
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు (ఆర్‌కామ్) ఐటీ రిఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్ల నిధులపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని బ్యాంకులు స్పష్టంచేశాయి. ఇదే విషయాన్ని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌ఏటీ) చెప్పాయి. తమకు చెందాల్సిన నిధులతో ఎరిక్సన్‌కి ఇవ్వాల్సిన బాకీలను ఆర్‌కామ్ తీరుస్తానంటే కుదరదని తెగేసి చెప్పాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్‌కు చెల్లించడం కోసం రిటెన్షన్, ట్రస్ట్ ఖాతాలో ఉన్న ఐటీ రిఫండ్ నిధులను ఉపయోగించుకునేలా అనుమతించాలంటూ ఆర్‌కామ్ వేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ కొనసాగింది.
ఈ సందర్భంగా బ్యాంకుల తరఫున సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ ప్రారంభానికి ముందే రిటెన్షన్, ట్రస్ట్ ఖాతా ఏర్పాటైందని, దానికి, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఎరిక్సన్ బాకీల భారాన్ని ఆర్‌కామ్ బ్యాంకులపై రుద్దడం కుదరదని తెలిపారు. ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదాపడింది.