న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్‌ను (ఆర్‌సీఎల్) కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల సంస్థలు తగు పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు గడువును రుణదాతలు ఆగస్టు 28 వరకూ పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలువ మదింపు కోసం మరింత సమయం కావాలంటూ బిడ్డర్లు కోరడంతో డెడ్‌లైన్‌ను పొడిగించడం ఇది అయిదోసారని పేర్కొన్నాయి. గడువు ఆగస్టు 10తో ముగియాల్సి ఉంది.
బరిలో ఉన్న పిరమల్, టోరెంట్ సంస్థలు సెప్టెంబర్ 30 వరకూ సమయం ఇవ్వాలని కోరగా రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఆగస్టు 30 వరకూ గడువు కోరింది. వాస్తవానికి పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు మే 26 అసలు డెడ్‌లైన్. అప్పటి నుంచి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు గవర్నెన్స్‌పరంగా లోపాలు ఉండటంతో గతేడాది నవంబర్ 29న ఆర్‌సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసి అడ్మినిస్ట్రేటరును నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ విక్రయానికి అడ్మినిస్ట్రేటర్ బిడ్లను ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment