భారత్‌లో స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాల రుణాల్లో పెరుగుదల
పారిశ్రామిక రుణాలు తీసుకోవడంలోనూ భారీ వృద్ధి
గృహాలకు సంబంధించిన దీర్ఘకాలిక పెట్టుబడులపై అనాసక్తి
వైద్య పరమైన అవసరాలకు తీసుకుంటున్న రుణాల్లో తగ్గుదల
ఆన్‌లైన్ షాపింగ్‌లో మహిళలు, యువతదే అగ్రస్థానం
ఈఎంఐ కార్డుల వినియోగంపై దిగువ మధ్యతరగతి ఆసక్తి
రుణ యాప్‌ల వ్యక్తిగత డేటా సేకరణపై రుణగ్రహీతల్లో ఆందోళన
హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ అధ్యయన ఫలితాల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలవారీ కిస్తీల చెల్లింపు (ఈఎంఐ), వెబ్‌సైట్, యాప్ ఆధారిత రుణాల పట్ల దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందిన రుణ గ్రహీతల్లో ఆసక్తి పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాల కొనుగోలు కోసం రుణాలు తీసుకునే ధోరణి వేగిరమైంది. పారిశ్రామిక రుణాలు తీసుకోవడంలోనూ రుణ గ్రహీతలు పోటీ పడుతున్నారు. గృహాల కొనుగోలు, మరమ్మతుల కోసం తీసుకునే రుణాల్లో కూడా వృద్ధి నమోదవుతోంది.
పైచదువుల కోసం తీసుకునే రుణాల్లో గడిచిన నాలుగేళ్లలో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ ‘భారత్‌లో రుణగ్రహీతల తీరుతెన్నులు –2024’అధ్యయన ఫలితాలను ఈ నెల 17న విడుదల చేసింది.
ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, భోపాల్, పాట్నా, రాంచీ, చండీగఢ్, లూథి యానా, కొచ్చి, డెహ్రాడూన్ సహా 17 నగరాల్లో హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ అధ్యయనం చేసింది. నెలకు సగటున రూ.31 వేల ఆదాయంతో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగిన రుణగ్రహీతల నుంచి వివరాలు సేకరించింది.
డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో పెరుగుదల
నిరంతరాయంగా లావాదేవీలు నిర్వహించే సౌకర్యం, డిజిటల్ సాంకేతికతపై వినియోగదారుల్లో అవగాహన పెరగడంతో బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్ కంటే యాప్ ఆధారిత బ్యాంకింగ్‌పై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. యువత, మెట్రో నగరాల్లో యాప్ ఆధారిత బ్యాంకింగ్ వినియోగం ధోరణి ఎక్కువగా ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ వినియోగం 2023లో 48 శాతం ఉండగా 2024లో 53 శాతానికి పెరిగింది.
ఆన్‌లైన్ షాపింగ్ ధోరణిని ఎక్కువగా మహిళలు (60 శాతం), మిల్లేనియల్స్ (59 శాతం), జెన్ జెడ్ (58శాతం)లో కనిపించింది. మెట్రో, ద్వితీయ శ్రేణి నగరాలు (56 శాతం) ఆన్‌లైన్ షాపింగ్‌లో సమస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారిలో కోల్‌కతా, కొచ్చి, హైదరాబాద్, చెన్నై, రాంచీ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
పెరుగుతున్న ఈఎంఐ కార్డుల వినియోగం
ఒకేచోట ఇన్సూరెన్స్, లోన్లు, బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక సేవలు అందించే (ఎంబెడ్డెడ్ ఫైనాన్స్) యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లపైనా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు 64 శాతం మంది ప్రధాన ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో)కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 21 శాతం మంది ప్రయాణ యాప్స్ (మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్)ను ఎంచుకుంటున్నారు. 23 శాతం మంది ఆహార డెలివరీ యాప్స్ (జొమాటో, స్విగ్గీ) ఉపయోగిస్తున్నారు. లక్నో, పాటా్న, అహ్మదాబాద్, భోపాల్, రాంచీ వంటి నగరాల్లో ఎంబెడ్డెడ్ ఫైనాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది.
ఇదిలా ఉంటే ఈఎంఐ కార్డులు భారతదేశంలోని దిగువ, మధ్యతరగతి రుణ గ్రహీతలు అత్యంత ప్రాచుర్యం పొందిన క్రెడిట్ సాధనంగా భావిస్తున్నారు. వేగంగా, నమ్మకంగా రుణం లభించే వేదికలుగా వీటిని పేర్కొంటున్నారు. వీటితోపాటు క్రెడిట్ కార్డులు, డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా కూడా రుణం తేలిగ్గా లభిస్తుందనే అభిప్రాయం గ్రహీతల్లో కనిపించింది. ఇదిలా ఉంటే రుణగ్రహీతల్లో ఎక్కువ శాతం మంది బ్యాంకు శాఖలకు భౌతికంగా వెళ్లడం, కొందరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానాన్ని ఎంచుకుంటున్నారు.
డేటా గోప్యత కోసం డిమాండ్
రుణ గ్రహీతల్లో డేటా ప్రైవసీ మార్గదర్శకాలకు సంబంధించి పెరుగుతున్న అవగాహన అంతరాన్ని కూడా అ« ద్యయనం ఎత్తిచూపింది. రుణ సంస్థలు అమలు చేయాల్సిన డేటా గోప్యత ఆవశ్యకతపై రుణ గ్రహీతల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. దిగువ మధ్యతరగతి రుణదాతల్లో సుమారు 50 శాతం మందికి డేటా రక్షణ మార్గదర్శకాల గురించి అవగాహన లేదు. రుణ గ్రహీత ల్లో సుమారు పావుశాతం మందికి మాత్రమే రుణ యాప్స్, వెబ్‌సైట్స్ ద్వారా తమ వ్యక్తిగత డేటా వాడకం తీరును అర్థం చేసుకుంటున్నారు.
సుమారు ముప్పావు శాతం మంది తమ వ్యక్తిగత డేటా వినియోగంపై స్పష్టత కోరుతూ, డేటా వినియోగంలో పారదర్శకత కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిన అవసరం ఉందని అధ్యయనం వెల్లడించింది. రుణ గ్రహీతలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, రుణ వెబ్‌సైట్లు, యాప్‌లు, చెల్లింపు వాలెట్లు, ఇతర క్లిష్టమైన ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల్లో సహాయం అవసరమని నివేదించారు, మహిళలు, జెన్ ఎక్స్‌తోపాటు, ద్వితీయ శ్రేణి నగరాల్లోని రుణగ్రహీతలు డిజిటల్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో ఇప్పటికీ సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
పెరిగిన చాట్‌బాట్స్, వాట్సాప్ వాడకం
వినియోగదారుల సేవలో చాట్‌బాట్‌లకు (ఏఐ ఆధారిత మెసేజింగ్ యాప్‌లు) ఆదరణ వేగంగా పెరుగుతోంది. వీటి సేవలపై జెన్ జెడ్‌కు ఎక్కువ అవగాహన కలిగి ఉండగా, చాట్‌బాట్ వినియోగించడం సులభంగా ఉంటుందని రుణదాతలు భావిస్తున్నారు. వాట్సాప్ కూడా రుణ మార్కెట్‌లో కీలక మార్గంగా మారింది. 59 శాతం మంది రుణదాతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లు పొందుతున్నారు. 2023 లో 24 శాతంగా ఉన్న రుణ ఆఫర్లు 2024 లో 26 శాతానికి పెరగడం వాట్సాప్ డిజిటల్ వేదికపై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అధ్యయనంలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment