ముగిసిన లోన్లకూ ఈఎంఐ కోతలు!! | EMI cuts in sbi closed accounts | Sakshi
Sakshi News home page

రుణం తీరింది... 'కోత' మిగిలే ఉంది!

Published Tue, Oct 16 2018 12:29 AM | Last Updated on Tue, Oct 16 2018 1:12 PM

EMI cuts in sbi closed accounts  - Sakshi

(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) : మీకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కార్‌ లోన్, పర్సనల్‌ లోన్, గృహ రుణం వంటివేమైనా ఉన్నాయా? వాటిని ఈ మధ్య... అంటే ఏడాది, రెండేళ్ల కిందట పూర్తిగా తీర్చేసి క్లోజ్‌ చేశారా? అయితే మీరు ఒకసారి మళ్లీ మీ ఖాతాలను చూసుకోండి. మీరు వాటికి ఏ ఖాతాల నుంచి చెల్లింపులు చేశారో ఆయా ఖాతాల్లో కొత్త కోతలేమైనా పడ్డాయేమో సరిచూసుకోవటం మంచిది. ఎందుకంటే ఎస్‌బీఐ విషయంలో పూర్తిగా తీర్చేసి, క్లోజయిపోయిన రుణాలకు సైతం ఆటోమేటిగ్గా మళ్లీ ఈఎంఐ కోతలు జరిగిపోతున్నాయి.

ఒక్క సికింద్రాబాద్‌ ఆర్‌ఏసీపీసీ పరిధిలోనే వెయ్యి నుంచి రెండు వేల ఖాతాల వరకూ ఈ రకంగా ప్రభావితమైనట్లు ఎస్‌బీఐ వర్గాలు చెబుతున్నాయి. రెండు నెలలుగా ఈ సమస్య ఉందని, చాలా మందికి కోతలు పడ్డాయని, ఇప్పటికీ ఇది పరిష్కారం కాలేదని తెలియవచ్చింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఆయా ఖాతాలను పాత ప్లాట్‌ఫామ్‌ నుంచి కొత్త ప్లాట్‌ఫామ్‌కు మార్చాల్సి వచ్చిందని, ఈ క్రమంలో కన్వర్షన్‌ ప్రక్రియ సమర్థమంతంగా జరగలేదని ఎస్‌బీఐ అధికారి ఒకరు చెప్పారు.

‘‘ఈ కన్వర్షన్‌ ప్రక్రియ సరిగా జరగలేదు. అన్ని ఆదేశాలనూ (మాండేట్స్‌) అది తీసుకోలేదు. దీంతో పాత, క్లోజ్‌ చేసిన ఖాతాలు కూడా యాక్టివేట్‌ అవుతున్నాయి. వాటిల్లో కోతలు పడుతున్నాయి’’ అని సికింద్రాబాద్‌ ఆర్‌ఏసీపీసీలోని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఇలాగే తన ఖాతా నుంచి రెండు నెలలుగా నగదు కట్‌ అవుతోందని ఓ వ్యక్తి ఫోన్‌ చేసి అడిగినపుడు సదరు అధికారి ఈ సమాధానమివ్వటం గమనార్హం.  

అసలేం జరిగిందంటే...
సికింద్రాబాద్‌కు చెందిన కృష్ణకుమార్‌కు ఎస్‌బీఐలో కార్‌లోన్‌ ఉంది. 2009 ఏడాదిలో తీసుకున్న ఈ రుణాన్ని నెలకు రూ.5,790 చొప్పున ఈఎంఐ చెల్లించి ఆయన 2016లో పూర్తిగా తీర్చేశారు. క్లోజ్‌ చేశారు కూడా. అయితే ఉన్నట్టుండి గత నెల తన హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుంచి రూ.5,790 ఈఎంఐ డెబిట్‌ కావటానికి ఈసీఎస్‌ వచ్చింది. కాకపోతే ఆ ఖాతాలో అంత సొమ్ము లేదు. దీంతో ఈసీఎస్‌ ఆదేశాలు అమలు కాలేదు. ఇలా ఈసీఎస్‌ ఫెయిలయినందుకు ఆయన హెచ్‌డీఎఫ్‌సీకి రూ.600 పెనాల్టీ  చార్జీలను చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇదెలా జరిగిందని ఎస్‌బీఐని సంప్రతిస్తే... పొరపాటున జరిగి ఉండవచ్చని అప్పుడు సమాధానమిచ్చారు.

ఇదిగో... ఈ నెల 10న మళ్లీ మరో ఈసీఎస్‌ ఆదేశం వచ్చింది. ఈ సారి ఖాతాలో డబ్బులుండటంతో ఆ డబ్బులు డెబిట్‌ అయి ఎస్‌బీఐకి వెళ్లిపోయాయి. ఖాతా చూసుకుని లబోదిబోమన్న కృష్ణకుమార్‌... ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయమైన ఆర్‌ఏసీపీ అధికారుల్ని సంప్రతించారు. నిజానికి చెక్కులయితే బ్రాంచి స్థాయిలో డిపాజిట్‌ చెయ్యటం, క్లియర్‌ చెయ్యటం జరుగుతాయి. కానీ ఈసీఎస్‌ మాత్రం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) స్థాయిలోనే జరుగుతుంది.

ఇదంతా సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్ల జరిగిందని, దాదాపు 1,000 నుంచి 2,000 ఖాతాల వరకూ ప్రభావితమయ్యాయని సదరు అధికారులు కృష్ణకుమార్‌కు చెప్పారు.మరి ప్రాంతీయ కార్యాలయమైన సికింద్రాబాద్‌ ఆర్‌ఏసీపీసీ పరిధిలోనే ఇన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయంటే... దేశ వ్యాప్తంగా ఎన్ని ఖాతాలు దెబ్బతిని ఉండొచ్చనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా చిత్రమేంటంటే తను ఖాతా చూసుకుని బ్యాంకును సంప్రతించే వరకూ... ఇలాంటి సమస్య ఒకటుందని గానీ, ఆ సమస్య వల్ల తన ఖాతాలో డబ్బులు డెబిట్‌ అయ్యాయని ఎవరికీ తెలియదు.

పోనీ బ్యాంకు ఇలాంటి వారికి ముందస్తు సమాచారమేదైనా ఇస్తోం దా అంటే... అదీ లేదు. ‘‘మేం సదరు ప్రోగ్రామ్‌ను రన్‌ చేస్తే ఎన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయో తెలిసిపోతుంది. వాటన్నిటి నుంచీ డెబిట్‌ అయిన డబ్బులు ముంబయికి వెళ్లి... రుణ ఖాతా క్లోజయిపోయింది కనక మాకు తిరిగి వచ్చేస్తాయి. మేం వాటిని సస్పెన్స్‌ ఖాతాలో పెట్టి తిరిగి మీకు క్రెడిట్‌ చేస్తాం’’ అని సదరు అధికారి సమాధానమిచ్చారు. 

రెండు నెలలుగా ఏం చేశారు?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. తాము ప్రోగ్రామ్‌ను రన్‌ చేస్తే ఎన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయో తెలిసిపోతుందని సదరు అధికారే చెప్పా రు. మరి 2 నెలలుగా ఎందుకు రన్‌ చెయ్యలేదు. బహుశా! చెయ్యబట్టే 2,000 ఖాతాల వరకూ ప్రభావితమయ్యాయని వారికి తెలిసి ఉంటుందని అనుకుందాం!! మరి గతనెలే జరిగినపుడు.. మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటే ఈ నెల కూడా చెక్కు వచ్చి సొమ్ము డెబిట్‌ అయ్యేది కాదు కదా? ఈ ప్రశ్నకు మాత్రం సదరు అధికారి సమాధానమివ్వలేకపోవటం గమనార్హం. నిజానికి ఒకవేళ ఆయా డబ్బులు డెబిట్‌ అయిన ఖాతాల్లోకి తిరిగి వచ్చినా... ఈ లోగా రావాల్సిన క్రెడిట్‌ కార్డు చెక్కుల వంటివి రావటం, డబ్బుల్లేక బౌన్స్‌ కావటం వంటివి జరగవని చెప్పలేం. కృష్ణకుమార్‌కు జరిగినట్లే మిగతా వారికీ పెనాల్టీలు పడితే దానికెవరు బాధ్యులు?


లీన్‌ పేరిట ‘హోల్డింగ్‌’
ఎస్‌బీఐలో ఈ మధ్య కొందరికి మరో సమస్య కూడా ఎదురవుతోంది. ఉన్నట్టుండి ఖాతాలోని డబ్బుల్లో కొన్ని ‘లీన్‌’ పేరిట కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మీ ఖాతాలో రూ.30 వేలుంటే... దాన్లో రూ.25వేలు ‘లీన్‌’ పేరిట కనిపించాయనుకోండి!!. మొత్తం బ్యాలెన్స్‌ రూ.30వేలు కనిపించినా మీరు విత్‌డ్రా చెయ్యగలిగేది, వాడుకోగలిగేది రూ.5 వేలు మాత్రమే.

లీన్‌ పేరిట ఉన్న సొమ్మును మళ్లీ బ్యాంకు విడిచిపెట్టేదాకా వాడలేరు. ఈ మధ్య కొందరికి ఇలాగే జరిగినపుడు బ్యాంకును సంప్రతిస్తే... ‘‘అధిక విలువగల లావాదేవీలు జరిగినపుడు ఇలా చేస్తాం’’ అని ఒక అధికారి సమాధానమిస్తే... మీకు వేరే శాఖలో లోన్‌ ఉండి దాన్ని చెల్లించకపోతే ఇలా హోల్డ్‌ చేస్తామని మరో అధికారి చెప్పారు. కేవైసీ వివరాలు సమర్పించకపోతే ఇలా చేస్తామని కొందరు సిబ్బంది చెప్పటం గమనార్హం.

నిజానికి ఏ బ్రాంచిలోనూ లోన్లు లేనివారికి, మామూలు లావాదేవీలు నిర్వహించేవారికి చాలా మందికి ఇలా జరగటం... ఓ వారం పాటు ఫిర్యాదులు చేసి, బ్యాంకు చుట్టూ తిరిగితే చివరికి లీన్‌ విడుదల చేయటం వంటివి ఈ మధ్యే చోటుచేసుకున్నాయి. కాగా ఈ విషయమై ఎస్‌బీఐ రుణాల విభాగం డీజీఎంను సంప్రతించటానికి మెయిల్, మెసేజ్‌ల ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించినా... ఆయన స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement