
సాక్షి, అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వారి పేరిట వివిధ బ్యాంకుల్లో రూ. 7,359 కోట్లు నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లపై ఏటా వడ్డీ రూపంలో టీటీడీకి రూ. 766 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శాసనమండలి హామీల అమలు కమిటీకి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. భక్తులు దర్శన టికెట్ కొనుగోళ్ల ద్వారా టీటీడీకి రెండేళ్ల క్రితం రూ. 210 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది దర్శన టికెట్ల ద్వారా రూ. 256 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే టీటీడీ వార్షిక ఆదాయం రూ. 2,858 కోట్లు. భక్తులు హుండీలో వేసే కానుకల ద్వారా రోజూ రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇతర కానుకల ద్వారా ఈ ఏడాది రూ. 1,110 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టీటీడీకి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతభత్యాలకే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. స్వామి పూజా సామగ్రి, తదితర వస్తువుల కొనుగోలుకు రూ. 300–400 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
హామీల అమలు కమిటీకి టీటీడీ ఇచ్చిన నివేదికలో బ్యాంకు డిపాజిట్ల వివరాలు..
బ్యాంకు నగదు డిపాజిట్లు(రూ. కోట్లలో)
విజయా బ్యాంకు 2,938
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు 1,965.01
సిండికేట్ బ్యాంకు 945.37
స్టేట్ బ్యాంకు 938.06
కెనరా బ్యాంకు 298.10
సప్తగిరి గ్రామీణ బ్యాంకు 105.09
ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు 36
బ్యాంకు ఆఫ్ ఇండియా 31.55
ఆంధ్రా బ్యాంకు 21.79
ఇతర బ్యాంకులు 52.50
మొత్తం 7,359.42
Comments
Please login to add a commentAdd a comment