: సభలో మాట్లాడుతున్న వరవరరావు
- విప్లవ కవి వరవరరావు
ఇల్లెందు: పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీల ప్రయోజనాల కోసమే హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విప్లవ కవి వరవరరావు విమర్శించారు. తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) చేపట్టిన బస్సు యాత్ర బృందం బుధవారం ఇల్లెందు మండలంలోని ఒంపుగూడెం, కొమురారం, బద్రూతండాలో పర్యటించింది. పోడు భూముల్లో అటవీ శాఖ ధ్వంసం చేసిన పంటలను పరిశీలించింది. అనంతరం.. మాణిక్యారం, కొమురారం సభల్లో బృందం సభ్యుడు వరవరరావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలోగల విశాలమైన అటవీ ప్రాంతానికి సమీపంలో రైల్వే లైన్ ఉంది. గోదావరి నీళ్లు ఉన్నాయి. అందుకే ఇక్కడి అటవీ భూములను పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఇందులో భాగంగానే అడవిని తన స్వాధీనంలోకి తీసుకునేందుకు హరితహారం పేరుతో పోడు భూముల నుంచి గిరిజనులను గెంటేస్తోంది’’ అని విమర్శించారు. రాజ్యాంగం 5వ, 6వ షెడ్యూల్ ద్వారా ఆదివాసీలకు సంక్రమించిన హక్కులను కాలరాస్తోందన్నారు. హరితహారం అసలు లక్ష్యం... పర్యావరణ పరిరక్షణ కాదని, బహుళజాతి సంస్థలు, బడా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు చేకూర్చడమేనని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో రెండు పేపర్ పరిశ్రమలు.. ఒకటి– సిర్పూర్ కాగజ్‌నగర్‌లో, రెండవది– బూర్గంపాడులో ఉన్నాయి. ప్రభుత్వాధీనంలోగల సిర్పూర్ కాగజ్‌నగర్ పరిశ్రమ మూతపడింది. బడా పారిశ్రామిక సంస్థ ప్రయోజనాలో ఇమిడి ఉన్న బూర్గంపాడులోని ఐటీసీ పరిశ్రమను మాత్రం ప్రభుత్వం నడుపుతోంది’’ అని అన్నారు. ‘‘ప్రజల భూములకు రక్షణగా ఉన్న చట్టాలను ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. ఏజెన్సీపై ఆదివాసీలకు సర్వ హక్కులు కల్పిస్తున్న 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. మల్లన్నసాగర్‌లో భూనిర్వాసితుల పరిహారానికి సంబంధించి 2013 చట్టాన్ని పక్కకునెట్టి, 123 జీఓ తీసుకొచ్చింది. ప్రజల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాగిస్తున్న కుతంత్రాలకు ఇవి ఉదాహరణలు మాత్రమే’’ అని అన్నారు. రానున్న కాలంలో రైతు కమతాలు ఉండవని, సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లే ఉంటాయని అన్నారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలోగల రెండులక్షల ఎకరాలను, అటవీ ప్రాంతంలోగల మూడు లక్షల ఎకరాలను సర్వే చేసి పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ.. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం దాడులను తప్పించుకునేందుకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలోకి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని కేసీఆర్ ప్రభుత్వం గెంటేస్తోంది. గుజరాత్, అమెరికా, ఫ్రాన్స్‌కు చెందినకంపెనీలకు మాత్రం ఇక్కడి అటవీ భూమిని అప్పగిస్తోంది’’ అని విమర్శించారు.
కార్యక్రమంలో న్యూడెమోక్రసీ (చంద్రన్న) రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ (రాయల) నాయకులు గుమ్మడి నర్సయ్య, జగ్గన్న, ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిచంద్ర, జిల్లా కార్యదర్శి మెంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా, ప్రజాఫ్రంట్ ముద్రించిన ‘అడవిపై ఆదివాసీలకే సర్వ హక్కులు’ అనే పుస్తకాన్ని వరవరరావు, నారాయణరావు ఆవిష్కరించారు. ప్రజాఫ్రంట్ కళామండలి ఆటా–పాటా ప్రదర్శించింది.