విశాఖ లీగల్: రుణం ఇవ్వకుండానే ఓ వ్యక్తి నుంచి 10 నెలలు ఈఎంఐ వసూలు చేసిన విశాఖలోని ఎన్‌ఏడీ కొత్త రోడ్‌లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖకు జిల్లా వినియోగదారుల ఫోరం–2 రూ.లక్ష జరిమానా విధించింది. దీనిపై బ్యాంక్ అధికారులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో అప్పీలు చేయగా, జరిమానాను రూ.50వేలకు తగ్గించింది. విశాఖలోని మురళీనగర్‌కు చెందిన మాథా ఉదయభాస్కర్ భారత సైన్యంలో పనిచేస్తున్నారు.
ప్రతి నెలా ఆయన జీతం ఎన్‌ఏడీ కొత్త రోడ్‌లోని ఎస్‌బీఐ శాఖలో ఉన్న తన ఖాతాలో జమ అవుతుంది. ఉదయభాస్కర్ మధురవాడలో సొంత ఇంటి నిర్మాణం కోసం రూ.25లక్షలు రుణం కావాలని 2017లో ఎస్‌బీఐ ఎన్‌ఏడీ కొత్త రోడ్ శాఖ అధికారులను సంప్రదించారు. రుణం ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు అంగీకరించి, ఆయనతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ఇంటికి కొన్ని అనుమతులు రాకపోవడం వల్ల రుణం మంజూరు చేయలేదు.
కానీ, రుణం ఇచ్చి నట్లుగానే ఉదయభాస్కర్ బ్యాంక్ ఖాతా నుంచి నెలకు రూ.21,538 చొప్పున 10నెలలు రూ.2,15,380లు, సరైన సమాచారం ఇవ్వలేదని మరో రూ.10వేలు కట్ చేసుకున్నారు. బీమా సొమ్ము కింద పీఎన్‌బీ మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూ.2,701 తీసుకున్నారు. తన ఖాతా నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంక్, బీమా కంపెనీవారిని ఉదయభాస్కర్ కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆయన 2019లో విశాఖలోని వినియోగదారుల ఫోరం–2లో ఫిర్యాదు చేశారు.
కేసు విచారణ చేసిన ఫోరం–2 న్యాయమూర్తి జి.వేంకటేశ్వరి, సభ్యులు డాక్టర్ రమణబాబు, పి.విజయదుర్గ.. వినియోగదారుడికి సేవాలోపం కలిగించినందుకు ఎస్‌బీఐ ఎన్‌ఏడీ కొత్త రోడ్ శాఖకు రూ.లక్ష జరిమానా విధిస్తూ 2022, మేలో తీర్పు చెప్పారు. ఈఎంఐ, జరిమానా, బీమా రూపంలో తీసుకున్న రూ.2,15,380లను12% వడ్డీతో చెల్లించాలని, ఖర్చుల కింద మరో రూ.20వేలను కలిపి 45 రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై బ్యాంక్ అధికారులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఫోరం తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఆదేశిస్తూ జరిమానాను తగ్గించారు.
Comments
Please login to add a commentAdd a comment