ప్రాపర్టీలపై బాలీవుడ్ స్టార్ల క్రేజ్
వంద కోట్ల సినిమాలతో దూసుకెడుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఎడాపెడా ప్రాపర్టీలను కొనేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం లాల్‌బాగ్ ప్రాంతంలోని 64 అంతస్తుల బిల్డింగ్‌లో షారుఖ్ ఖాన్ రెండు ఫ్లోర్లు కొన్నాడు. ఇందుకోసం రూ. 100 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేశాడు.
అటు సల్మాన్ ఖాన్ కూడా ఖరీదైన బాంద్రా ప్రాంతంలో బంగళా కొనాలని చూస్తున్నాడు. ఇక, అమితాబ్ బచ్చన్‌కి ఇప్పటికే ముంబైలో నాలుగు ఇళ్లు ఉన్నాయి. తాజాగా అయిదో బంగళాను రూ. 50 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. ఆయన కోడలు, నటి ఐశ్వర్యరాయ్ ముంబైలోనే రూ. 5-6 కోట్లు పెట్టి ఫోర్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ తీసుకున్నారట. సొంతంగా ఉండటానికి కావొచ్చు..
ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా కావొచ్చు.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్స్ ఎక్కువగా రియల్ ఎస్టేట్‌పైనే దృష్టి పెడుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. రెండు ఇళ్లు తీసుకున్నాడు. ఆయుష్మాన్ ఖురానా రెండో ఇల్లు కొనుక్కున్నాడు. ముంబైలో ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో రియల్టీ పెట్టుబడులతో సెలబ్రిటీలు తమ సంపదను పెంచుకుంటున్నారు.