న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించడంపై బ్యాంకులు కసరత్తు కొనసాగిస్తున్నాయి. సంస్థను పునరుద్ధరించే దిశగా త్వరలోనే మరిన్ని నిధులు సమకూర్చే అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. జెట్ ఎయిర్‌వేస్‌పై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకునేలా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘జెట్‌ను పునరుద్ధరించేందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఇంకా ఏ ప్రణాళికా ఖరారు కాలేదు‘ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. మరోవైపు, జెట్‌కు రుణాలిచ్చిన సంస్థల ప్రతినిధులు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్‌తో కూడా భేటీ అయ్యారు. రూ.8,000 కోట్ల పైగా రుణభారం ఉన్న జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కంపెనీ 123 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 5కు పడిపోయింది. సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్.. డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. రుణాలిచ్చిన బ్యాంకులు.. కంపెనీ యాజమాన్య అధికారాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. సంస్థకు అత్యవసరంగా రూ.1,500 కోట్ల మేర నిధులను సమకూర్చేలా ప్రతిపాదనలు చేశాయి. 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్స్ కూడా ఆహ్వానించాయి. దీంతో కంపెనీలో వాటాలు దక్కించుకునేందుకు నరేష్ గోయల్ కూడా బిడ్ వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బిడ్డింగ్‌లో పాల్గొనరాదని ఆయన నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి.
సంక్షోభంపై కేంద్రం సమీక్ష...
జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం, పెరుగుతున్న విమాన చార్జీలు, ఫ్లయిట్స్ రద్దు తదితర అంశాలపై సమీక్ష జరపాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల భద్రత, హక్కులను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాకు సూచించారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో ఆయన పోస్ట్ చేశారు. జెట్ వివాదంపై సమీక్షకు ఆదేశించినట్లు ప్రభు ప్రకటించడం వారం రోజుల్లో ఇది రెండోసారి. తక్షణ సాయం కోసం నిధులు అందించాలంటూ బ్యాంకులను జెట్ ఎయిర్‌వేస్ కోరినట్లు ఖరోలా తెలిపారు. సంస్థ ప్రస్తుతం అయిదు విమానాలు మాత్రమే నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
10 రూట్లలో చార్జీల తగ్గింపుపై డీజీసీఏ దృష్టి
జెట్ ఎయిర్‌వేస్ ఫ్లయిట్స్ రద్దు నేపథ్యంలో చార్జీలను రోజువారీ సమీక్షించడం కొనసాగుతోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి తెలిపారు. అలాగే, సత్వరం తగు చర్యలు తీసుకునేందుకు ఎయిర్‌లైన్స్‌తో సంప్రతింపులు జరుగుతున్నాయని వివరించారు. ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో .. రద్దీ ఎక్కువగా ఉండే 40 రూట్లలో చార్జీలు సమీక్షించినట్లు ఆయన పేర్కొన్నారు. పది రూట్లలో చార్జీలు 10–30 శాతం దాకా పెరిగాయని గుర్తించినట్లు .. వాటిని సముచిత స్థాయికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఎయిర్‌లైన్స్‌కు సూచించినట్లు ఖరోలా చెప్పారు. ఏప్రిల్ 18న విమానయాన సంస్థలు, విమానాశ్రయాల ప్రతినిధులతో పౌర విమానయాన శాఖ సమావేశం కానున్నట్లు మరో అధికారి పేర్కొన్నారు. మంగళవారం జెట్ ఎయిర్‌వేస్ షేరు బీఎస్‌ఈలో సుమారు 8 శాతం మేర క్షీణించి రూ. 241.85 వద్ద క్లోజయ్యింది.
జెట్‌పై బ్యాంకుల కసరత్తు
Published Wed, Apr 17 2019 12:46 AM | Last Updated on Wed, Apr 17 2019 12:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment