
సాక్షి, ముంబై : చుట్టూ సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపునకు భారీ ఊరట లభించింది. తనఖా పెట్టిన షేర్లను విక్రయించకుండా రుణదాతలతో అనిల్ అంబానీ గ్రూప్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో అడాగ్ గ్రూపు షేర్లు లాభాల పరుగందుకున్నాయి.. సెప్టెంబర్‌వరకూ తనఖా షేర్లను విక్రయించకుండా 90 శాతం రుణదాతలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అడాగ్ తాజాగా వెల్లడించింది. ఇందుకువీలుగా రుణాలకు సంబంధించిన వాయిదా చెల్లింపులను సమయానుగుణంగా చెల్లించే విధంగా అడాగ్ రుణదాతలకు హామీ ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది.
ముఖ్యంగా ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకున్న అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు నష్టాల మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏకంగా 12 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 12 శాతం, రిలయన్స్ కేపిటల్ దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ పవర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ సైతం లాభాల బాటపట‍్టడం విశేషం.
కాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్ గ్రూప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి.