interests
-
సంగీత మమకారం
క్షణం తీరిక లేని పనుల్లో అభిరుచులు చిన్నబోతుంటాయి. ఎందుకంటే సమయాభావం వల్ల వాటి జోలికి వెళ్లం. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అభిరుచుల విషయంలో రాజీ పడదు. సమయం చేసుకొని, చూసుకొని వాటికి న్యాయం చేస్తుంది. దీదీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రసంగించే వక్త మాత్రమే కాదు బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. చక్కగా ఆడుతుంది. కవిత్వం రాస్తుంది. పాటలు పాడుతుంది. బొమ్మలు గీస్తుంది. ఆమె మానసిక బలానికి ఈ సృజనాత్మక శక్తులే కారణం కావచ్చు. అధికార పర్యటనలో భాగంగా ఇటీవల స్పెయిన్‌కు వెళ్లిన మమతా బెనర్జీ, ఒకవైపు సమావేశాలలో పాల్గొంటూనే మరోవైపు తనలోని ఆర్టిస్ట్‌ను అధికారులకు పరిచయం చేసింది. పియానోపై రవీంద్రుడి సంగీతాన్ని వినిపించింది. అంతకుముందు మాడ్రీడ్ వీధుల్లో అకార్డియన్పై ‘హమ్ హోంగే’ గీతాన్ని ప్లే చేసింది. ఈ వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. -
లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్! కొత్త విధానం ప్రకటించిన ఆర్బీఐ
అధిక వడ్డీ రేటు ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న హోమ్, ఆటో, ఇతర లోన్లు తీసుకున్నవారికి ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి స్థిర వడ్డీ రేటుకు మారడానికి రుణగ్రహీతలను అనుమతించే ఫ్రేమ్‌వర్క్ తీసుకురానున్నట్లు తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరిస్తూ ఈ ఫ్రేమ్‌వర్క్ గురించి తెలియజేశారు. ఈ ఫ్రేమ్‌వర్క్ త్వరలో అమలులోకి రానున్నందున లోన్ టెన్యూర్, ఈఎంఐల గురించి రుణగ్రహీతలకు స్పష్టంగా తెలియజేయాలని బ్యాంకులకు సూచించారు. రుణగ్రహీతలకు సమాచారం అందించకుండానే, వారి సమ్మతి లేకుండానే బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ లోన్ల టెన్యూర్‌ను అసమంజసంగా పొడిగించిన అనేక ఉదంతాలు తాము చేపట్టిన పర్యవేక్షక సమీక్షలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ద్వారా వెల్లడయ్యాయన్నారు. రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించడానికి బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు అనుసరించేలా సరైన కండక్ట్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. లోన్ టెన్యూర్, ఈఎంఐ మార్పుల గురించి రుణగ్రహీతలకు బ్యాంకులు స్పష్టంగా తెలియజేసేలా, ఫిక్స్డ్ రేట్ లోన్లకు మారడం లేదా లోన్లను ఫోర్క్లోజర్ చేయడానికి సంబంధించిన ఆప్షన్ల గురించి సమాచారం అందించేలా ఈ ఫ్రేమ్‌వర్క్ నియంత్రిస్తుందన్నారు. అలాగే వివిధ ఛార్జీలను పారదర్శకంగా బహిర్గతం చేసేలా చేస్తుందన్నారు. దీనికి సంబంధించి సవివరమైన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Bank Charges: బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగే విషయం.. చార్జీలు ఎన్ని రూ.వేల కోట్లు కట్టారో తెలుసా? -
రుణగ్రహీతలకు ‘సుప్రీం’ ఊరట!
న్యూఢిల్లీ: తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆగస్టు 31వరకు మొండిపద్దుల కిందకు రాని అకౌంట్లు వేటినీ ఎన్పీఏలుగా ప్రకటించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. మారటోరియం సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ విధింపు అంశాన్ని పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. రెండు వారాల్లో ఈ విషయమై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆర్బీఐ, కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో తుది నిర్ణయానికి ఇదే ఆఖరు అవకాశమని, ఆపై ఈ అంశాన్ని వాయిదా వేయడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కరోనా సంక్షోభం వేళ ఈఎంఐలపై మారటోరియం విధిస్తూ గతంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ వేయడాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, తుది ఆదేశాలు ఇచ్చేవరకు ఆగస్టు 31వరకు ఎన్పీఏలు కాని ఏ అకౌంట్లనూ ఎన్పీఏలుగా ప్రకటించవద్దని ఆదేశించింది. వడ్డీపై వడ్డీతో ఇబ్బంది..: ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రుణ పునర్వ్యవస్థీకరణతో 95 శాతం మంది రుణగ్రహీతలకు న్యాయం జరగదని క్రెడాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు. బ్యాంకులు రుణగ్రహీతల అకౌంట్ల డౌన్‌గ్రేడింగ్ చేస్తూనే ఉన్నాయని, దీన్ని నిలిపివేయాలని, మారటోరియంను పొడిగించాలని కోరారు. బ్యాంకులు మారటోరియం సమయానికి చక్రవడ్డీలు లెక్కకడుతున్నాయని మరో న్యాయవాది రాజీవ్ దత్తా చెప్పారు. లక్షలాది మంది కరోనా కారణంగా ఆస్పత్రుల పాలయ్యారని, అనేకమంది ఉపాధి కోల్పోయారని, ఈ సమయంలో వడ్డీ మీద వడ్డీ అడగడం సబబు కాదని వాదించారు. అయితే ఉన్న నియమాల ప్రకారమే డౌన్‌గ్రేడింగ్ జరుగుతోందని ఆర్బీఐ న్యాయవాది వీ గిరి చెప్పారు. అన్ని అంశాలను అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్నందున రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. తాజా విచారణలో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రభుత్వం అన్ని అంశాలనూ అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తోందని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకొనేందుకు రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. వాదనలన్నీ విన్న కోర్టు 2 వారాల్లో సరైన పరిష్కారంతో రావాలని, ఆపై తాము తుది నిర్ణయం తీసుకుంటామంది. రాజీవ్ మహర్షి నేతృత్వం మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ రద్దు అంశాన్ని సమీక్షించి, సిఫారసులు చేయడానికి రాజీవ్ మహర్షి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. -
వడ్డీకాసులవాడికి వందల కోట్ల వడ్డీ ఆదాయం
సాక్షి, అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వారి పేరిట వివిధ బ్యాంకుల్లో రూ. 7,359 కోట్లు నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లపై ఏటా వడ్డీ రూపంలో టీటీడీకి రూ. 766 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శాసనమండలి హామీల అమలు కమిటీకి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. భక్తులు దర్శన టికెట్ కొనుగోళ్ల ద్వారా టీటీడీకి రెండేళ్ల క్రితం రూ. 210 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది దర్శన టికెట్ల ద్వారా రూ. 256 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే టీటీడీ వార్షిక ఆదాయం రూ. 2,858 కోట్లు. భక్తులు హుండీలో వేసే కానుకల ద్వారా రోజూ రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇతర కానుకల ద్వారా ఈ ఏడాది రూ. 1,110 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టీటీడీకి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతభత్యాలకే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. స్వామి పూజా సామగ్రి, తదితర వస్తువుల కొనుగోలుకు రూ. 300–400 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. హామీల అమలు కమిటీకి టీటీడీ ఇచ్చిన నివేదికలో బ్యాంకు డిపాజిట్ల వివరాలు.. బ్యాంకు నగదు డిపాజిట్లు(రూ. కోట్లలో) విజయా బ్యాంకు 2,938 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 1,965.01 సిండికేట్ బ్యాంకు 945.37 స్టేట్ బ్యాంకు 938.06 కెనరా బ్యాంకు 298.10 సప్తగిరి గ్రామీణ బ్యాంకు 105.09 ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు 36 బ్యాంకు ఆఫ్ ఇండియా 31.55 ఆంధ్రా బ్యాంకు 21.79 ఇతర బ్యాంకులు 52.50 మొత్తం 7,359.42 -
పెద్దోళ్ల’ ప్రయోజనాలకే హరితహారం
విప్లవ కవి వరవరరావు ఇల్లెందు: పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీల ప్రయోజనాల కోసమే హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విప్లవ కవి వరవరరావు విమర్శించారు. తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) చేపట్టిన బస్సు యాత్ర బృందం బుధవారం ఇల్లెందు మండలంలోని ఒంపుగూడెం, కొమురారం, బద్రూతండాలో పర్యటించింది. పోడు భూముల్లో అటవీ శాఖ ధ్వంసం చేసిన పంటలను పరిశీలించింది. అనంతరం.. మాణిక్యారం, కొమురారం సభల్లో బృందం సభ్యుడు వరవరరావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలోగల విశాలమైన అటవీ ప్రాంతానికి సమీపంలో రైల్వే లైన్ ఉంది. గోదావరి నీళ్లు ఉన్నాయి. అందుకే ఇక్కడి అటవీ భూములను పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఇందులో భాగంగానే అడవిని తన స్వాధీనంలోకి తీసుకునేందుకు హరితహారం పేరుతో పోడు భూముల నుంచి గిరిజనులను గెంటేస్తోంది’’ అని విమర్శించారు. రాజ్యాంగం 5వ, 6వ షెడ్యూల్ ద్వారా ఆదివాసీలకు సంక్రమించిన హక్కులను కాలరాస్తోందన్నారు. హరితహారం అసలు లక్ష్యం... పర్యావరణ పరిరక్షణ కాదని, బహుళజాతి సంస్థలు, బడా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు చేకూర్చడమేనని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో రెండు పేపర్ పరిశ్రమలు.. ఒకటి– సిర్పూర్ కాగజ్‌నగర్‌లో, రెండవది– బూర్గంపాడులో ఉన్నాయి. ప్రభుత్వాధీనంలోగల సిర్పూర్ కాగజ్‌నగర్ పరిశ్రమ మూతపడింది. బడా పారిశ్రామిక సంస్థ ప్రయోజనాలో ఇమిడి ఉన్న బూర్గంపాడులోని ఐటీసీ పరిశ్రమను మాత్రం ప్రభుత్వం నడుపుతోంది’’ అని అన్నారు. ‘‘ప్రజల భూములకు రక్షణగా ఉన్న చట్టాలను ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. ఏజెన్సీపై ఆదివాసీలకు సర్వ హక్కులు కల్పిస్తున్న 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. మల్లన్నసాగర్లో భూనిర్వాసితుల పరిహారానికి సంబంధించి 2013 చట్టాన్ని పక్కకునెట్టి, 123 జీఓ తీసుకొచ్చింది. ప్రజల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాగిస్తున్న కుతంత్రాలకు ఇవి ఉదాహరణలు మాత్రమే’’ అని అన్నారు. రానున్న కాలంలో రైతు కమతాలు ఉండవని, సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లే ఉంటాయని అన్నారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలోగల రెండులక్షల ఎకరాలను, అటవీ ప్రాంతంలోగల మూడు లక్షల ఎకరాలను సర్వే చేసి పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ.. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం దాడులను తప్పించుకునేందుకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలోకి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని కేసీఆర్ ప్రభుత్వం గెంటేస్తోంది. గుజరాత్, అమెరికా, ఫ్రాన్స్‌కు చెందినకంపెనీలకు మాత్రం ఇక్కడి అటవీ భూమిని అప్పగిస్తోంది’’ అని విమర్శించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ (చంద్రన్న) రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ (రాయల) నాయకులు గుమ్మడి నర్సయ్య, జగ్గన్న, ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిచంద్ర, జిల్లా కార్యదర్శి మెంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా, ప్రజాఫ్రంట్ ముద్రించిన ‘అడవిపై ఆదివాసీలకే సర్వ హక్కులు’ అనే పుస్తకాన్ని వరవరరావు, నారాయణరావు ఆవిష్కరించారు. ప్రజాఫ్రంట్ కళామండలి ఆటా–పాటా ప్రదర్శించింది. -
అన్నీ అప్పులైతే.. వడ్డీలు కట్టేదెలా?
ప్రతిష్టాత్మక పథకాలకు అప్పులపైనే సర్కారు దృష్టి వేలాది కోట్లు అప్పులు తెస్తే వడ్డీల భారం తడిసిమోపెడు ప్రస్తుతం రూ.800 కోట్లు.. వచ్చే బడ్జెట్లో రూ.1,300 కోట్ల వడ్డీల భారం ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా అప్పులు తెచ్చేందుకు ఉబలాటపడుతున్న కొద్దీ వడ్డీల భారం వెంటాడుతోంది. ప్రతిష్టాత్మక పథకాల అమలుకు వేలాది కోట్లు అప్పులు తెస్తే భవిష్యత్తులో వడ్డీల చెల్లింపులు తడిసిమోపెడవుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే 2016-17 బడ్జెట్ తయారీలో నిమగ్నమైన ఆర్థిక శాఖ.. ఇప్పటికే ఉన్న అప్పులు, వడ్డీల భారాన్ని లోతుగా విశ్లేషించుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 800 కోట్లు వడ్డీలకు కేటాయించింది. తెలంగాణ, ఏపీల మధ్య విభజనతో చిక్కుముడి పడ్డ రుణాలు కొన్ని ఇప్పటికీ పంపిణీ కాలేదు. వీటికి సంబంధించిన వడ్డీలు సైతం తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అందుకే వచ్చే బడ్జెట్లో రూ.1,300 కోట్ల మేర వడ్డీల చెల్లింపులు ఉంటాయని ఉజ్జాయింపుగా అధికార వర్గాలు లెక్కలేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు భారీగా రుణాల సమీకరణ ప్రయత్నాలు ప్రారంభించింది. నాబార్డు, ఎల్ఐసీతో పాటు రాష్ట్ర బ్యాంకర్ల సమితికి అవసరమైన మేరకు రుణం కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించింది. మరో మూడేళ్లలో పూర్తి చేయ తలపెట్టిన మిషన్ భగీరథ భారీ ప్రాజెక్టుకు రూ. 30 వేల కోట్లు కావాల్సి ఉంది. దీనికి అవసరమయ్యే నిధులన్నీ రుణ సంస్థల నుంచే సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి చిక్కులు తలెత్తకుండా ముందుగానే తెలంగాణ వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణకు రూ.వెయ్యి కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 3,500 కోట్లు అవసరమవుతాయి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. రుణం తీర్చే ఆదాయమేది..? వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ఆదాయం వస్తుందని.. అందుకే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తమకు ఢోకా లేదని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రుణ సంస్థలు, బ్యాంకులకు సమర్పించే ప్రాజెక్టు నివేదికల్లో పేర్కొంటోంది. కానీ నల్లా నీటి ద్వారా రుణభారం తీర్చేంత ఆదాయం సమకూరడం అసాధ్యమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులకు ఏటా కనీసం రూ. 900 కోట్లు అవసరం. ప్రజల నుంచి వసూలు చేసే నామమాత్రపు నీటి పన్నుతో వచ్చే ఆదాయం ఈ నిర్వహణ ఖర్చుకు మించి సరిపోవని చెబుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను సైతం పూర్తిగా ఉచితంగా నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ పథకానికి తెచ్చే రుణాలన్నీ పెట్టుబడి వ్యయానికే సరిపోతాయి. ఒక్క రూపాయి కూడా ఆదాయం తిరిగి వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ రుణాల చెల్లింపులన్నీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయనున్నాయి. రెవెన్యూ మిగులు రాష్ట్రం కావటంతో తమ ఆదాయానికి ఢోకా లేదని ప్రభుత్వం భరోసాతో ఉంది. కానీ ఆశించిన మేరకు ఆదాయం సమకూరక పోవడంతో తొలి రెండు బడ్జెట్లలోనూ సర్కారు అంచనాలు తలకిందులయ్యాయి. అందుకే అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సర్కారు తిరిగి చెల్లించే వ్యూహాలను అధ్యయనం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీలు.. కిస్తీలతో తలపోటు ఇదే వరుసలో అప్పుల సమీకరణ ప్రయత్నాలు వేగవంతమైన కొద్దీ వడ్డీలు, అప్పుల చెల్లింపులు రాష్ట్ర ఖజానాను ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు సర్కారు రూ. 20 వేల కోట్లు అప్పు తీసుకున్నా.. వాటిని తిరిగి చెల్లించటమెలా అనేది ప్రశ్నార్థకంగా మారనుంది. రుణ సంస్థలు ఇచ్చిన అప్పుపై కనీసం 8 శాతం చొప్పున వడ్డీ రేటు వసూలు చేస్తాయి. దీంతో ఏటా రూ. 1,600 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీతో పాటు అసలు రుణానికి సంబంధించి ఏటా కనీసం రూ. 1,000 కోట్ల చొప్పున కిస్తు చెల్లించాలి. మొత్తంగా ఏటా రూ. 2,600 కోట్లు రాష్ట్ర ఖజనాపై భారం పడుతుంది. ప్రతి ఏడాది బడ్జెట్ నుంచి అంత భారీ మొత్తంలో అప్పులు తీర్చటం సర్కారుకు తలపోటుగా మారనుంది.