గ్రీస్ దారెటు?
రుణదాతల షరతులపై రిఫరెండం నేడే
ఏథెన్స్: అప్పుల్లో పీకల్లోతు కూరుకుపోయిన గ్రీస్ భవితను తేల్చే రిఫరెండం నేడు(ఆదివారం) జరగనుంది. మరో బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి రుణదాతలు విధిస్తున్న షరతులకు ఓకే చెప్పాలా లేదా అన్నదానిపై జరుగుతున్న రిఫరెండంలో ప్రజలు దేనికి ఓటేస్తారోనని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. యూరోజోన్‌లో గ్రీస్ కొనసాగాలా లేదా అనేది రిఫరెండంపై ఆధారపడి ఉంది. షరతులకు తలొగ్గద్దని, షరతులకు ఒప్పుకోబోమని రిఫరెండంలో తేల్చి చెప్పాలని నిర్వహించిన ర్యాలీలో గ్రీస్ ప్రధాని సిప్రాస్ పాల్గొన్నారు. అయితే, గ్రీస్ ఆర్థిక పరిస్థితులతో విసిగిపోయిన సగం మంది ప్రజలు ఎలాగోలా బెయిలవుట్ ప్యాకేజీ వస్తే కష్టాలు తీరతాయనే ఉద్దేశంతో.. షరతులకు ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రెఫరెండంకి సంబంధించి నిర్వహించిన పోల్స్‌లో 44.8% మంది అనుకూలంగా, 43.4 % మంది వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది.
షరతులేంటి..
గ్రీస్ ఇప్పటికే రెండు బెయిలవుట్ ప్యాకేజీలు దక్కించుకుంది. అయినా కష్టాలు పోలేదు. ఈ నేపథ్యంలో మరో ప్యాకేజీ ఇవ్వాలంటే గ్రీస్ ప్రభుత్వం బడ్జెట్‌లో కోతలు, పన్నుల పెంపు, కఠిన సంస్కరణలు అమలు చేయాలని రుణదాతలు షరతులు పెట్టారు. వీరికి నో చెప్పడం ద్వారా రుణదాతలతో బేరసారాలకు వీలు దొరుకుతుందన్నది గ్రీస్ ప్రభుత్వం వాదన. యూరోపియన్ యూనియన్, ఐఎంఎఫ్‌లు కలిసి 2010 నుంచి గ్రీస్‌కు సుమారు 240 బిలియన్ యూరోల రుణాలిచ్చాయి.
నో చెబితే..
రిఫరెండంలో షరతులకు ప్రజలు నో చెబితే నిధుల కొరతతో బ్యాంకులు మూతబడి గ్రీస్ మరింత సంక్షోభంలోకి వెళ్తుంది. ఇంధనం నుంచి ఔషధాల దాకా ప్రతీ దానికీ కొరత ఏర్పడవచ్చు. యూరోజోన్‌లో భాగంగా యూరో కరెన్సీలో ఉన్న గ్రీస్ ఇకమీదట కొత్తగా సొంత కరెన్సీని ముద్రించుకోవాలి. గ్రీస్ బ్యాంకుల దగ్గర ప్రస్తుతం సుమారు బిలియన్ యూరోల నిధులు ఉన్నాయి. ఇవి సోమవారం దాకా సరిపోతాయి. రిఫరెండంలో నో చెబితే బ్యాంకులకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి నిధులు రావు. కొత్త డీల్ కుదుర్చుకోవడంలో ప్రధాని విఫలమైతే ఆయన గద్దె దిగాల్సిన పరిస్థితి వస్తుంది.
ఓకే చెబితే..
ప్రజలు రిఫరెండంలో యస్ అని చెబితే, ప్రధాని వైదొలగాల్సి రావొచ్చు. ఎన్నికలు నిర్వహించాలి. అయితే, దేశ ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడమన్నది కష్టసాధ్యం కావొచ్చు. దీంతో అధికారిక సిరిజా పార్టీలోనే మితవాదిగా కాస్త పేరున్న ఉప ప్రధాని యానిస్ డ్రాగాసాకిస్ లాంటి వారికి పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.