సాక్షి, అమరావతి, తిరుమల: తిరుమల శ్రీవారి మిగులు బంగారం, నగదు డిపాజిట్లన్నీ ప్రముఖ జాతీయ బ్యాంకుల్లో భద్రంగా దాచినట్లు టీటీడీ తెలిపింది. వెంకన్న ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు తరచూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో బ్యాంకులో దాచిన బంగారం, బ్యాంకు డిపాజిట్లపై టీటీడీ శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. బ్యాంకుల వారీగా ఏ బ్యాంకులో ఎంత బంగారం, డిపాజిట్లు ఉన్నాయన్న వివరాలను అందులో వెల్లడించారు.
మూడేళ్లలో రూ.2,913.59 కోట్లు పెరిగిన డిపాజిట్లు
ప్రస్తుతం 24 బ్యాంకుల్లో స్వామి వారి పేరిట రూ.15,938.68 కోట్లు డిపాజిట్లుగా ఉన్నట్లు టీడీపీ శ్వేతపత్రంలో వెల్లడించింది. 2019 జూన్ 30వతేదీ నాటికి రూ.13,025.09 కోట్లు ఉండగా కరోనా లాంటి అవాంతరాలు ఎదురైనా మూడేళ్లలో బ్యాంకుల్లో స్వామి వారి నగదు నిల్వ రూ.2,913.59 కోట్లు పెరగడం విశేషం. అత్యధికంగా రూ.5,358.11 కోట్లు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో డిపాజిట్లున్నాయి.
టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.50.77 కోట్లు స్వామి వారి నగదు బ్యాంకు డిపాజిట్లుగా ఉండగా ఇప్పుడు వాటిని ఇతర జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రస్తుతం ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.1.30 కోట్లు మాత్రమే స్వామి వారి డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొంది.
95% మిగులు బంగారం ఎస్‌బీఐలోనే..
2019 జూన్ 30 తర్వాత బ్యాంకుల్లో స్వామి వారి మిగులు బంగారం నిల్వలు 2,918.63 కిలోలు పెరిగినట్లు టీటీడీ తెలిపింది. 2019 జూన్ 30 నాటికి 7,339.74 కిలోల బంగారం బ్యాంకుల్లో ఉండగా ఇప్పుడు 10,258.37 కిలోలకు పెరిగింది. భక్తులు స్వామి వారి హుండీలో సమర్పించే బంగారు కానుకలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మింట్‌లో కరిగించిన అనంతరం నిల్వలను 12 ఏళ్ల కాలానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో బ్యాంకుల్లో ఉంచినట్లు టీటీడీ పేర్కొంది. స్వామివారి మిగులు బంగారంలో 95 శాతం బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో దాచినట్లు తెలిపింది.
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
శ్రీవారి బంగారం, నగదు డిపాజిట్లను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా కొన్నాళ్లుగా సాగిస్తున్న ప్రచారాన్ని భక్తులెవరూ విశ్వసించవద్దని టీటీడీ శ్వేతపత్రంలో విజ్ఞప్తి చేసింది. 2019 తర్వాత స్వామి ఆస్తులను భద్రపరచే అంశంపై కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్లు వివరించింది. కరోనా సమయాల్లోనూ నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని స్వామివారి ఆదాయం పెరుగుదలకే చర్యలు చేపట్టిందని, మంచి పేరున్న జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఆస్తులను భద్రపరుస్తున్నట్లు తెలిపింది.
జాతీయ బ్యాంకుల్లోనే..
టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ డబ్బులు ఇవ్వలేదు. భవిష్యత్తులోనూ ఇవ్వదు. చైర్మన్, టీటీడీపై బురద చల్లేందుకు కొందరు హిందూ మత వ్యతిరేకులు ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పటిదాకా రూ.15,900 కోట్లకుపైగా జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేశాం. ఇకపై కూడా వడ్డీ ఎక్కువ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తాం. – ధర్మారెడ్డి, టీటీడీ ఈవో
Comments
Please login to add a commentAdd a comment