సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ పనులకు కూలీల కొరత వెంటాడుతోంది. వలస కార్మికులు సగానికి పైగా స్వస్థలాల బాట పట్టడంతో నిర్మాణ పనులు ముందుకు సాగే పరిస్థితులు కానరావడం లేదు. లాక్‌డౌన్‌లో భవన నిర్మాణ రంగానికి గ్రీన్ సిగ్నల్ లభించి వారం రోజులు కావస్తున్నా.. పనులు మాత్రం పెద్దగా ప్రారంభమైన దాఖలాలు కానరావడం లేదు. లాక్‌డౌన్‌తో మహా నగర శివార్లలో పెద్దఎత్తున జరుగుతున్న పనులు ఎక్కడికక్కడే నిలిచి పోవడంతో కూలీలకు ఉపాధి కరువైంది. చేతిలో పనులు లేక తినడానికి తిండి కరువై ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు మూటముళ్లే సర్దుకొని కుటుంబాల సమేతంగా కాలినడకన స్వస్థలాల బాటపట్టారు. మరి కొందరు కార్మికులు ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక రైళ్లలో ప్రయాణమయ్యారు.
30 శాతం ప్రాంతాల్లో కూడా..
హైదరాబాద్ మహా నగర శివార్లలో కనీసం 30 శాతం ప్రాంతాల్లో కూడా భవన నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో మొత్తం మీద సుమారు 1,230పైగా ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. తాజాగా పనులకు తిరిగి చేపట్టేందుకు మినహాయింపు లభించిన పెద్దగా ఉరుకులు పరుగులు కానరావడం లేదు. ప్రభుత్వమే అధికారికంగా సుమారు 948 ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు ఆగిపోయినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ లెక్కల్లోరాని మరో 300 పైగా ప్రాంతాల్లో నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా భవన నిర్మాణ రంగం లాక్‌డౌన్‌తో కుదేలైంది. భవన నిర్మాణ రంగానికి సంబంధించి పూర్తిస్థాయి ముడిపదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కొరత కారణంగా స్టీల్, సిమెంట్, ఇటుక, ఇసుక ధరలు అమాంతం రిగిపోయాయి. మరోవైపు ఇటుక ధరలు చుక్కలనంటాయి. పనులు నిలిపివేయడంతో ఇటుక బట్టీలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
రెండున్నర లక్షలపైనే..
మహానగర శివార్లలోని భవన నిర్మాణ రంగం పనులపై ఆధారపడిన వలస కార్మికుల సంఖ్య రెండున్నర లక్షల పైనే ఉంటుంది. ప్రభుత్వం అధికారికంగా 98,859 మంది కూలీలను గుర్తించి అందులో సుమారు 40 వేల మంది వరకు చేయూత అందించింది. అందులో కొందరికి ఆశ్రయం కల్పించి భోజనాలు అందించగా, మరికొందరికి 12 కిలోల చొప్పున ఉచితం బియ్యం, రూ.500ల చొప్పున నగదు అందజేసింది. క్షేత్రస్థాయిలో సవాలక్ష కొర్రీలు తప్పలేదు. అత్యధిక శాతం వర్కింగ్ సైట్లలో ఉన్న కూలీలకు ఉపాధి కరువైంది. లాక్‌డౌన్ ఎత్తివేతపై నమ్మకం లేక ఏకంగా ఇంటి బాటపట్టడంతో సగానికి పైగా నిర్మాణ రంగానికి సంబంధించి కూలీల క్యాంపులు ఖాళీ అయ్యాయి.
స్వస్థలాలకు నిరోధించేందుకే..
ప్రభుత్వ, భవన నిర్మాణ సంస్థల పక్షాన వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లకుండా శతవిధాలుగా నిరోధించే ప్రయత్నం సాగుతోంది. అయినా వలస కార్మికులు ఆగే పరిస్థితి మాత్రం కానరావడం లేదు. ఇప్పటికే సగానికి పైగా వెళ్లిపోగా, మిగిలిన వారిలో సైతం 30 శాతం వరకు స్వస్థలాలకు వెళ్లేందుకు తమ పేర్లను పోలీసు యంత్రాంగం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నుట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిపుణులైన వలస కార్మికులను వదులుకుంటే భవన నిర్మాణ పనులు ఆగిపోయి ప్రభుత్వానికి రాబడి వచ్చే వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో ప్రభుత్వం భవన నిర్మాణ రంగానికి పూర్తిస్థాయిలో అనుమితి ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఏకంగా భవన నిర్మాణ పనులను ప్రారంభించాలని, ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి సహకారాన్ని అందిస్తామని బిల్డర్లు, డెవలపర్లు, రియల్టర్లకు సంబంధిత అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు.
తిరిగి పుంజుకునేందుకు..
భవన నిర్మాణ రంగం తిరిగి పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం పరంగా మాత్రం నిర్మాణరంగం తిరిగి పుంజుకోవడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై అధ్యయనం చేసేందుకు ఏకంగా నిపుణుల కమిటీ కూడా వేసింది. ఇప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిర్మాణ రంగానికి చెందిన కంపెనీల ప్రతినిధులతో సమావేశమై కార్మికుల కొరత, మెటీరియల్ లభ్యతపై చర్చించారు. భవన నిర్మాణ సామగ్రి సిమెంటు, స్టీలు, ఇసుక, ఇటుకలు తదితర సరఫరాకు ఆటంకాలు లేకుండా చూసే విధనంగా ఆదేశాలిచ్చింది. భవన నిర్మాణ సామగ్రిలను తరలించే వాహనాలకు ఆటంకాలు రానివ్వమని పోలీసు యంత్రాంగం కూడా స్పష్టమైన హామీ ఇచ్చింది.
ప్రత్యామ్నాయంగా..
భవన నిర్మాణ రంగ పనులకు కూలీల కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టినా.. పని ప్రదేశాల్లో అందుబాటులో గల కూలీలతో నిర్మాణ రంగ పనులు ప్రారంభించే విధంగా ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఏకంగా నిర్మాణ రంగంలో ఏర్పడబోయే కార్మికుల కొరతను గల్ఫ్ దేశాల నుంచి తిరిగివచ్చే వారితో అధిగమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు న్యాక్ ద్వారా యువతకు పెద్ద సంఖ్యలో శిక్షణ ఇప్పించి వారిని కూడా నిర్మాణ రంగంలో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందుకు న్యాక్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ ట్రైనింగ్, నిర్మాణ రంగ ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసింది.
కార్మికులకు భరోసా..
భవన నిర్మాణ కార్మికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించే చర్యలు ప్రారంభమయ్యాయి. వలస కార్మికులకు ప్రోత్సాహకాలు, ఇతర సౌకర్యాలు, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచడంతోపాటు పూర్తిరక్షణ కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిది. నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, కార్మికుల భద్రత కోసం పలు మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను అనుగుణంగా నిర్మాణ పనులకు అనుమతిచ్చింది. ప్రస్తుతం ప్రారంభమైన పనుల వద్ద భౌతిక దూరం, విధిగా మాస్క్‌లు ధరించాలన్న నిబంధనలు పెద్దగా అమలు కావడం లేదు. శానిటైజర్లు, ఇతర మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నా ఆచరణలో అమలు లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment