Indian Chamber of Commerce
-
పీఎస్‌యూ వాటాల విక్రయంలో ముందుకే
న్యూఢిల్లీ, కోల్‌కతా: కేబినెట్ ఆమోదించిన ప్రభుత్వరంగ సంస్థల్లో (సెంట్రల్ పీఎస్‌యూ) వాటాల విక్రయాన్ని మరింత ముందుకు తీసుకెళతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వర్ధమాన దేశాల్లో భారత్‌కే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం (ఎఫ్‌డీఐ) అధికంగా ఉందని గుర్తు చేస్తూ.. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, సంస్కరణలు చేపట్టగల సామర్థ్యాలు, స్థిరమైన ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అంశాలుగా పేర్కొన్నారు. ‘‘కరోనా మహమ్మారి సమయంలోనూ పెద్ద కంపెనీల్లో కొన్నింటిలో వాటాలను విక్రయించాలన్నది మా ప్రయత్నం. ఆసక్తి వ్యక్తీకరణలు అందాయి. తదుపరి దశ ఆరంభమవుతోంది. కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలియజేసిన ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి వాటాల విక్రయాలను దీపమ్ ( పెట్టుబడుల ఉపసంహరణ విభాగం) మరింత చురుగ్గా నిర్వహించగలదని భావిస్తున్నాము’’ అని మంత్రి చెప్పారు. ఇండియన్ చాంబర్ ఆఫ్‌కామర్స్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం రూపంలో రూ.2.01 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఇప్పటి వరకు సమకూరింది కేవలం రూ.11,006 కోట్లే కావడం గమనార్హం. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ సహా 25 ప్రభుత్వరంగ సంస్థల్లో పాక్షికంగా, పూర్తిగా వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం కూడా తెలియజేసింది. ‘‘మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు కొనసాగుతాయి. పలు సావరీన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌కు ఇచ్చిన పన్ను రాయితీల వల్ల అవి మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రగతిశీల సంస్కరణల వైపు ప్రభుత్వం చూస్తోంది. బలమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదు. స్పష్టమైన పెట్టుబడుల ఉపసంహరణ అంజెండాను ప్రకటించాము’’ అని మంత్రి వివరించారు. ఏ చర్య తీసుకున్నా సరిపోదు ఆర్థిక రంగ పురోగతికి మద్దతుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే, కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏ చర్య అయినా సరిపోదన్నారు. కాకపోతే ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ చర్యలు తీసుకోవడం వల్లే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేశారు. -
సంక్షోభం నుంచి స్వావలంబన
కోల్‌కతా: కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సాహసోపేత నిర్ణయాలకు, సాహసోపేత పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) 95వ వార్షిక ప్లీనరీని ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఇప్పటివరకు దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారు చేసి ఎగుమతి సైతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ స్వయం సమృద్ధికి గత ఐదారేళ్లుగా తన ప్రభుత్వ విధానాల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అయితే, ఈ దిశగా చర్యలను ఎలా మరింత వేగవంతం చేయాలో మనకు ఈ కోవిడ్–19 సంక్షోభం నేర్పించిందన్నారు. భారత ఆర్థిక రంగాన్ని నియంత్రిత వ్యవస్థ నుంచి క్రియాశీల వ్యవస్థ దిశగా మార్చాలని, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఉత్పత్తిని భారత్ తయారు చేయగలదనే పేరు సాధించాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక వర్తకులు, వ్యాపారవేత్తలను ప్రధాని ప్రశంసించారు. వారి వద్ద స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనడమంటే వారి సేవలను గుర్తించడమేనన్నారు. ప్రజా కేంద్రక, పర్యావరణ హిత అభివృద్ధి తమ ప్రభుత్వ విధానమని ప్రధాని గుర్తు చేశారు. రైతులు దేశంలో ఎక్కడైన తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కల్పించడాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవల తాము తీసుకున్న నిర్ణయాలతో దేశ రైతాంగం, వ్యవసాయ రంగం దశాబ్దాల బానిసత్వం నుంచి బయటపడిందన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాను, ప్రతీ గ్రామాన్ని స్వయం సమృద్ధం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. భారతీయులు దేశీయ అవసరాలు తీర్చడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. వైద్య పరికరాలు, రక్షణ రంగ ఉత్పత్తులు, బొగ్గు, ఖనిజాలు, వంట నూనె మొదలైన వాటిలో స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎమ్ఎస్ఎమ్ఈల నిర్వచనంలో మార్పు, కంపెనీల చట్టంలో సవరణలు, దివాళా చట్టం, నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణలు.. తదితర సంస్కరణలను ప్రధాని ప్రస్తావించారు. -
పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నాం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనాతో యావత్‌దేశం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో ఎన్నడూ లేని ప్రకృతి వైపరీత్యాలతో మనం పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) 95వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో నిరంతరం గెలుపు కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నవారే చివరికి విజేతలవుతారని మోదీ వ్యాఖ్యానించారు. సమస్యలకు భయపడితే ముందుకెళ్లలేమని పేర్కొన్నారు. మన శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించే సమయమిదని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను పీడిస్తున్న కరోనా కాలంలో బాధిత దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయని చెప్పారు. స్వదేశీ నినాదంతో మనం ముందుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మోదీ తెలిపారు. -
నిరంతరం గెలుపు కోసం ప్రయత్నించాలి
-
ఇంటి ఈఎంఐలు చెల్లించట్లేదు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి కరోనా వైరస్ రూపంలో కొత్త కష్టాలొచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో గృహ కొనుగోలుదారులు 65% వాయిదా చెల్లింపులు చేయటం లేదని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) తెలిపింది. కొత్త ప్రాజెక్ట్‌లలో గృహ అమ్మకాలు క్షీణించడంతో పాటూ వాయిదా చెల్లింపుల్లేక నిర్మాణ సంస్థలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయని ఐసీసీ డైరెక్టర్ రజనీష్ షా తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు కూడా లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది కస్టమర్లు తమ చెల్లింపులను వాయిదా వేయాలని డెవలపర్లను కోరుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ తరహా అభ్యర్థనలు మరింత పెరిగే సూచనలున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశీ రియల్టీ రంగం విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ రంగం వాటా 5%గా ఉంటుంది. రియల్టీకి పేమెంట్ యాక్ట్ తేవాలి.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు(ఎంఎస్ఎంఈ) మాదిరిగానే ఆలస్యం చెల్లింపు చట్టం (డిలేయిడ్ పేమెంట్ యాక్ట్) రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వర్తింపజేయాలని.. ఈ మేరకు కొన్ని సిఫార్సులను ఐసీసీ కేంద్రానికి సూచించింది. ఈ చట్టంతో కస్టమర్ల డిఫాల్ట్ పేమెంట్స్‌ను నిరుత్సాహపరుస్తుందని.. ఒకవేళ డెవలపర్లు అంగీకరించిన కాలానికి వాయిదా చెల్లింపులు మించిపోతే గనక సంబంధిత ఆలస్య చెల్లింపులపై జరిమానా వడ్డీని వసూలు చేయడానికి వీలవుతుందని రజనీష్ తెలిపారు. రియల్టీకి అత్యవసర ప్రాతిపదికన సహాయ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. గడువును 6 నెలలు పొడిగించాలి.. కార్మికులు, ముడిసరుకుల కొరత కారణంగా నివాస ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం కష్టమవుతుంది. అందుకే సంబంధిత ప్రాజెక్ట్‌ల నిర్మాణ గడువు తేదీని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నుంచి 6 నెలల కాలం పొడిగించాలని షా కోరారు. కనీస ఒక త్రైమాసికం పాటైనా మున్సిపల్ పన్నులను మాఫీ చేయాలని సూచించింది. పన్నులు, బిల్లులు చెల్లించలేని సంస్థలకు జరిమానాలు విధించరాదని, ఆయా సంస్థలు తిరిగి చెల్లించడానికి 3–6 నెలల సమయం ఇవ్వాలని సూచించారు. వడ్డీ లేని రుణ వాయిదాలను 6 నెలల పాటు అందించాలన్నారు. -
టూరిజం కుదేలు...
కోల్‌కతా: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి దేశీ పర్యాటక, ఆతిథ్య రంగాలు ఊహించనంత వేగంగా కుదేలవుతున్నాయని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. టూరిజం శాఖ గణాంకాల ప్రకారం జనవరి–మార్చి త్రైమాసికంలో విదేశీ టూరిస్టుల రాక (ఎఫ్‌టీఏ) 67 శాతం, దేశీయంగా టూరిస్టుల ప్రయాణాలు 40 శాతం పడిపోయాయని వెల్లడించింది. ‘కరోనా వైరస్ ప్రతికూల ప్రభావంతో దేశవ్యాప్తంగా హాస్పిటాలిటీ రంగంలో ఆక్యుపెన్సీ 18–20 శాతం పడిపోయే అవకాశం ఉంది. మొత్తం 2020లో సగటు రోజువారీ రేట్లు 12–14 శాతం తగ్గిపోవచ్చు‘ అని ఐసీసీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ సింగ్ చెప్పారు. సుమారు 2.67 కోట్ల ఉద్యోగాల కల్పనతో ట్రావెల్, టూరిజం రంగం 2018లో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 9.2 శాతం వాటా దక్కించుకుందని ఆయన తెలిపారు. కరోనా సంక్షోభంలో చిక్కుకున్న చాలా మటుకు టూరిజం సంస్థలు కనీసం ఆరు నెలల పాటైనా ఈఎంఐలు, పన్నులు, ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల నుంచి తాత్కాలిక ఊరట కోసం ఎదురుచూస్తున్నాయని సింగ్ వివరించారు. ఈ నేపథ్యంలో టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటీ సంస్థలకు టర్మ్ రుణాల రీపేమెంట్‌పై మారటోరియం వ్యవధిని ఆరు నెలలకు వర్తింపచేయాలని, తదుపరి 12 నెలలకు జీఎస్టీ హాలిడే ప్రకటించి తోడ్పాటునివ్వాలని కేంద్రాన్ని ఐసీసీ కోరింది. ఆయా సంస్థలు ఆర్థికంగా నష్టపోకుండా, ఉద్యోగాల్లో కోత పడకుండా తోడ్పాటు కోసం ట్రావెల్ అండ్ టూరిజం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆ నిబంధనతో టూరిజం రంగానికి కష్టమే.. కరోనా కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకున్న కస్టమర్లకు రీఫండ్ చేయకుండా ఫోర్స్ మెజూర్ నిబంధన వాడుకునేలా విమానయాన సంస్థలకు అనుమతినిచ్చిన పక్షంలో టూరిజం, ట్రావెల్ రంగ సంస్థలపై భారీ ప్రతికూల ప్రభావం పడుతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షోభం నుంచి ఎయిర్‌లైన్స్ బైటపడేందుకు ఇది ఉపయోగపడవచ్చు గానీ వ్యవస్థలోని మిగతా రంగాలను దెబ్బతీస్తుందని, లక్షల మంది ఉపాధికి గండి కొడుతుందని పేర్కొంది -
జీవో నెం.4ను రద్దు చేయాలి
వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేసే జీవో నం. 4/2016ను రద్దు చేయాలని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు డిమాండ్ చేశారు. అదివారం గుంటూరులోని ఫ్యాన్సీ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయి వ్యాపార వర్గాల కీలక సమావేశం నిర్వహించారు. ఆతుకూరి మాట్లాడుతూ జీవో నం.4 వల్ల వ్యాపారస్తులు ఏ2 రిటన్స్ దాఖలు చేయడం ఒక రోజు ఆలస్యమైనా రోజుకు రూ.350 పెనాల్టీ విధించే అవకాశం ఉందని, దీంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అటువంటి జీవోని వెంటనే రద్దుచేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, బంద్ చేయడానికి కూడా వెనుకడబోమని ఆయన స్పష్టంచేశారు. సమావేశంలో వాణిజ్యపన్నుల శాఖ విశ్రాంత జాయింట్ కమిషనర్ పీవీ సుబ్బారావు జీవో నం.4 గురించి వివరిస్తూ అందులోని లోపాలు, ఇబ్బందులపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. పన్నుల విధానం మన జీవితంలో ఒక భాగస్వామిగా అయిందని, మనం ఎంత పన్ను చెల్లించాలి, ఎంత కడుతున్నామనే దానిపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.