హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి కరోనా వైరస్ రూపంలో కొత్త కష్టాలొచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో గృహ కొనుగోలుదారులు 65% వాయిదా చెల్లింపులు చేయటం లేదని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) తెలిపింది. కొత్త ప్రాజెక్ట్‌లలో గృహ అమ్మకాలు క్షీణించడంతో పాటూ వాయిదా చెల్లింపుల్లేక నిర్మాణ సంస్థలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయని ఐసీసీ డైరెక్టర్ రజనీష్ షా తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు కూడా లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది కస్టమర్లు తమ చెల్లింపులను వాయిదా వేయాలని డెవలపర్లను కోరుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ తరహా అభ్యర్థనలు మరింత పెరిగే సూచనలున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశీ రియల్టీ రంగం విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ రంగం వాటా 5%గా ఉంటుంది.
రియల్టీకి పేమెంట్ యాక్ట్ తేవాలి..
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు(ఎంఎస్‌ఎంఈ) మాదిరిగానే ఆలస్యం చెల్లింపు చట్టం (డిలేయిడ్ పేమెంట్ యాక్ట్) రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వర్తింపజేయాలని.. ఈ మేరకు కొన్ని సిఫార్సులను ఐసీసీ కేంద్రానికి సూచించింది. ఈ చట్టంతో కస్టమర్ల డిఫాల్ట్ పేమెంట్స్‌ను నిరుత్సాహపరుస్తుందని.. ఒకవేళ డెవలపర్లు అంగీకరించిన కాలానికి వాయిదా చెల్లింపులు మించిపోతే గనక సంబంధిత ఆలస్య చెల్లింపులపై జరిమానా వడ్డీని వసూలు చేయడానికి వీలవుతుందని రజనీష్ తెలిపారు. రియల్టీకి అత్యవసర ప్రాతిపదికన సహాయ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.
గడువును 6 నెలలు పొడిగించాలి..
కార్మికులు, ముడిసరుకుల కొరత కారణంగా నివాస ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం కష్టమవుతుంది. అందుకే సంబంధిత ప్రాజెక్ట్‌ల నిర్మాణ గడువు తేదీని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నుంచి 6 నెలల కాలం పొడిగించాలని షా కోరారు. కనీస ఒక త్రైమాసికం పాటైనా మున్సిపల్ పన్నులను మాఫీ చేయాలని సూచించింది. పన్నులు, బిల్లులు చెల్లించలేని సంస్థలకు జరిమానాలు విధించరాదని, ఆయా సంస్థలు తిరిగి చెల్లించడానికి 3–6 నెలల సమయం ఇవ్వాలని సూచించారు. వడ్డీ లేని రుణ వాయిదాలను 6 నెలల పాటు అందించాలన్నారు.
ఇంటి ఈఎంఐలు చెల్లించట్లేదు..!
Published Tue, Apr 14 2020 5:14 AM | Last Updated on Tue, Apr 14 2020 5:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment