అధిక వడ్డీ రేటు ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న హోమ్, ఆటో, ఇతర లోన్లు తీసుకున్నవారికి ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి స్థిర వడ్డీ రేటుకు మారడానికి రుణగ్రహీతలను అనుమతించే ఫ్రేమ్‌వర్క్ తీసుకురానున్నట్లు తెలిపింది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరిస్తూ ఈ ఫ్రేమ్‌వర్క్ గురించి తెలియజేశారు. ఈ ఫ్రేమ్‌వర్క్ త్వరలో అమలులోకి రానున్నందున లోన్ టెన్యూర్, ఈఎంఐల గురించి రుణగ్రహీతలకు స్పష్టంగా తెలియజేయాలని బ్యాంకులకు సూచించారు. రుణగ్రహీతలకు సమాచారం అందించకుండానే, వారి సమ్మతి లేకుండానే బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ లోన్‌ల టెన్యూర్‌ను అసమంజసంగా పొడిగించిన అనేక ఉదంతాలు తాము చేపట్టిన పర్యవేక్షక సమీక్షలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ద్వారా వెల్లడయ్యాయన్నారు.
రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించడానికి బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు అనుసరించేలా సరైన కండక్ట్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. లోన్ టెన్యూర్, ఈఎంఐ మార్పుల గురించి రుణగ్రహీతలకు బ్యాంకులు స్పష్టంగా తెలియజేసేలా, ఫిక్స్‌డ్ రేట్ లోన్‌లకు మారడం లేదా లోన్‌లను ఫోర్‌క్లోజర్ చేయడానికి సంబంధించిన ఆప్షన్ల గురించి సమాచారం అందించేలా ఈ ఫ్రేమ్‌వర్క్ నియంత్రిస్తుందన్నారు. అలాగే వివిధ ఛార్జీలను పారదర్శకంగా బహిర్గతం చేసేలా చేస్తుందన్నారు. దీనికి సంబంధించి సవివరమైన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Bank Charges: బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగే విషయం.. చార్జీలు ఎన్ని రూ.వేల కోట్లు కట్టారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment