కొత్త హోం లోన్ ఆఫర్: కొన్ని ఈఎంఐలు రద్దు
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొత్త గృహ రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గృహ ఋణ మార్కెట్లో ఎక్కువ మార్కెట్ వాటాను సంపాదించడానికి గుడ్ క్రెడిట్ అవార్డ్ కోసం ‘శుభ్ ఆరంభ్‘ పేరిట ఈ గృహ రుణ పథకాన్ని లాంచ్ చేసింది. ఇందులో కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. రూ. 30లక్షల రుణంపై దాదాపు మూడులక్షల దాకా తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అంటే 20 ఏళ్ల కాలానికి సంబంధించిన రుణాలపై ఈఎంఐలను రద్దు చేస్తోంది. అయితే ఫ్లోటింగ్ రుణ పథకం కింద వడ్డీ రేటుమాత్రం స్థిరంగా 8.35 శాతంగానే కొనసాగుతుందని పేర్కొంది. దీంతోపాటు అర్హులైన వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న మినహాయింపును కూడా పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకనటలో తెలిపింది.
యాక్సిస్ బ్యాంక్ ట్విట్టర్ లో అందించిన సమాచారం ప్రకారం ఈ కొత్త రుణ చెల్లింపు వ్యవధిలో కొన్ని నెలవారీ వాయిదా చెల్లింపులకు (ఈఎంఐ) మినహాయింపు లభించేలా ఈ పథకాన్ని రూపొందించింది. 4, 8, 12 వ సం.రం చివరలో సంవత్సరానికి 4 నెలసరి వాయిదాలు చొప్పున రద్దు చేస్తుంది. ఇలా 20 ఏళ్ల వ్యవధికి రుణం తీసుకున్నవారికి మొత్తం మీద 12 ఈఎంఐల మేర ప్రయోజనం కస్టమర్లకు లభించనుంది.
అంటే ఈ కొత్త పథకం ద్వారా సుమారు రూ. 30 లక్షల రుణంపై మొత్తం మీద రూ. 3.09 లక్షల మేర ఆదా అవుతుందని బ్యాంక్ తెలిపింది. అలాగే రూ. 30 లక్షల దాకా గృహ రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని, రుణ చెల్లింపు వ్యవధి తగ్గింపు రూపంలో ఈ ప్రయోజనం అందిస్తామని వివరించింది. అంతేకాదు ఏ ఒక్క ఈఎంఐని చెల్లించకపోయినా.. వారికి ఈ పథకం ప్రయోజనాలు లభించవని బ్యాంక్ స్పష్టం చేసింది.
You're closer to owning a home with the launch of Shubh Aarambh Home Loans. It's the helping hand you need, w/ 4 EMIs waived* every 4 years pic.twitter.com/kibU6QzOqF
— Axis Bank (@AxisBank) August 17, 2017