కోల్‌కతా: కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సాహసోపేత నిర్ణయాలకు, సాహసోపేత పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) 95వ వార్షిక ప్లీనరీని ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఇప్పటివరకు దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారు చేసి ఎగుమతి సైతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశ స్వయం సమృద్ధికి గత ఐదారేళ్లుగా తన ప్రభుత్వ విధానాల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అయితే, ఈ దిశగా చర్యలను ఎలా మరింత వేగవంతం చేయాలో మనకు ఈ కోవిడ్–19 సంక్షోభం నేర్పించిందన్నారు. భారత ఆర్థిక రంగాన్ని నియంత్రిత వ్యవస్థ నుంచి క్రియాశీల వ్యవస్థ దిశగా మార్చాలని, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఉత్పత్తిని భారత్ తయారు చేయగలదనే పేరు సాధించాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక వర్తకులు, వ్యాపారవేత్తలను ప్రధాని ప్రశంసించారు. వారి వద్ద స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనడమంటే వారి సేవలను గుర్తించడమేనన్నారు. ప్రజా కేంద్రక, పర్యావరణ హిత అభివృద్ధి తమ ప్రభుత్వ విధానమని ప్రధాని గుర్తు చేశారు.
రైతులు దేశంలో ఎక్కడైన తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కల్పించడాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవల తాము తీసుకున్న నిర్ణయాలతో దేశ రైతాంగం, వ్యవసాయ రంగం దశాబ్దాల బానిసత్వం నుంచి బయటపడిందన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాను, ప్రతీ గ్రామాన్ని స్వయం సమృద్ధం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. భారతీయులు దేశీయ అవసరాలు తీర్చడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. వైద్య పరికరాలు, రక్షణ రంగ ఉత్పత్తులు, బొగ్గు, ఖనిజాలు, వంట నూనె మొదలైన వాటిలో స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల నిర్వచనంలో మార్పు, కంపెనీల చట్టంలో సవరణలు, దివాళా చట్టం, నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణలు.. తదితర సంస్కరణలను ప్రధాని ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment