ప్రతిష్టాత్మక పథకాలకు అప్పులపైనే సర్కారు దృష్టి
వేలాది కోట్లు అప్పులు తెస్తే వడ్డీల భారం తడిసిమోపెడు
ప్రస్తుతం రూ.800 కోట్లు.. వచ్చే బడ్జెట్‌లో రూ.1,300 కోట్ల వడ్డీల భారం
ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా అప్పులు తెచ్చేందుకు ఉబలాటపడుతున్న కొద్దీ వడ్డీల భారం వెంటాడుతోంది. ప్రతిష్టాత్మక పథకాల అమలుకు వేలాది కోట్లు అప్పులు తెస్తే భవిష్యత్తులో వడ్డీల చెల్లింపులు తడిసిమోపెడవుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే 2016-17 బడ్జెట్ తయారీలో నిమగ్నమైన ఆర్థిక శాఖ.. ఇప్పటికే ఉన్న అప్పులు, వడ్డీల భారాన్ని లోతుగా విశ్లేషించుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 800 కోట్లు వడ్డీలకు కేటాయించింది. తెలంగాణ, ఏపీల మధ్య విభజనతో చిక్కుముడి పడ్డ రుణాలు కొన్ని ఇప్పటికీ పంపిణీ కాలేదు. వీటికి సంబంధించిన వడ్డీలు సైతం తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అందుకే వచ్చే బడ్జెట్‌లో రూ.1,300 కోట్ల మేర వడ్డీల చెల్లింపులు ఉంటాయని ఉజ్జాయింపుగా అధికార వర్గాలు లెక్కలేసుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు భారీగా రుణాల సమీకరణ ప్రయత్నాలు ప్రారంభించింది. నాబార్డు, ఎల్‌ఐసీతో పాటు రాష్ట్ర బ్యాంకర్ల సమితికి అవసరమైన మేరకు రుణం కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించింది. మరో మూడేళ్లలో పూర్తి చేయ తలపెట్టిన మిషన్ భగీరథ భారీ ప్రాజెక్టుకు రూ. 30 వేల కోట్లు కావాల్సి ఉంది. దీనికి అవసరమయ్యే నిధులన్నీ రుణ సంస్థల నుంచే సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి చిక్కులు తలెత్తకుండా ముందుగానే తెలంగాణ వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణకు రూ.వెయ్యి కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 3,500 కోట్లు అవసరమవుతాయి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది.
రుణం తీర్చే ఆదాయమేది..?
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ఆదాయం వస్తుందని.. అందుకే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తమకు ఢోకా లేదని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రుణ సంస్థలు, బ్యాంకులకు సమర్పించే ప్రాజెక్టు నివేదికల్లో పేర్కొంటోంది. కానీ నల్లా నీటి ద్వారా రుణభారం తీర్చేంత ఆదాయం సమకూరడం అసాధ్యమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులకు ఏటా కనీసం రూ. 900 కోట్లు అవసరం. ప్రజల నుంచి వసూలు చేసే నామమాత్రపు నీటి పన్నుతో వచ్చే ఆదాయం ఈ నిర్వహణ ఖర్చుకు మించి సరిపోవని చెబుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను సైతం పూర్తిగా ఉచితంగా నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ పథకానికి తెచ్చే రుణాలన్నీ పెట్టుబడి వ్యయానికే సరిపోతాయి. ఒక్క రూపాయి కూడా ఆదాయం తిరిగి వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ రుణాల చెల్లింపులన్నీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయనున్నాయి. రెవెన్యూ మిగులు రాష్ట్రం కావటంతో తమ ఆదాయానికి ఢోకా లేదని ప్రభుత్వం భరోసాతో ఉంది. కానీ ఆశించిన మేరకు ఆదాయం సమకూరక పోవడంతో తొలి రెండు బడ్జెట్లలోనూ సర్కారు అంచనాలు తలకిందులయ్యాయి. అందుకే అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సర్కారు తిరిగి చెల్లించే వ్యూహాలను అధ్యయనం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వడ్డీలు.. కిస్తీలతో తలపోటు
ఇదే వరుసలో అప్పుల సమీకరణ ప్రయత్నాలు వేగవంతమైన కొద్దీ వడ్డీలు, అప్పుల చెల్లింపులు రాష్ట్ర ఖజానాను ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు సర్కారు రూ. 20 వేల కోట్లు అప్పు తీసుకున్నా.. వాటిని తిరిగి చెల్లించటమెలా అనేది ప్రశ్నార్థకంగా మారనుంది. రుణ సంస్థలు ఇచ్చిన అప్పుపై కనీసం 8 శాతం చొప్పున వడ్డీ రేటు వసూలు చేస్తాయి. దీంతో ఏటా రూ. 1,600 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీతో పాటు అసలు రుణానికి సంబంధించి ఏటా కనీసం రూ. 1,000 కోట్ల చొప్పున కిస్తు చెల్లించాలి. మొత్తంగా ఏటా రూ. 2,600 కోట్లు రాష్ట్ర ఖజనాపై భారం పడుతుంది. ప్రతి ఏడాది బడ్జెట్ నుంచి అంత భారీ మొత్తంలో అప్పులు తీర్చటం సర్కారుకు తలపోటుగా మారనుంది.
అన్నీ అప్పులైతే.. వడ్డీలు కట్టేదెలా?
Published Thu, Jan 28 2016 3:01 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
Advertisement
Advertisement