వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేసే జీవో నం. 4/2016ను రద్దు చేయాలని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు డిమాండ్ చేశారు. అదివారం గుంటూరులోని ఫ్యాన్సీ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయి వ్యాపార వర్గాల కీలక సమావేశం నిర్వహించారు. ఆతుకూరి మాట్లాడుతూ జీవో నం.4 వల్ల వ్యాపారస్తులు ఏ2 రిటన్స్ దాఖలు చేయడం ఒక రోజు ఆలస్యమైనా రోజుకు రూ.350 పెనాల్టీ విధించే అవకాశం ఉందని, దీంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
అటువంటి జీవోని వెంటనే రద్దుచేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, బంద్ చేయడానికి కూడా వెనుకడబోమని ఆయన స్పష్టంచేశారు. సమావేశంలో వాణిజ్యపన్నుల శాఖ విశ్రాంత జాయింట్ కమిషనర్ పీవీ సుబ్బారావు జీవో నం.4 గురించి వివరిస్తూ అందులోని లోపాలు, ఇబ్బందులపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. పన్నుల విధానం మన జీవితంలో ఒక భాగస్వామిగా అయిందని, మనం ఎంత పన్ను చెల్లించాలి, ఎంత కడుతున్నామనే దానిపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.