కిస్తీలు కట్టాల్సిందే! | Auto Drivers Worried About EMI Pay With Intrest to Private Banks | Sakshi
Sakshi News home page

కిస్తీలు కట్టాల్సిందే!

Published Mon, Apr 20 2020 11:10 AM | Last Updated on Mon, Apr 20 2020 6:16 PM

Auto Drivers Worried About EMI Pay With Intrest to Private Banks - Sakshi

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో మూడు నెలలపాటు బ్యాంకు లోన్లు కట్టకున్నా చర్యలేమీ ఉండవని స్వయంగా ఆర్‌బీఐ ప్రకటించినా.. కిస్తీలు కట్టాల్సిందేనని ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలు వెంటపడుతున్నాయి. రుణగ్రహీతలపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో లోన్లు తీసుకున్నవారు అయోమయానికి గురవుతున్నారు.

ఈయన పేరు భరత్‌గౌడ్‌. ఆరు నెలల క్రితం ఓ ఫైనాన్స్‌ కంపెనీ ద్వారా బైకును కొనుగోలు చేశాడు. ప్రతి నెల ఐదో తేదీన కిస్తీని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపులకు ఆర్బీఐ మూడు నెలలపాటు మినహాయింపు ఇవ్వడంతో కొంత ఊరట చెందాడు. అయితే ఈఎంఐ చెల్లించకపోతే వడ్డీతోపాటు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుందని సదరు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారని భరత్‌ పేర్కొంటున్నాడు. దీంతో చేసేదేమీలేక ఈఎంఐ చెల్లించాడు.

రామారెడ్డి: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మూడు నెలలపాటు ఈఎంఐలపై మారటోరియం విధించింది. జిల్లాలో 47 వేల వరకు ఆటోలు, కార్లు, మరో 40 వేల వరకు బైక్‌లను వివిధ ఫైనాన్స్‌ సంస్థలనుంచి రుణాలు పొంది కొనుగోలు చేశారు. ఆర్బీఐ నిర్ణయంతో జూన్‌ వరకు ఈఎంఐలు చెల్లించాల్సిన బాధ తప్పిందని రుణగ్రహీతలు కాస్త ఊరట చెందారు. అయితే కొన్ని ఫైనాన్స్‌ సంస్థలు ఆర్బీఐ నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు. ఈఎంఐలు కట్టాల్సిందే అంటున్నాయి. ఈఎంఐకి సరిపడా డబ్బు బ్యాంకు ఖాతాలో ఉంచాలని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతుండడంతో రుణగ్రహీతలు ఆందోళన చెందుతున్నారు. 

ఒత్తిడి తెస్తున్న ప్రైవేటు ఫైనాన్స్‌లు..
బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌ల ద్వారా జిల్లాలో అనేక మంది ఆటోలు, కార్లు కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు. అయితే లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బందిపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయంతో వారు ఎంతో ఊరట చెందారు. అయితే కొన్ని ఫైనాన్స్‌ కంపెనీలు మాత్రం ఈఎంఐలను చెల్లించాల్సిందేనని వాహదారులకు ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నారు. ఈఎంఐకి సరిపడా డబ్బులను బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచకపోతే చెక్‌బౌన్స్‌కు సంబంధించి జరిమానా చెల్లించాల్సి వస్తుందని, వడ్డీ కూడా పడుతుందని చెబుతున్నారు. 

ఆటోవాలాల పరిస్థితి దారుణం...
రోజంతా ఆటో నడిస్తే డిజిల్‌ ఖర్చులు ఇతర ఖర్చులుపోను రోజూ రూ. 300 నుంచి రూ. 500 వరకు మిగులుతాయి. వీటిని పోగుచేసి ఈఎంఐ చెల్లిస్తుంటారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో వారికి ఉపాధి కరువైంది. ఆటోలు రోడ్డెక్కడం లేదు. ఇలాంటి పరిస్థితిలో కిస్తీలు ఎలా కట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కిస్తీలు ఎట్ల కట్టాలి
లోన్‌ తీసుకుని ఆటో కొనుక్కున్నాను. ప్రస్తుతం అంతా బంద్‌ ఉంది. ఆటోలు నడవడం లేదు. లోన్‌ కిస్తీ ఎట్ల కట్టాలో తెలుస్తలేదు. అధికారులు స్పందించి, కిస్తీలను వాయిదా వేయించాలి.–వెంకట్‌గౌడ్,ఆటో డ్రైవర్, యాడారం

రూ. 1,600 ఫైన్‌ పడుతుందంటున్నరు
ఫైనాన్స్‌ తీసుకుని ఆటోను కొనుగోలు చేశాను. లాక్‌డౌన్‌తో పనిలేకుండాపోయింది. ఫైనాన్స్‌ సంస్థ వారు ఫోన్‌ చేసి కిస్తీ కట్టాలంటున్నరు. లేకపోతే నెలకు రూ. 1,600 వరకు ఫైన్‌ పడుతుందంటున్నరు. ఏం చేయాలో తోచడం లేదు.    – సురేశ్, ఆటో డ్రైవర్, రామారెడ్డి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement