మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం కోసం కూడా చాలా కష్ట పడుతారు. అయితే, సరిగ్గా ఇల్లు కొనే సమయం ముందు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారి కలల గృహం కట్టడం కోసం హోమ్ లోన్ తీసుకోవడం అనేది అత్యంత కీలక నిర్ణయం. దీనిపై ఎంతో హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనం చేసే చిన్న, చిన్న పొరపాట్లకు ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకోసమే, ఇల్లు కొనేముందు ఈ 3/20/30/40 ఫార్ములా గురుంచి తెలుసుకుంటే చాలా మంచిది. దీని వల్ల రాబోయే కాలంలో వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
3 అంటే మీ ఇంటి మొత్తం ఖర్చు..
ఈ 3/20/30/40 ఫార్ములాలో "3" దేనిని సూచిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నియమంలో “3” అంటే మీరు ఇంటి కోసం చేసే మొత్తం ఖర్చు మీ ఆదాయానికి 3 రేట్లు మించకూడదు అని అర్ధం. అయితే, ఇది తక్కువ వార్షిక ఆదాయం గల వారికి వర్తిస్తుంది. మీ ఆదాయం బట్టి కొన్ని కొన్ని సార్లు "5" రేట్ల మొత్తాన్ని ఇంటి కోసం ఖర్చు చేయవచ్చు. ఉదాహరణ: ఒక వ్యక్తి వార్షిక సంపాదన అనేది రూ.2 లక్షలు అయితే, ఆ వ్యక్తి ఇంటి కోసం చేసే ఖర్చు రూ.6 లక్షలకు మించరాదు.
ఇంత తక్కువ ధరతో పట్టణాలు, నగరాల్లో ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయడం అసాధ్యమే. అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తులు, షేర్లు వంటి వాటిని విక్రయించి డబ్బు సమకూర్చుకోవడం మేలు. అయితే, ఒక ఆస్తిని అమ్మే ముందు అంత విలువ చేసే ఇల్లు మీ సొంతమవుతుందా లేదా అంచనా వేసుకోవాలి.
20 అంటే రుణ కాల వ్యవది
ఈ 3/20/30/40 ఫార్ములాలో "20" దేనిని సూచిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంటి కోసం తీసుకునే రుణ కాల వ్యవదిని “20” అనేది సూచిస్తుంది. సులభంగా చెప్పాలంటే, మీ గరిష్ట గృహ రుణ కాల వ్యవది "20" ఏళ్లకు మించరాదు. మీ వార్షిక ఆదాయం గనుక ఎక్కువగా ఉంటే, రుణ కాల వ్యవది "20" ఏళ్ల కంటే తక్కువ ఉంటే మంచిది.
(చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. ఛార్జింగ్ కష్టాలకు చెక్!)
30 అంటే ఈఎంఐ మొత్తం
ఈ 3/20/30/40 ఫార్ములలో “30” అనేది, మీరు అన్నీ రకాలుగా చెల్లించే ఈఎమ్ఐ((కారు, వ్యక్తిగత రుణం, గృహ రుణం వంటి అన్ని ఇతర ఈఎమ్ఐలతో సహా) మొత్తం కలిపి మీ వార్షిక ఆదాయంలో 30 శాతానికి మించరాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షలు అనుకుంటే, ఆ మొత్తంలో అన్నీ ఈఎమ్ఐ మొత్తాలకు కలిపి రూ.2 లక్షలకు మించరాదు అని అర్ధం.
40 - కనీస డౌన్ పేమెంట్
ఈ 3/20/30/40 ఫార్ములలో “40” అనేది మీరు ఇంటి కోసం చెల్లించే డౌన్ పేమెంట్ గురుంచి తెలియజేస్తుంది. అంటే, మీరు కొనే ఇంటి మొత్తం విలువలో 40 శాతం డౌన్ పేమెంట్ రూపంలో చెల్లిస్తే మంచిది. మిగతా మొత్తం కోసం రుణం తీసుకోవచ్చు. మీరు తీసుకునే గృహ రుణం మాత్రం మీ కొత్త ఇంటి విలువలో 60 శాతం కంటే తక్కువగా ఉంటే చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment