రెండో ఇంటితో 2 లాభాలు..!
చేతిలో ఇన్వెస్ట్ చేయడానికి కాస్తో కూస్తో డబ్బులున్నవారు ఎక్కువగా షేర్లపైనో లేక బాండ్లపైనో దృష్టి పెడుతుంటారే తప్ప రియల్ ఎస్టేట్, బంగారం వైపు పెద్దగా చూడరు. దీర్ఘకాలంలో సంపదను పెంచుకునే విషయానికొస్తే... ఇంకో ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం ప్రయోజనకరమే. వేతన జీవులకు అందుబాటులో ఉండే మెరుగైన సాధనాల్లో ఇది కూడా ఒకటి. అలా చెప్పటానికి కారణాలేంటో చూద్దాం...
ఆర్థికపరమైన లాభాలు...
కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టినా... అవసరమైన సందర్భాల్లో కాస్త అధిక మొత్తాన్ని అందించగలిగేది రియల్టీనే. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బంగారం ఇలా ఇతరత్రా ఏ సాధనమైనా సరే మన పర్సులో నుంచి పూర్తి మొత్తం పెట్టి కొనుక్కోవాల్సిందే. అదే రెండో గృహం విషయానికొస్తే.. ఇంటి ధరలో సుమారు 20 శాతం మాత్రమే మన జేబు నుంచి కట్టి, మిగతా మొత్తాన్ని హౌసింగ్ లోన్ తీసుకుని కట్టొచ్చు. ఈ రుణానికి సగటున కట్టే వడ్డీ రేటు పదిశాతం మేర ఉంటుంది. అయితే ఆ ఇంటిపై వచ్చే అద్దె... వడ్డీలో దాదాపు 3 శాతందాకా ఉంటుంది. ఇక ప్రాపర్టీ విలువ ఏటా 12 శాతం పెరగవచ్చు. దీని ద్వారా ఏటా మారే మీ ఆర్థిక పరిస్థితిని ఒక పట్టిక రూపంలో వేస్తే ఇలా ఉంటుంది.
పట్టికను బట్టి చూస్తే పెట్టిన పెట్టుబడిపై వచ్చే రాబడులు గణనీయంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టికలో మునిసిపల్ పన్నులు, ఇతరత్రా ప్రాపర్టీ మెయింటెనెన్సు ఖర్చులూ చూపలేదు. వీటన్నింటినీ చేర్చినా అంతిమ ఫలితంలో ఏదో కొంత తప్ప పెద్దగా మార్పులుండవు. అయితే, ఇతరత్రా స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్, బ్రోకరేజి చార్జీలు మొదలైన ఖర్చును పరిగణనలోకి తీసుకోవాలి.
గత యాభై ఏళ్లుగా వివిధ నగరాలు, కాల వ్యవధులను బట్టి (కనీసం 10 ఏళ్లు) చూస్తే దేశీయంగా రియల్ ఎస్టేట్ ధరలు వార్షికంగా 15-20 శాతం మేర పెరుగుతూ వస్తున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ, చిన్న కుటుంబాలు తదితర కారణాలతో దీర్ఘకాలంలోనూ ఈ పెరుగుదల కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లకు దీటుగా రాబడులిచ్చేది రియల్టీ పెట్టుబడులే. పెపైచ్చు ఈక్విటీల్లో తలెత్తే ఒడిదుడుకులను తరచూ ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు 1979 నుంచి చూస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్ 160 రెట్లు పెరిగినప్పటికీ.. పరిస్థితులను బట్టి అందులోని స్టాక్స్ అనేకసార్లు మారిపోయాయి. దానర్థం మార్కెట్లు పెరిగాయి కానీ... మనం పెట్టుబడి చేసిన షేర్లు కాదు. కొన్ని షేర్లు అంతకన్నా ఎక్కువ రెట్లు పెరిగితే... కొన్ని దారుణంగా నష్టపోయి కనుమరుగైపోయాయి కూడా.
పన్ను ప్రయోజనాలు..
రెండో ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం వల్ల పలు పన్నుపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటంటే...
రెండో ఇంటిపై వచ్చే అద్దెను (రిపేర్లు, మెయింటెనెన్స్‌కు 30 శాతం తీసేస్తే) గృహ కొనుగోలుకు తీసుకున్న రుణంపై వడ్డీ భాగాన్ని కట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ కట్టే వడ్డీ కన్నా చేతికొచ్చే అద్దె తక్కువగా ఉన్న పక్షంలో మీ ఆదాయంలో దాన్ని ‘గృహ ఆస్తిపరంగా వచ్చిన నష్టం’ కింద చూపించుకుని, పన్నులపరమైన వెసులుబాటు పొందవచ్చు. ఇక ఫ్లాట్‌ను విక్రయించిన పక్షంలో అమ్మిన రేటు నుంచి కొన్న రేటును (ఇండె క్సేషన్‌కి అనుగుణంగా లెక్కించి) తీసివేసి.. మిగతా మొత్తంపైనే పన్ను విధిస్తారు.
ఆలోచనా విధానం..
మిగతా సాధనాలతో పోలిస్తే ఇంటి విషయంలో ఆలోచనా విధానం కాస్త భిన్నంగానే ఉంటుంది. ఈ స్థిరాస్తిని మాటిమాటికి కొనడం, అమ్మేయడం వంటివి జరగదు. సాధ్యమైనంతవరకూ దీని ప్రయోజనాలను దీర్ఘకాలంలో పొందాలనే ఆలోచనే ఉంటుంది. రేట్లు భారీగా పెరిగిపోయాయని అమ్మేసేయాలనే అత్యాశ గానీ లేదా రేట్లు పడిపోయాయని చింతించడం గానీ ఎక్కువగా ఉండదు. వీటి రేట్లు రోజువారీ ప్రాతిపదికన మారిపోవు. కాబట్టి దీన్ని మానసికంగా ఆందోళన కలిగించే పెట్టుబడిగా భావించలేం. నిశ్చింతనిచ్చే పెట్టుబడి సాధనంగా చెబుతాం. ఇక, అద్దెకిస్తే మనం కట్టే గృహ రుణం నెలసరి వాయిదాల్లో కొంత మొత్తం కిరాయి రూపంలో సమకూరుతుంది కనుక ఆ మేరకు కాస్త ఆర్థిక భారం తగ్గుతుంది.
ఆలోచించుకోవాల్సినవి..
రెండో ఇంటిని కొనుక్కునే ముందు బేరీజు వేసుకోవాల్సిన విషయాలూ కొన్ని ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఈఎంఐలు క ట్టుకుంటూ పోవడం మీకు సాధ్యపడుతుందా? లేదా? అన్నది చూసుకోవాలి. అలాగే స్థిరాస్తి అంటే కొంత మెయింటెనెన్సు, పర్యవేక్షణ వంటి బాదరబందీ కూడా ఉంటుంది. తరచూ ట్రాన్స్‌ఫర్లు ఉండే ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇది కొంత కష్టం కావొచ్చు. అంతే కాదు ప్రాపర్టీని కొనేటప్పుడు డెవలపరు గురించి, ట్రాక్ రికార్డు గురించి, ఇతరత్రా న్యాయపరమైన అంశాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
ఏదైతేనేం.. స్థూలంగా చెప్పాలంటే.. రెండో ప్రాపర్టీ అనేది పెట్టతగ్గ పెట్టుబడే. సరిగ్గా ప్రణాళిక వేసుకుని, అమలు చేయగలిగితే వేతన జీవులకు ఇది మెరుగైన పెట్టుబడి సాధనమే. దీర్ఘకాలంలో సంపదను పెంచుకునేందుకు ఇది ఉపయోగకరమైనదే.