
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మారటోరియం వ్యవధిలో వాయిదాపడిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తూ రుణగ్రహీతలను బ్యాంకులు శిక్షించరాదని సుప్రీంకోర్టు కు పిటిషనర్ బుధవారం నివేదించారు. బ్యాంకులు రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నిస్తున్న క్రమంలో మారటోరియం వ్యవధిలో వాయిదా పడిన ఈఎంఐలపై వడ్డీ వసూళ్లతో రుణగ్రహీతలను ఇబ్బంది పెట్టరాదని ఆయన సర్వోన్నత న్యాయస్ధానం దృష్టికి తీసుకువచ్చారు. కరోనా వైరస్‌తో అందరి ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 27న అన్ని రుణ వాయిదాల(ఈఎంఐ)పై మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా ప్రభావం కొనసాగడంతో మారటోరియంను ఆగస్ట్ 31 వరకూ ఆర్‌బీఐ పొడిగించింది.
మారటోరియం వ్యవధిలో వాయిదా పడిన ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తుదివిచారణ సందర్భంగా పిటిషనర్ కీలక వాదనలు వినిపించారు. వడ్డీపై వడ్డీ చెల్లించడం రుణగ్రహీతలకు తలకుమించిన భారమవుతుందని పేర్కొన్నారు. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీలు పెరిగిపోయాయని, ఇవి రుణగ్రహీతలకు భారమవుతాయని పిటిషనర్ గజేంద్ర శర్మ న్యాయవాది రాజీవ్ దత్తా కోర్టుకు నివేదించారు. చదవండి : మారటోరియం రెండేళ్ల పాటు పొడిగింపు!
ఇక మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ వసూలు, వడ్డీపై వడ్డీ వసూలు నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ సమీక్షించాలని కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా, కోవిడ్-19 ప్రభావం నేపథ్యంలో రుణాల చెల్లింపుపై మారటోరియం వ్యవధిని రెండేళ్లు పెంచవచ్చని, ఆయా రంగాలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ కోర్టుకు వివరించాయి. ఇక వాయిదాపడిన ఈఎంఐలపై వడ్డీ మాఫీ మౌలిక ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని, షెడ్యూల్ ప్రకారం రుణాలను తిరిగిచెల్లిస్తున్న వారికి అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.