న్యూఢిల్లీ: కోవిడ్–19 విజృంభిస్తున్న నేపథ్యంలో యువతలో నైపుణ్యానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వాణిజ్య స్థితిగతులు, మార్కెట్ రంగంలో అనూహ్య మార్పులు చేసుకుంటున్న వేళ నైపుణ్యం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఇతరుల్ని నిపుణులుగా తీర్చిదిద్దడం అత్యంత కీలకమని యువతకు పిలుపునిచ్చారు.
వరల్డ్ యూత్ స్కిల్ డేని పురస్కరించుకొని మోదీ బుధవారం యువతకు వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు. అయిదేళ్ల క్రితం ఇదే రోజున స్కిల్ ఇండియా మిషన్‌ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మిషన్ ద్వారా గత అయిదేళ్లలో 5 కోట్ల మందికి పైగా వివిధ రంగాల్లో తమ నైపుణ్యాల్ని మెరుగుపరచుకున్నారన్నారు. తద్వారా యువతకి స్థానికంగా, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మోదీ తెలిపారు.
కరోనాతో మారిన ప్రపంచం
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రపంచంలో త్వరితగతిన మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో నిపుణులైన యువతకి చాలా ప్రాధాన్యముంటుందని మోదీ చెప్పారు. కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల స్వరూపాలు పూర్తిగా మారిపోయాయని, పనిచేసే పరిస్థితుల్లో కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీ కూడా దీనిపై ప్రభావం చూపిస్తోందన్నారు. కొత్త తరహా ఉద్యోగాలు, కొత్త తరహా పనితీరుతో మన దేశంలో యువత కొత్త నైపుణ్యాలను పెంచుకుంటోందని ప్రధాని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విధానాలు, మార్కెట్ పరిస్థితుల్లో త్వరితగతిన వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఎలా మారాలన్న ప్రశ్నలు ఎక్కువమంది తనను అడుగుతున్నారని, దానికి తన దగ్గరున్న ఒకే ఒక్క సమాధానం ‘స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్’ అని చెప్పారు. నైపుణ్యం, దానిని మెరుగుపరచుకోవడం, ఇతరులకు నైపుణ్యాన్ని నేర్పించడమే యువతకు ఉపాధి కల్పించే మంత్రమని ప్రధాని స్పష్టం చేశారు. ‘‘నైపుణ్యం వంటిది మరోటి లేదు. అది మిమ్మల్ని విభిన్నంగా తీర్చిదిద్దుతుంది. నైపుణ్యం ఒక జ్ఞాన సంపద వంటిది. దానిని మీ నుంచి ఎవరూ తీసుకువెళ్లలేరు. నైపుణ్యం స్వయంసమృద్ధి వంటిది. దాని వల్ల మీ కాళ్ల మీద మీరు నిలబడడమే కాదు, మీరే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు’’అని నైపుణ్యం ప్రాధాన్యతను వివరించారు. నిపుణులైన కార్మికుల్ని గుర్తించడానికి ఇటీవల ఒక పోర్టల్ ప్రారంభించామని, తిరిగి గ్రామాలకు వెళ్లిన వలస కార్మికులకు ఉపాధినివ్వడంలో దీనిని వినియోగించుకోవాలన్నారు.
చర్చల ద్వారా వాణిజ్య వివాదాలు పరిష్కారం
భారత్, ఈయూ సదస్సులో నిర్ణయం
స్వేచ్ఛాయుత వాణిజ్యంలో దీర్ఘకాలంగా నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి అత్యున్నత స్థాయి చర్చలు జరపాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించాయి. రక్షణ, అణు ఇంధనశక్తి, ఆరోగ్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేలా సంబంధా లను బలోపేతం చేయాలని, దానికి పంచవర్ష ప్రణాళికను రూపొందించాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. బుధవారం జరిగిన 15వ ఈయూ– ఇండియా సదస్సు వీడియో సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈయూలో ఉన్న 27 దేశాలతో సత్సంబంధాల ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment