతో నీరసపడిన సంస్థను ఆదుకునేందుకు రూ. 400 కోట్ల మేర అత్యవవసర నిధుల్ని అందించాలన్న బోర్డు ప్రతిపాదనకు బ్యాంకులు ససేమిరా అనడంతో అది పడకేసింది. సంస్థను విక్రయించే ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, దానికి మున్ముందు ఎదురయ్యే అడ్డంకులేమిటో ఇప్పుడే ఎవరూ చెప్పే స్థితి లేదు. విమానయాన రంగంలో ఇంతవరకూ మూతబడిన సంస్థల్లో ఏ ఒక్కటీ తెరుచుకున్న దాఖలా లేదు గనుక జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా ఆ దోవనే చరిత్రలో కలిసిపోతుందా అని కొందరు ఆందోళనపడుతున్నారు.
(చదవండి : ‘జెట్‌ రూట్లలో ఎయిర్‌ఇండియా సర్వీసులు’)

దేశంలో ఆర్థిక సంస్కరణలు మొగ్గతొడిగి, ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేస్తున్న తొలిరోజుల్లో అవకాశాలను ఒడిసిపట్టుకుని జెట్‌ ఎయిర్‌వేస్‌ పేర సొంత విమానయాన సంస్థతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన నరేష్‌ గోయల్‌ 2012 నాటికి దాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ప్రయాణీకుల వాటాలో అగ్ర తాంబూలం అందుకున్నారు. ఆ తర్వాతే కష్టాలు మొదలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నకొద్దీ అవి పెరుగుతూపోయాయి. వరస సంక్షోభాలు వెంటతరుముతుంటే చివరకు రూ. 8,500 కోట్ల అప్పుల్ని ఎలా తీర్చాలో దిక్కుతోచని స్థితికి ఆ సంస్థ చేరుకుంది.

ఒకప్పుడు 124 విమానాలతో రోజుకు 600 సర్వీసులు నడిపిన ఆ సంస్థ గత కొన్ని వారాలుగా అయిదారు విమానాలతో, దాదాపు 40 సర్వీసులతో నెట్టుకొస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా అవి కూడా నిలిచిపోవడంతో ప్రయాణీకులకు వేలాదికోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రపంచ దేశాల్లోని విమానయాన సంస్థలు అనేకం లాభాల దారిలో దూసుకుపోతుంటే మన సంస్థలే ఇలా కళ్లు తేలేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత అయిదేళ్లలో దేశంలోని పెద్దా చిన్నా ప్రైవేటు విమానయాన సంస్థలు ఆరు మూతబడగా, ఇది ఏడోది. 2012లో మూతబడిన కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తర్వాత జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థే పెద్దది. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను కేంద్రం ఎప్పటికప్పుడు ఆదుకుంటూ దాన్ని నిలబెడుతోంది. 

ఒకపక్క దేశంలో 2016–18 మధ్య ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు 50 లక్షలమంది ఉద్యోగాలు గల్లంతయ్యాయని అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ నివేదిక వెలువరించినరోజే 23,000మందికి ప్రత్యక్షంగా, మరిన్ని వేలమందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఒక పెద్ద విమానయాన సంస్థ మూతబడటం ఆందోళన కలిగించే అంశం. ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక మన దేశంలో విమానయాన రంగానికి ప్రాముఖ్యత పెరిగింది. అది దేశాభివృద్ధికి దోహదపడే మౌలిక సదుపాయ రంగంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కనుకనే ఈ రంగం వెలుగులీనుతుందని అందరూ జోస్యం చెప్పారు.

ఇప్పటికీ అందరూ ఆ మాటే అంటున్నారు. ఆర్నెల్లక్రితం అంతర్జాతీయ విమానయాన సంఘం(ఐఏటీఏ) ఏకరువుపెట్టిన గణాంకాలు కూడా ఆశావహంగా ఉన్నాయి. దాని ప్రకారం రాగల ఇరవైయ్యేళ్లలో ప్రపంచ విమానయానంలో చైనా, అమెరికాల తర్వాత భారత్‌ది మూడో స్థానం. 2037నాటికల్లా భారత విమానయాన ప్రయాణికుల సంఖ్య 57.2 కోట్లకు చేరుకుంటుందని దాని అంచనా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లమంది ప్రయాణికులుండగా అది 2037నాటికి రెట్టింపవుతుందని తెలిపింది. నెలవారీ గణాంకాలు చూసినా పరిస్థితి బాగానే ఉంది. మొన్న జనవరిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య కోటీ 25 లక్షల పైమాటేనని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) ప్రకటించింది. వీటిని గమనిస్తే విమానయానం నానాటికీ వృద్ధి చెందుతుందన్న భావం కలుగుతుంది.

ప్రయాణికుల సంఖ్య మాత్రమే కాదు...సరుకు రవాణాలోనూ వృద్ధి రేటు బాగానే ఉంది. ఇన్ని అనుకూలతలనూ మూలకు నెట్టి విమానయాన సంస్థలను కుంగదీస్తున్న సమస్యలెన్నో ఉన్నాయి. దేశీయ విమానయాన సర్వీసులకు వినియోగిస్తున్న ఇంధనంపై పన్నుల బాదుడు, వేరే సంస్థలతో పోటీపడి చార్జీలు తగ్గించాల్సి రావడం, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల లేమితో డిమాండ్‌కు తగినట్టుగా అదనపు విమానాలను ప్రవేశపెట్టలేకపోవడం వగైరా కారణాలు ప్రస్తుత స్థితికి దోహదపడ్డాయని చెబుతున్నారు. దానికితోడు 2007లో రూ. 1,450 కోట్లు వెచ్చించి కొన్న ఎయిర్‌ సహారాతో అదనపు భారం పడిందంటున్నారు. విమాన ఇంధనాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని విమానయాన సంస్థల డిమాండ్‌పై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం కూడా ప్రస్తుత స్థితికి కారణం.

ఒక విమానయాన సంస్థ మూతబడిందంటే దాని ప్రకంపనలు సాధారణంగా ఉండవు. సంస్థ సిబ్బంది రోడ్డునపడటంతోపాటు విమానాశ్రయాల నిర్వాహకులకూ, ఇంధన సరఫరాదారులకూ ఒక పెద్ద ఖాతాదారు నుంచి వచ్చే నికరాదాయం ఆగిపోతుంది. రంగం నుంచి ఒక విమానయాన సంస్థ తప్పుకున్నప్పుడు తగినంతగా సర్వీసుల లభ్యత లేక ప్రయాణికులకు ఇబ్బందు లెదురవుతాయి. సహజంగానే ఇతర సంస్థలు టికెట్‌ చార్జీలు పెంచుతాయి. ఇదంతా మన విమాన యాన రంగం ప్రతిష్టను మసకబారుస్తాయి.

విషాదమేమంటే ఈ ఏడాది మొదట్లో నరేష్‌ గోయ ల్‌ను పక్కనబెట్టి యాజమాన్య బాధ్యతలు స్వీకరించిన బ్యాంకులు, ఇతర మదుపుదార్లు కనీసం వాటాల విక్రయ ప్రక్రియ పూర్తయ్యేవరకైనా దాన్ని ఏదోవిధంగా నడపాలనుకోలేదు. అప్పులు మినహా విమానాలుగానీ... పైలట్లుగానీ... నిపుణులైన ఇంజనీర్లుగానీ...సిబ్బందిగానీ లేని సంస్థను కొనుగోలుదార్లు ఏం చూసి సొంతం చేసుకుంటారని బ్యాంకులు అనుకున్నాయో అనూహ్యం. ఈ రంగంలోని సంస్థల నిర్వహణపై ఒక కన్నేసి ఉంచి సకాలంలో హెచ్చరించడం, అధిక పన్నుల భారాన్ని తగ్గించడంతోసహా అవసరమైన చర్యలు తీసుకోవడంపై పాలకులు దృష్టి పెట్టాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement