కొత్త అవకాశాలొస్తాయి.. | Sakshi Interview With My Home Constructions MD Jupally Shyam Rao | Sakshi
Sakshi News home page

కొత్త అవకాశాలొస్తాయి..

Published Tue, May 12 2020 12:57 AM | Last Updated on Tue, May 12 2020 12:57 AM

Sakshi Interview With My Home Constructions MD Jupally Shyam Rao

హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ జూపల్లి శ్యామ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ప్రభావంతో కొన్ని రంగాలు నష్టపోయినా మరికొన్ని రంగాల్లో కొత్త అవకాశాలొస్తాయని, మాల్స్, షాప్స్‌ వంటి రిటైల్‌ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరడానికి 2 – 3 నెలల సమయం పట్టొచ్చని చెప్పారు మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ జూపల్లి శ్యామ్‌రావు. స్వల్ప కాలికంగా అన్ని రంగాల్లోనూ అభద్రత, సప్లై చెయిన్‌కు అంతరాయం వంటివి ఉన్నా, కొత్త వ్యాపారావకాశాలు తెరపైకి వస్తున్నా యని చెప్పారు. ఈ సంక్షోభ సమయంలోనూ కొన్ని వ్యాపారాలు మరింత బలంగా, మెరుగ్గా తయారవుతున్నాయని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని స్థిరాస్తి, నిర్మాణరంగం స్థితిగతులపై ఆయన తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.  

కొత్త వ్యాపారాలు..అవకాశాలు
వ్యాపారపరంగా మెరుగైన నగదు నిర్వహణ, ఖర్చును అదుపులో పెట్టుకుని ముందుకెళ్లే సంస్థలు మూడు నుంచి ఆరు నెలల్లో మార్కెట్‌లో మళ్లీ నిలదొక్కుకుంటాయి. లాక్‌డౌన్‌తో 90 శాతం మంది ఇంటి నుంచే పనిచేయడంతో మరింత విశాలమైన ఇళ్లుండాల్సిన అవసరం పెరిగింది. ఇకపై ట్రిపుల్‌ బెడ్‌రూం ఇళ్లకు డిమాండ్‌ పెరగొచ్చు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తుండటంతో త్వరలోనే గృహ నిర్మాణ రంగానికి ఊపు వస్తుంది.

ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌
కరోనా సంక్షోభానికి ముందు హైదరాబాద్‌లో కమర్షియల్‌ స్పేస్‌ వినియోగం రికార్డు స్థాయిలో ఉంది. గత 12 నెలల్లో ఆఫీస్‌ స్పేస్‌పరంగా బెంగళూరుకంటే హైదరాబాద్‌ 10 – 15 శాతం మేర వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్వల్పకాలంలో ఈ రంగంపై కరోనా ప్రభావం ఉన్నా దీర్ఘకాలంలో పుంజుకుంటాం. గతంలో ఒక్కో వ్యక్తికి 80 నుంచి వంద చదరపు అడుగులుగా ఉండే ఆఫీస్‌ స్పేస్‌... భౌతికదూరం వంటి అంశాలతో మరింత పెరగనుంది. గతంలో వెయ్యిమందికి లక్ష చదరపు అడుగులుంటే ప్రస్తుత పరిస్థితుల్లో లక్షన్నర అడుగులకు చేరవచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆఫీస్‌ స్పేస్‌ మరింత విశాలంగా ఉండాలనే అంశాన్ని ప్రస్తుత పరిస్థితుల నుంచి పెద్ద కంపెనీలు నేర్చుకున్నాయి.

‘రియల్‌’ రిటర్న్‌లు
ఇల్లనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరం కాబట్టి దీనిపై కరోనా ప్రభావం పెద్దగా ఉండదు. పెట్టుబడుల కోణంలో చూస్తే రెండు దశాబ్దాలుగా రియల్‌ ఎస్టేట్‌పై వచ్చినంత రిటర్న్‌లు మరే రంగంలోనూ రాలేదు. ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి వాటిపై పెట్టుబడులు ఈ సంక్షోభంతో తుడిచిపెట్టుకుపోవడంతో అందులో పెట్టుబడులు పెట్టిన వారు ఆందోళనలో ఉన్నారు. రియల్టీ రంగం కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా ఏటా 8–10% వృద్ధిరేటును సాధిస్తూ వచ్చింది.  

నిర్మాణ రంగానికి మంచిరోజులు
హైదరాబాద్‌ లో చదరపు అడుగు ధర రూ.4,500 నుంచి రూ.9 వేల వరకు ఉంది. బెంగళూరు, చెన్నై, ముంబైల్లో ఇది రూ.20 వేల నుంచి రూ.40వేలు. హైదరాబాద్‌లో భూమి లభ్యత, ఔటర్‌ రింగురోడ్డు, ఎక్కువ మంది ఎంట్రప్రెన్యూర్స్, డెవలపర్లు ఉండటం వంటి కారణాలతో ధరలు అందుబాటులో ఉన్నాయి. రెండు, మూడు నెలల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుని గృహ నిర్మాణానికి డిమాండ్‌ పెరుగుతుంది. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయనే భరోసాతో ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్స్‌తో పాటు ఇతర రంగాల నుంచి పెట్టుబడులు ప్రవహించే అవకాశం ఉంది.

జూలై నాటికి గాడిన పడతాం..
కరోనాతో రెండు నెలలుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ రంగంలో 95 శాతం మంది వలస కార్మికులే. వీరంతా స్వస్థలాలకు వెళ్లేందుకు మొగ్గు చూపినా, రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వడంతో తిరిగి పనుల్లోకి వస్తున్నారు. ఇప్పటికే 70 –80 శాతం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. జూలై నాటికి కరోనా సంక్షోభం తొలగి ప్రాజెక్టులన్నీ గాడినపడతాయి. కొత్త ప్రాజెక్టులు ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నాటికి ప్రారంభం కావచ్చు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇదే అనువైన సమయం. స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లో ధరల పెరుగుదల ఏటా 8 – 10 శాతం వరకు ఉంటుంది. రవాణా, మౌలిక వసతులు, కార్మికుల వేతనాల భారం వంటివి సంస్థలపై పడినా... కొనుగోలుదారుడి కోణంలో చూస్తే ధరల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement