బంగ్లాదేశ్ హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్
చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ తర్వాత కీలక పరిణామాలు
ఢాకా/కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) మాజీ సభ్యుడు, సమ్మిళిత సనాతని జాగరణ్ జోత్ సంఘం సాధువు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిను బంగ్లాదేశ్‌లో అరెస్ట్ చేసిన వేళ అక్కడ మరో కీలక పరిణామం సంభవించింది. ఇస్కాన్‌ను బంగ్లాదేశ్‌లో నిషేధించాలంటూ అక్కడి హైకోర్టులో బుధవారం రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా ఇస్కాన్ మతసంబంధ సంస్థేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ మొహమ్మద్ అసదుజ్జమాల్ కోర్టుకు తెలిపారు. కృష్ణదాస్ అరెస్ట్, ఇస్కాన్, హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా అతివాద ముస్లిం సంఘాల సభ్యుల ఆందోళనలు, మైనారిటీలపై దాడుల నడుమ ప్రభుత్వం తన స్పందన తెలియజేయడం గమనార్హం.
ఘర్షణ ఘటనలో 30 మంది అరెస్ట్
కృష్ణదాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ మైనారిటీ హిందువులు, కృష్ణదాస్ మద్దతుదారులు వేర్వేరు చోట్ల చేపట్టిన ర్యాలీలను బంగ్లాదేశ్ పోలీసులు అడ్డుకోవడంతో చిట్టోగ్రామ్‌లో జరిగిన ఘర్షణ ఘటనలో 30 మందిని అరెస్ట్‌చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లామ్ మరణించిన విషయం తెల్సిందే. అయితే కృష్ణదాస్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, వెంటనే విడుదలచేయాలని బంగ్లాదేశ్ హిందూ బుద్ధి్దస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ డిమాండ్‌చేసింది.
ఐరాస జోక్యం చేసుకోవాలి
17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు కేవలం 8 శాతం మంది ఉన్నారు. ఆగస్ట్ ఐదున షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయాక 50కిపైగా జిల్లాల్లో మైనారిటీలపై 200కుపైగా దాడుల ఘటనలు జరిగాయి. తాజాగా కృష్ణదాస్ అరెస్ట్ తర్వాత మళ్లీ మైనారిటీలపై దాడులు పెరగడంతో ఈ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యంచేసుకోవాలని భారత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ‘‘ అతివాదుల కనుసన్నల్లో అపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. మానవత్వానికి మచ్చతెచ్చే రీతిలో హిందువులపై దాడులు చేస్తున్నారు.
ఈ అంశంలో ఐరాస కలుగజేసుకుని సమస్యకు పరిష్కారం కనుగొనాలి’’ అని గిరిరాజ్ బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో అన్నారు. ఇస్కాన్, హిందువులపై దాడులు ఆగేలా బంగ్లాదేశ్‌పై భారత్ ఒత్తిడి పెంచాలని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ భారత విదేశాంగ శాఖను కోరారు. హిందువుల పరిరక్షణ కోసం ప్రభుత్వమే పాటుపడాలని ఇస్కాన్ బంగ్లాదేశ్ ప్రధాన కార్యదర్శి చారుచంద్రదాస్ బ్రహ్మచారి వేడుకున్నారు. భారత్ పట్ల వ్యతిరేకత, హిందువులపై ముస్లిం అతివాదుల ఆగడాలు, ఉగ్రదాడులతో తమ దేశం వేగంగా అరాచకత్వం వైపు పయనిస్తోందని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహ్‌మూద్ ఆందోళన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment