ప్రభుత్వ సాయం దక్కక వరద బాధితులకు తీవ్ర ఆర్థిక కష్టాలు
నీటమునిగిన ఆటోకు రూ.10వేలు, బైక్‌కు రూ.3వేలు ఒట్టిమాటే..
ఈఎంఐలు కట్టేందుకు మారటోరియం ఇస్తామన్న సీఎం చంద్రబాబు హామీ గాలికి..
కిస్తీలు కట్టాల్సిందేనంటూ ఫోన్లలో బాధితులను వేధిస్తున్న ఫైనాన్స్ కంపెనీలు
స్నేహితుల నుంచి అప్పు చేస్తే ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతా నుంచి లాగేసుకుంటున్న ఫైనాన్స్, బ్యాంకర్లు
ఎన్యుమరేషన్‌లో బైక్‌లు, ఆటోలను వదిలేసే కుట్రలో ప్రభుత్వం
‘ భార్యా భర్తలతో పాటు ఇంటిల్లిపాదీ కాయకష్టం చేసుకుని, సంవత్సరాల తరబడి కిస్తీలు కట్టుకుంటూ ఇంటిలో ఒక్కొక్కటిగా సమకూర్చుకున్న వస్తువులన్నీ వరద పాలయ్యాయి. నష్టపరిహారం ఇస్తామంటూ రెండుసార్లు వచ్చి రాసుకుని వెళ్లినా.. ఇంతవరకు సాయమందలేదు. అందుకోసం ఇప్పుడు నేను కూలి వదిలేసుకుని ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా. కిస్తీ కట్టలేదని ఫైనాన్స్ వాళ్లు నా బైక్ తీసుకెళ్లిపోయారు. మా అకౌంట్‌లో ఉన్న కాస్త డబ్బులను కూడా ఫైనాన్స్ వాళ్లు లాగేసుకుంటున్నారు. ఇక మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వగలం’ అంటూ వాంబే కాలనీకి చెందిన తాపీ కార్మికుడు ఆకుల గణేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘వరదల్లో మునిగిన ఆటోకు రూ.10వేలు సాయం చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే వరకు ఫైనాన్స్ కంపెనీలు ఊరుకోవు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోన్లు చేసి డబ్బులు కట్టమని వేదిస్తున్నారు. కిస్తీ కట్టకుంటే బండి తీసుకెళ్లిపోతారు. అలా జరిగితే నేను ఇప్పటి వరకు కట్టిన 22 కిస్తీలు, డౌన్ పేమెంట్ మొత్తం పోయినట్టే. ఇన్నాళ్లూ బండి నడవకున్నా అప్పు చేసి కిస్తీ కట్టాను. మరో రూ.15వేలు అప్పులు తీసుకుని రిపేర్ చేయించాను. మా ఇళ్లు నీట మునిగిపోయినా.. నా ఆటో పాడైనా ప్రభుత్వ జాబితాలో పేరు లేదంటున్నారు. ఎక్కడికి వెళ్లి ఎవరిని అడగాలో తెలియడం లేదు’ అంటూ వాంబే కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కె.రమేష్ వాపోయాడు.
సాక్షి, అమరావతి: విజయవాడను బుడమేరు వరద విడిచిపెట్టినా.. ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రం పట్టిపీడుస్తోంది. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడిన జీవితాలకు భరోసా కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ‘తాంబూళాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి’ అన్న చందాన వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించి.. దానిని పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైంది.
సోమవారం విజయవాడలోని వాంబేకాలనీ, వడ్డెర కాలనీ, శాంతిప్రశాంతి నగర్‌లో సాక్షి క్షేత్ర స్థాయిలో పర్యటించగా.. వరద బాధితులు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉక్కిరిబిక్కిరవుతూ కనిపించారు. నెలవారీ కిస్తీలు కట్టలేక దిక్కులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మారటోరియం ఇస్తారంటూ చేసిన ప్రకటనలు ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడంలేదు. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకర్లతో సమావేశం పెట్టి ఈఎంఐలు కట్టుకోవడానికి సమయం ఇచ్చేలా ఒప్పించామంటూ చేసిన హడావుడితో ఒనగూరిందేమీ లేదని తేలిపోయింది.
రోజు ఉదయాన్నే ఫైనాన్స్ కంపెనీలు బాధితులకు ఫోన్లు చేసి వాయిదాలు కట్టాల్సిందేనని వేదిస్తుండం పరిపాటిగా మారింది. నష్ట పరిహారం అందకపోవడంతో బంధువులు, స్నేహితుల నుంచి అప్పులు చేస్తున్నారు. తీరా ఆ మొత్తం బ్యాంకు ఖాతాల్లో పడిన వెంటనే కిస్తీల రూపంలో సదరు ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు లాగేసుకుంటున్నాయి.
జీరో అకౌంట్‌కు 15 రోజులా?
సాధారణంగా బ్యాంకులో కొత్తగా ఖాతా తీసుకోవాలంటే ఒక్క రోజులోనే పూర్తవుతుంది. కానీ, వరద ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో సుమారు 15 రోజులు పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాలు ఏదో ఒక ఈఎంఐకు లింక్ పెట్టి ఉండడంతో.. ఒకవేళ ప్రభుత్వ సాయం అందితే.. ఆ మొత్తం పాత ఖాతాలో పడితే ఎక్కడ బ్యాంకర్లు, ఫైనాన్స్ కంపెనీలు లాగేసుకుంటాయోనని బాధితులు నానా అగచాట్లు పడుతున్నారు. జీరో అకౌంట్ల కోసం బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్‌కు, బ్యాంకు ఖాతాలకు, ఫోన్ నంబర్లు ఒకదానికొకటి లింక్ కాపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఎన్యుమరేషన్‌లో బైక్‌లు వదిలేసి..
వరద బాధితులకు నష్ట పరిహారం అందించే క్రమంలో వీలైనంత వరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఎన్యుమరేషన్ ప్రక్రియలో చాలా కుటుంబాలకు చెందిన ద్విచక్ర వాహనాలు, ఆటోలను కావాలనే విస్మరించింది. దీంతో వాహనాలు దెబ్బతిన్న బాధితులు నష్టపోయారు.
తీరా అకౌంట్లలో నగదు జమవుతుందని తెలిసి సచివాలయాలకు వెళ్లడంతోఎన్యుమరేషన్‌లో తమ వాహనాలు నమోదు చేయలేదని తెలుసుకున్నారు. మళ్లీ కొత్తగా దరఖాస్తులు పట్టుకుని సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు బైక్‌లకు రూ.3వేలు, ఆటోలకు రూ.10 వేలు సాయం ఎంత మందికి ఇచ్చారన్నదే ప్రశ్నార్థకం.
Comments
Please login to add a commentAdd a comment