ఢాకా: బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బంగ్లాదేశ్ హైకోర్టు గురువారం కొట్టేసింది. దేశద్రోహం ఆరోపణలపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్, తదనంతర పరిణామాలపై వార్తపత్రికల్లో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది మొహమ్మద్ మునీరుద్దీన్ సమరి్పంచిన్పటికీ హైకోర్టు ఇస్కాన్‌పై నిషేధానికి నిరాకరించింది.
సుప్రీంకోర్టు న్యాయవాది మొనియుజ్జమాన్ తదితరులు దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ ఫరా మొహబూబ్, జస్టిస్ దెబాశిష్ రాయ్ చౌదరీల హైకోర్టు ధర్మాసనం విచారించింది. కృష్ణదాస్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు తరలిస్తున్న సమయంలో ఛట్టోగ్రామ్‌లో జరిగిన ఘర్షణలు, గాయపడిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) సైఫుల్ ఇస్లాం మరణం తదితరాలను ప్రభుత్వ లాయర్లు ప్రస్తావించారు.
ఇస్కాన్ మద్దతుదారులు, పోలీసుల మధ్య ఘర్షణలు, వేర్వేరు ప్రాంతాల్లో మైనారిటీ హిందువులపై దాడులకు సంబంధించిన నివేదికను అటార్నీ జనరల్ మొహమ్మద్ అసదుజ్జమాన్ హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు ఇస్కాన్‌పై నిషేధం అక్కర్లేదని తేల్చిచెప్పింది. ‘‘ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేస్తూ ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’’అని జడ్జి మహబూబ్ అన్నారు.
పీపీ హత్య, ఇస్కాన్ ఆగడాలలతో 33 మందిని అరెస్ట్‌చేశామని, ఈ నేపథ్యంలో ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ అదనపు అటార్నీ జనరల్ అనీక్ ఆర్ హఖ్, డిప్యూటీ అటార్నీ జనరల్ అసదుద్దీన్ చేసిన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ‘‘శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణగా నిలబడాలి’అని కోర్టు ఆదేశించింది. తీర్పును ఇస్కాన్ బంగ్లాదేశ్ స్వాగతించింది.
‘‘మత, సంక్షోభానికి దారితీసే ఎలాంటి కార్యకలాపాల్లో ఇస్కాన్ బంగ్లాదేశ్ భాగస్వామిగా లేదు. ఐక్యత, మత సామరస్యం గురించి మాత్రమే ఇస్కాన్ ప్రభోదిస్తుంది. తాజా ఘటనలతో ఇస్కాన్‌కు ముడిపెడుతూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మా సంస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ఇతరులు చేస్తున్న కుట్ర ఇది’’అని ఇస్కాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు సత్యరంజన్ బారోయీ, ప్రధాన కార్యదర్శి చారుచంద్ర దాస్ బ్రహ్మచారి మీడియా సమావేశంలో అన్నారు.
మరోవైపు కృష్ణదాస్‌ను వెంటనే విడుదలచేయాలని ఢిల్లీలో ప్రవాసజీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా డిమాండ్‌చేశారు. తీర్పును నిరసిస్తూ మాజీ ప్రధాని ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లాయర్ల విభాగమైన జాతీయతాబాది అయిన్‌జిబీ ఫోరమ్ సభ్యులు గురువారం సుప్రీంకోర్టు బార్ వద్ద ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment