ఈఎంఐ 'ఈజీ' ? | RBI cuts key rate by 0.25%; home, auto EMIs to be lower | Sakshi
Sakshi News home page

ఈఎంఐ 'ఈజీ' ?

Published Thu, Aug 3 2017 12:16 AM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

ఈఎంఐ 'ఈజీ' ?

ఈఎంఐ 'ఈజీ' ?

తగ్గనున్న గృహ, ఆటో, కార్పొరేట్‌ ఈఎంఐల భారం
రెపో రేటు పావు శాతం తగ్గించిన రిజర్వు బ్యాంకు
6 శాతానికి దిగివచ్చిన ఆర్‌బీఐ ‘బ్యాంకింగ్‌’ రుణ రేటు
ఇది ఆరేళ్ల కనిష్ఠం; రివర్స్‌ రెపో కూడా 0.25 శాతం తగ్గింపు
10 నెలల విరామం తరువాత ఆర్‌బీఐ కీలక ప్రకటన
ద్రవ్యోల్బణం భయాలు తగ్గడంతో తాజా నిర్ణయం
వృద్ధి రేటు అంచనా 7.3 శాతం వద్దే యథాతథం  


ముంబై: మెజారిటీ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై తీసుకునే వడ్డీరేటు రెపోను... పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతానికి దిగివచ్చింది. ఇది ఆరేళ్లకు పైగా కనిష్ట స్థాయి. అదే విధంగా బ్యాంకులు తమ వద్ద స్వల్పకాలికంగా ఉంచే అదనపు నిధులకు సంబంధించి చెల్లించే రేటు– రివర్స్‌ రెపోను కూడా పావు శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 5.75 శాతానికి తగ్గింది. అయితే తమకు రెపో తగ్గింపు ద్వారా లభిస్తున్న ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

 తాజా నిర్ణయం వల్ల గృహ, ఆటో, కార్పొరేట్ల నెలవారీ రుణ పునః చెల్లింపుల (ఈఎంఐ) భారం కొంత తగ్గుతుంది. దాదాపు పది నెలల నుంచీ ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలతో రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్‌బీఐ, ప్రస్తుతం ఈ భయాలు తగ్గడంతో రెపో రేటు పావుశాతం తగ్గించినట్లుగా వివరించింది. వృద్ధికి ఇది భరోసా కల్పిస్తున్న అంశంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా 7.3 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తం– 4 శాతం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)లో ఎటువంటి మార్పు లేదు. అయితే మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్‌), బ్యాంక్‌ రేటు కూడా 6.25 శాతానికి దిగివచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా పటేల్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భేటీలో పావు శాతం రెపో రేటు కోత నిర్ణయం తీసుకున్నారు. అలాగే  ఎంపీసీ మెజారిటీ నిర్ణయం ఆధారంగా పాలసీ చర్యలు కూడా అదే భేటీలో మొదలు కావడం గమనార్హం.

మెజారిటీనే... ఏకాభిప్రాయం కాదు...
ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీలో నలుగురు సభ్యులు పావుశాతం తగ్గింపునకు ఓటు చేయగా, ఒకరు అరశాతం కోతకు సిఫారసు చేశారు. అయితే మరొకరు యథాతథ పరిస్థితికి ఓటు చేశారు. పావుశాతం కోతకు మొగ్గు చూపిన వారిలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్, డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య, ఛేతన్‌ ఘాటే, పామీ దువాలు ఉన్నారు. మరో సభ్యుడు రవీంద్ర హెచ్‌ దోలాకియా అరశాతం రేటు కోతకు సిఫారసు చేశారు. కాగా ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర యథాతథ పరిస్థితిని కొనసాగించడానికి తాను సానుకూలమని తెలిపారు.

ఎంసీఎల్‌ఆర్‌ విధాన మార్పు సంకేతం
బ్యాంకింగ్‌ రుణ మంజూరు రేటు నిర్ణయానికి సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న మార్జినల్‌ కాస్ట్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) విధాన పనితీరు పట్ల పూర్తి సంతృప్తి లేదని ఆర్‌బీఐ పేర్కొంది. దీనికి మార్కెట్‌ అనుసంధాన బెంచ్‌మార్క్‌ ప్రాతిపదికగా ఉంచే విధంగా ఒక అధ్యయనం జరుగుతున్నట్లు సూచించింది. ఈ మేరకు ఏర్పాటయిన గ్రూప్‌ సెప్టెంబర్‌ 24న తన నివేదికను అందించనున్నట్లు తెలిపింది.

 తన తాజా నిధుల సమీకరణ వ్యయాలపై  చెల్లిస్తున్న వడ్డీ ప్రాతిపదికన బ్యాంకింగ్‌ ఎంసీఎల్‌ఆర్‌ రేటును ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక కాలాల ప్రాతిపదికన సవరిస్తోంది. ప్రస్తుతం నెలవారీగా ఈ సమీక్ష జరుగుతోంది. దీనివల్ల ఆర్‌బీఐ రెపో రేటు ప్రయోజనం కొంత త్వరితగతిన కస్టమర్‌కు అందుతోందన్న అభిప్రాయమూ నెలకొంది. అయితే ఇప్పటికీ ఈ ప్రయోజనం అందించే విషయంలో ఇంకా వెనుకడుగులోనే ఉన్నట్లు ఆర్‌బీఐ అభిప్రాయపడింది.

మరిన్ని ముఖ్యాంశాలు..
ప్ల్లస్‌ 2 లేదా మైనస్‌ 2 శ్రేణితో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం లక్ష్యాలను కొనసాగించడంపై దృష్టి. పే కమిషన్‌ సిఫారసుల అమలు, వస్తు, సేవల పన్ను అనంతరం ధరల సర్దుబాట్ల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణంపై మరింత అప్రమత్తత.  

ప్రైవేటు రంగంలో పెట్టుబడులకు భారీ ఊతం లభించాల్సిన అవసరం ఉంది. మౌలిక రంగానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోవాలి.

గృహ నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) అమలు మరింత ముమ్మరం కావాలి.

2017 జూలై 28కి భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు 392.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

మొండిబకాయిల (ఎన్‌పీఏ)ల సమస్య పరిష్కారం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనం కేటాయింపులపై కేంద్రం– ఆర్‌బీఐ కలిసి పనిచేస్తాయి.

అటు కార్పొరేట్, ఇటు బ్యాంకింగ్‌ బ్యాలెన్స్‌ షీట్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇది

కొత్త పెట్టుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫారిన్‌ పోర్టిఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు రూ.5,000 కోట్ల ప్రత్యేక ఐఆర్‌ఎఫ్‌ (ఇంట్రస్ట్‌ రేట్‌ ఫ్యూచర్‌) పెట్టుబడుల విండో.

ఆర్‌బీఐ తదుపరి పరపతి విధాన సమీక్ష ఏడాది అక్టోబర్‌ 3, 4 తేదీల్లో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక సమావేశం)   జరుగుతుంది.

తగిన నిర్ణయమే.. ఇంకా తగ్గిస్తే బాగుండేది!
తాజా ఆర్‌బీఐ నిర్ణయం పట్ల బ్యాంకింగ్, పారిశ్రామిక, రియల్టీ తదితర వర్గాల నుంచి మొత్తంమీద హర్షం వ్యక్తమైనా, కొంచెం భిన్నత్వం ధ్వనించింది.  రుణ వృద్ధికి, ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ మెరుగుపడటానికి, వృద్ధి బలోపేతానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని బ్యాంకింగ్‌  వర్గాలు పేర్కొన్నాయి. అయితే అరశాతం రేటు కోత అవసరమని పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఆయా వర్గాల స్పందనలను పరిశీలిస్తే...

మార్కెట్‌ సెంటిమెంట్‌ బలోపేతం
తాజా నిర్ణయం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా రుణ వృద్ధి ఊపందుకోడానికి, డిమాండ్‌ మెరుగుకు తాజా నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నాం.
– అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్మన్‌

ఆర్థిక వ్యవస్థకు సానుకూలం
ఆర్థిక వ్యవస్థకు తాజా ఆర్‌బీఐ నిర్ణయం సానుకూలమైనదని నేను భావిస్తున్నాను. ఎంసీసీ తగిన మంచి నిర్ణయం తీసుకుందని విశ్వసిస్తున్నాను. వృద్ధికి ఈ నిర్ణయం ఊతం ఇస్తుంది.
– దీపక్‌ పరేఖ్, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌

సరైన నిర్ణయం ఇది...
ఆర్‌బీఐ తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంది. గణాంకాలకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌లో పెట్టుబడుల పట్ల గ్లోబల్‌ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుంది.
– చందా కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌

వృద్ధి దిశలో కీలక అడుగు
ఆర్‌బీఐ తాజా నిర్ణయం వృద్ధి దిశలో కీలక అడుగు. ద్రవ్యోల్బణంపై భయాలను సైతం అధిగమించేలా తాజా నిర్ణయం ఉంది. పెట్టుబడుల సెంటిమెంట్‌కు ఊతం లభిస్తుంది.
– సుభాశ్‌ చంద్ర గార్గ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి

అరశాతం రేటు కోత అవసరం: పరిశ్రమలు
తాజా నిర్ణయం హర్షణీయమైనదే అయినప్పటికీ,  ప్రస్తుతం వ్యవస్థలో పెట్టుబడుల పెంపునకు భారీగా అరశాతం రేటు కోత అవసరమని పారిశ్రామిక వర్గాలు డి మాండ్‌ చేస్తున్నాయి. ఒకపక్క ద్రవ్యోల్బ ణం అదుపులో ఉండటం, మరొకపక్క పెట్టుబడుల నత్తనడక నేపథ్యంలో, వృద్ధికి పునరుత్తేజం ఇవ్వడానికి ఆర్‌బీఐ నిర్ణయం దోహదపడుతుందని సీఐఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అరశాతం కోత మరింత ప్రయోజనం చేకూర్చుతుందనీ విశ్లేషించింది.

ఫిక్కీ కూడా ఇదే అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, ప్రైవేటు ఇన్వెస్ట్‌మెంట్‌ సెంటిమెంట్‌ ప్రస్తు  తం అత్యంత బలహీనంగా ఉందని తెలిపింది. పావు శాతం కోత కార్పొరేట్ల రుణ భారాన్ని పెద్దగా తగ్గించబోదని అసోచామ్‌ పేర్కొంది. కొంత సెంటిమెంట్‌ ను మాత్రం తాజా నిర్ణయం బలపరుస్తుందని భావిస్తోంది.  రేటు కోత చాలా స్వల్పమని జేకే పేపర్‌ వైస్‌ చైర్మన్, ఎండీ హర్స్‌ పతి సింఘానియా పేర్కొన్నారు.

హౌసింగ్‌ అమ్మకాలకు బూస్ట్‌...
‘పండుగుల సీజన్‌లో గృహ విక్రయాలకు తాజా ఆర్‌బీఐ నిర్ణయం ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే ఆర్‌బీఐ నుంచి అందిన రేటు ప్రయోజనాన్ని కస్టమర్‌కు అందించడంపై బ్యాంకులు శ్రద్ధ వహించాలి’ అని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ జక్షయ్‌ షా చెప్పారు.

న్‌పీఏల కట్టడికి క్రెడిట్‌ రిజిస్ట్రీ!
రాష్ట్రాల వ్యవసాయ రుణ మాఫీ విధానం ద్రవ్య క్రమశిక్షణ కట్టు తప్పడానికి దారితీసే వీలుంది. ప్రభుత్వ వృద్ధి వ్యయాలపై ప్రభావం చూపే అవకాశమూ ఉంది. ఇక తాజా ఆర్థిక క్రియాశీల పరిస్థితిని గమనిస్తే, వ్యవసాయ రంగం సానుకూలంగా ఉంది. పరిశ్రమ, సేవల రంగాల్లో మాత్రం బలహీన వృద్ది ధోరణులు కనబడుతున్నాయి. కార్పొరేట్‌ రంగంలో రుణ ఒత్తిళ్లు ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులకు మరింత డిమాండ్‌ పెరగాల్సి ఉంది.

తాజా గణాంకాల ప్రకారం– రెపో రేటు పావుశాతం తగ్గింపునకు వీలుంది. అలాగే  రెపో రేటు కోత ద్వారా అందుతున్న ప్రయోజనాన్ని బ్యాంకింగ్‌ కస్టమర్‌కు మరింతగా అందించే వీలుంది. గృహ, ఆటో రంగాలే కాకుండా మరికొన్ని రంగాలకూ రెపో తగ్గింపు ప్రయోజనం అందాలి. రుణాల అందుబాటు, మొండిబకాయిల పరిస్థితిపై తగిన పర్యవేక్షణ కోసం పబ్లిక్‌ క్రెడిట్‌ రిజిస్ట్రీని నెలకొల్పనున్నాం. దీన్ని రూపొందించేందుకు వీలుగా ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం.

 ఈ చర్యలు... రుణ నాణ్యత మెరుగుపడేందుకు దోహదం చేస్తాయి. తాజా రేటు కోత ప్రైవేటు ఇన్వెస్టŠట్‌మెంట్‌ను పెంచుతుందని భావిస్తున్నాం. ఇది తిరిగి ఉత్పత్తి వృద్ధికి, తద్వారా కంపెనీల బ్యాలెన్స్‌షీట్ల మెరుగుదలకు దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఇక డిమాండ్‌ ఒకసారి పుంజుకున్న తర్వాత, ఉత్పాదక రంగాలకు రుణ అందుబాటు మరింత మెరుగుపడ్డానికి చర్యలు తీసుకోవాలి.
– ఉర్జిత్‌ పటేల్, ఆర్‌బీఐ గవర్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement