సొంతింటి కష్టాలు కొంటారా? | own house and rental house probloms | Sakshi
Sakshi News home page

సొంతింటి కష్టాలు కొంటారా?

Published Mon, Jun 5 2017 12:10 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

సొంతింటి కష్టాలు కొంటారా? - Sakshi

సొంతింటి కష్టాలు కొంటారా?

సొంతిల్లంటే అదో సంతృప్తి... కానీ 
అధిక రుణంతో ఇబ్బందులూ ఉంటాయి
ఇంటి అద్దెకు ఈఎంఐలు ప్రత్యామ్నాయం కాదు 
నిర్మాణంలో ఆలస్యమైతే మొదటికే మోసం
భవిష్యత్తు ఆదాయాన్ని బట్టి రుణాలొద్దు 
నెలవారీ వాయిదాలు బడ్జెట్లోనే ఉండాలి


సాయికుమార్‌ ఇంటద్దె నెలకు రూ.20 వేలు. మంచి ఏరియాలో చక్కని త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ అది. ఏ చీకూచింతా లేకుండా గడిచిపోతోంది. అయితే వాళ్లింటికి కాస్త దూరంలో కొత్తగా ఫ్లాట్స్‌ నిర్మాణం మొదలెట్టారు. తను ఇప్పుడున్న లాంటిదే ఓ ఫ్లాటు తీసుకుంటే బాగుంటుంది కదా? అనిపించింది సాయికుమార్‌కి. వెళ్లి బిల్డర్‌తో మాట్లాడాడు. బేరసారాలన్నీ పూర్తయ్యాక... చివరికి రూ.80 లక్షలకు తీసుకోవటానికి సరేనన్నాడు సాయి. ఇంటికొచ్చి అదే విషయం భార్య అనుపమతో చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది.

అంతలోనే సాయికుమార్‌ బావమరిది నరేష్‌ వచ్చాడు. తనకి విషయం చెప్పేసరికి... ‘‘బావా! ఆ ఇంటికోసం నీ సొంతంగా కనీసం 20 లక్షలైనా క్యాష్‌ పెట్టాలి. దానికోసం నీ దగ్గరున్న డబ్బులన్నీ ఖాళీ చేసుకోవాలి. పైపెచ్చు రూ.60 లక్షల లోన్‌ తీసుకోవాలి. దానికి నెలవారీ ఈఎంఐగా కనీసం 55 వేల చొప్పున 20–25 సంవత్సరాలు కట్టాలి. నెలకు రూ.20 వేలతో పోయేదానికి ఇదంతా అవసరమా?’’ అంటూ క్లాస్‌ పీకాడు. దానికి సాయికుమార్‌ ఇచ్చిన సమాధానమేంటో తెలుసా...? ‘‘సొంతింటి ముందు ఈ లెక్కలన్నీ వేస్ట్‌రా!’’ అని.

నిజం! సొంతింటి ముందు ఏ లెక్కయినా వేస్టే. కొందరు కోట్లకు కోట్లు పోసి భారీ బంగళాలు కట్టించుకుంటారు. కొందరు ఉన్నదంతా ఊడ్చి మరీ చిన్న ఇల్లయినా సమకూర్చుకోవాలనుకుంటారు. ఎందుకంటే... సొంతిల్లు మనదేశంలో ప్రతి ఒక్కరి కల. కాకపోతే ఈ కలను సాకారం చేసుకోవటంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ రుణం వస్తుంది కదా అని ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసి... ఆ తరవాత ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడితే!!? అపుడు ఇతర లక్ష్యాల విషయంలో రాజీ పడాలి. చివరికి ఇల్లు గడవడం కూడా కష్టం కావచ్చు. మరీ ఇబ్బందులొస్తే ఆ ఇల్లు విక్రయించాల్సిన పరిస్థితులూ రావొచ్చు. అందుకే సొంతింటి రుణానికీ లక్ష్మణ రేఖ కావాలి.
–సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

నిర్మాణంలో ఆలస్యం... వద్దే వద్దు!
నిర్మాణంలో ఉన్న ఇంటి కోసం రుణం తీసుకున్నారనుకోండి. ఆ ఇంటిని మీకు అనుకున్న సమయంలో బిల్డర్‌ స్వాధీనం చేయగలగాలి. లేదంటే ఇరువైపులా నలిగిపోక తప్పదు. ఒకవైపు తీసుకున్న రుణానికి ఈఎంఐ చెల్లించాలి. మరోవైపు అప్పటికే ఉంటున్న ఇంటికి అద్దె కూడా చెల్లించాలి. ఉదాహరణకు చేతన్‌ 2009లో మాదాపూర్‌లో రూ.35 లక్షలు పెట్టి ఓ ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. బిల్డర్‌కు మంచి పేరుండటంతో నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి రేటొస్తే అమ్మేద్దామనుకున్నాడు. రుణం తీసుకుని ఫ్లాట్‌ కోసం చెల్లించాడు. వాస్తవానికి ఇప్పటికీ ఆ నిర్మాణం పూర్తి కాలేదు, ఫ్లాట్‌ చేతన్‌ చేతికి అందలేదు. కానీ, ఈ లోపు చేతన్‌కు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. ఇప్పటికీ ఈఎంఐ కడుతూనే ఉన్నాడు. అటు నివాసం ఉంటున్న ఇంటికి అద్దె కూడా చెల్లిస్తున్నాడు.

ప్రస్తుత ఆదాయమే కొలమానం
ఈఎంఐ చెల్లించగలమనే ధీమాతో అధిక మొత్తంలో రుణం తీసుకుంటే... ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పులు రావటం వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. భవిష్యత్తులో ఆదాయం ఇంకా పెరుగుతుందని లేదా ప్రాపర్టీ విలువ పెరిగితే దాన్ని విక్రయించొచ్చులే అనే ఆలోచనలతో కాకుండా... ప్రస్తుత మీ ఆదాయ పరిధికి లోబడి మీరు చెల్లించగల స్థాయికి తగ్గట్టే ఇంటికి ప్లాన్‌ చేసుకుంటే మంచిది. తక్కువ వడ్డీ రేటుకే రుణం వస్తుంది కదా అని ఎక్కువ రుణం తీసేసుకుంటే భవిష్యత్తులో వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం లేకపోలేదు కదా. అప్పుడేమవుతుందో కాస్త ఆలోచించాలి కదా!!

జీతంలో 40 శాతం దాటొద్దు...
ఏదేమైనప్పటికీ నెలసరి ఆదాయంలో ఇంటి రుణం కోసం చెల్లింపులు 40 శాతాన్ని మించకూడదన్నది నిపుణులు చెప్పే సూత్రం. అంతకుమించి ఈఎంఐగా చెల్లిస్తుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇంటి పన్ను, నీటి పన్ను, నిర్వహణ చార్జీలు కూడా ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అద్దెకు ఈఎంఐ ప్రత్యామ్నాయం కాదు
కొందరి ఆలోచన మరో రకంగా ఉంటుంది. అద్దె రూపంలో డబ్బులు వృథా చేసుకోవడం ఎందుకనే ఆలోచనతో వారు సొంతింటి వైపు అడుగులు వేస్తారు. అదేదో రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసి, అద్దె కోసం పెట్టేదేదో ఈఎంఐగా చెల్లిస్తే పోతుంది కదా అనుకుంటుంటారు. ఈ ఆలోచనతోనే ఇంటిని కొంటారు. కానీ, ఇది ఎంత వరకూ సరైనదంటే... కొనుగోలు చేసే ఇల్లు, తీసుకునే రుణం ఈ రెండూ కూడా మీ బడ్జెట్‌లో భరించే స్థాయిలోనే ఉండాలి. కొనేంత శక్తి లేకుంటే దానికి బదులు అద్దెంట్లోనే ఉండి... నెలనెలా అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలి. దీనివల్ల నిర్ణీత కాలంలో పెద్ద నిధి సమకూరుతుంది. అప్పుడు ఇంటి కొనుగోలుకు ప్లాన్‌ చేసుకోవచ్చు.

తప్పు మీద తప్పు
మస్తాన్‌ (26) చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. నెలసరి ఆదాయం రూ.60వేలు. ఇంటి రుణంపై ఈఎంఐగా నెలకు రూ.20,000 చెల్లిస్తున్నాడు. దీనికి అదనంగా కారు కోసం తీసుకున్న రుణానికి రూ.10,000, పర్సనల్‌ లోన్‌కు రూ.5,000 చెల్లిస్తున్నాడు. నిజానికి ఇతడి ఖాతాలోకి పర్సనల్‌ లోన్‌ ఎందుకు వచ్చి చేరిందో తెలుసా...? ఇంటి రుణం, కారు రుణం కోసం ఎక్కువ చెల్లింపులు చేయడం వల్లే. మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైతే మరో పర్సనల్‌ లోన్‌ తీసుకోవడమే అతడికి తెలిసిన పరిష్కారం. రుణాల ఊబిలో కూరుకుపోవడం అంటే ఇదే. అందుకే రుణాలకు చెల్లింపులు ఆదాయంలో 40 శాతంలోపునకే కట్టడి చేయడం శ్రేయస్కరం.  

అత్యవసర నిధి, బీమా తర్వాతే...
భారీ బడ్జెట్‌తో ఇల్లు కొనాలని భావిస్తే ముందు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే అధిక ఈఎంఐ కారణంగా ఏదైనా ఓ నెలలో కుటుంబ అవసరాలకు కటకట ఏర్పడితే అత్యవసర నిధి ఆదుకుంటుంది. ఈ నగదును లిక్విడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంచుకోవచ్చు. ఎంతైతే ఇంటి రుణం తీసుకున్నారో, అంత కవరేజీతో జీవిత బీమా టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. మీకు జరగరానిది జరిగితే మీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల పాలు కాకుండా ఆదుకుంటుంది. సాధారణంగా ఇంటి రుణం ఇచ్చే సంస్థలే రుణానికి తగినంత టర్మ్‌ పాలసీని ఆఫర్‌ చేస్తుంటాయి. దానికి బదులు విడిగా టర్మ్‌ పాలసీ తీసుకోవడం ప్రయోజనకరం. దీనికి తోడు జాబ్‌ లాస్‌ ఇన్సూరెన్స్‌ (ఉద్యోగం కోల్పోతే రక్షణనిచ్చే) పాలసీ కూడా తీసుకోవడం మంచిదనేది నిపుణుల సూచన. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే ఇంటి రుణ ఈఎంఐ భారాన్ని బీమా కంపెనీ మోస్తుంది.

మరో అవకాశం లేకపోతే?
ఇంటికి సంబంధించిన చెల్లింపుల భారంతో ఇబ్బంది పడుతుంటే దాన్ని విక్రయించేసి తక్కువ బడ్జెట్‌లో మరో ఇల్లు కొనుగోలు చేయటానికి ప్లాన్‌ చేసుకోవటం మంచిది. ఇతరత్రా ఎటువంటి అవకాశాలు లేక, రుణం తీర్చలేక ఇబ్బందుల్లోకి వెళ్లటం కంటే ఇదే మేలన్నది ప్రాపర్టీ నిపుణుల సూచన.

ఇల్లు లిక్విడ్‌ అస్సెట్‌ కాదు
రితేశ్‌ అతని శ్రీమతి కవిత ఇద్దరూ కలసి నెలకు రూ.1.3 లక్షలు సంపాదిస్తున్నారు. ఇద్దరి పేరిటా వేర్వేరు రుణాలు తీసుకుని ఈఎంఐగా రూ.72,000 చెల్లిస్తున్నారు. ప్రతి నెలా రూ.30,000 ఇంటి ఖర్చు వస్తోంది. దీనికి తోడు వార్షికంగా బీమా పాలసీలకు చేసే చెల్లింపులు, ప్రాపర్టీ ట్యాక్స్‌ ఇతరత్రా ఖర్చులు పోను చివర్లో, ఇన్వెస్ట్‌మెంట్‌కు కేటాయించేది పది శాతానికి మించడం లేదు. వేతనంలో ఎక్కువ భాగం రుణాలకు వెళ్లినప్పటికీ భవిష్యత్తులో తన ప్రాపర్టీలు మంచి విలువ తెచ్చిపెడతాయన్నది రితేశ్‌ ధీమా. అవసరమైతే ఓ ఇల్లు అమ్మేసి నగదు చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నాడు.

కానీ ప్రాపర్టీ అన్నది అనుకున్న వెంటనే నగదుగా మార్చుకునే లిక్విడ్‌ అస్సెట్‌ కాదు. చెప్పిన ధరకు అమ్ముడుపోయే అవకాశమూ తక్కువే. నోట్ల రద్దు తర్వాత సెకండరీ హౌసింగ్‌ మార్కెట్‌ బాగా నీరసించిపోయింది. అదే సమయంలో ఇళ్ల ధరలు గత కొన్నేళ్లుగా అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. దీంతో మరికొన్నాళ్లు పరిస్థితిలో మెరుగుదల ఉండకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అందుకే ఇంటి రుణం అధికంగా తీసుకుని ఎక్కువ మొత్తంలో ఈఎంఐలు చెల్లించడానికి సిద్ధమయ్యే ముందు ఒకటికి రెండు సార్లు తమ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోవాలన్న వారి సూచన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement