loan rescheduling
-
‘రుణగ్రహీతలను వడ్డీపై వడ్డీతో వేధించకండి’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మారటోరియం వ్యవధిలో వాయిదాపడిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తూ రుణగ్రహీతలను బ్యాంకులు శిక్షించరాదని సుప్రీంకోర్టు కు పిటిషనర్ బుధవారం నివేదించారు. బ్యాంకులు రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నిస్తున్న క్రమంలో మారటోరియం వ్యవధిలో వాయిదా పడిన ఈఎంఐలపై వడ్డీ వసూళ్లతో రుణగ్రహీతలను ఇబ్బంది పెట్టరాదని ఆయన సర్వోన్నత న్యాయస్ధానం దృష్టికి తీసుకువచ్చారు. కరోనా వైరస్‌తో అందరి ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 27న అన్ని రుణ వాయిదాల(ఈఎంఐ)పై మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా ప్రభావం కొనసాగడంతో మారటోరియంను ఆగస్ట్ 31 వరకూ ఆర్బీఐ పొడిగించింది. మారటోరియం వ్యవధిలో వాయిదా పడిన ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తుదివిచారణ సందర్భంగా పిటిషనర్ కీలక వాదనలు వినిపించారు. వడ్డీపై వడ్డీ చెల్లించడం రుణగ్రహీతలకు తలకుమించిన భారమవుతుందని పేర్కొన్నారు. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీలు పెరిగిపోయాయని, ఇవి రుణగ్రహీతలకు భారమవుతాయని పిటిషనర్ గజేంద్ర శర్మ న్యాయవాది రాజీవ్ దత్తా కోర్టుకు నివేదించారు. చదవండి : మారటోరియం రెండేళ్ల పాటు పొడిగింపు! ఇక మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ వసూలు, వడ్డీపై వడ్డీ వసూలు నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సమీక్షించాలని కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా, కోవిడ్-19 ప్రభావం నేపథ్యంలో రుణాల చెల్లింపుపై మారటోరియం వ్యవధిని రెండేళ్లు పెంచవచ్చని, ఆయా రంగాలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కోర్టుకు వివరించాయి. ఇక వాయిదాపడిన ఈఎంఐలపై వడ్డీ మాఫీ మౌలిక ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని, షెడ్యూల్ ప్రకారం రుణాలను తిరిగిచెల్లిస్తున్న వారికి అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. -
120 మండలాలకే రుణాల రీషెడ్యూలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో కేవలం120 మండలాలకే వ్యవసాయ రుణాల రీషెడ్యూలింగ్ పరిమితం అవుతుందని రిజర్వు బ్యాంకు చెప్పింది. ఇదే విషయాన్ని మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇంతకుమించి మరెక్కడా రుణాలను రీషెడ్యూలు చేయడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు రిజర్వు బ్యాంకు గవర్నర్ తెలిపారు. ఇకమీదట ఈ విషయంలో ఎలాంటి ప్రతిపాదన వచ్చినా పరిశీలించేది లేదని కూడా తేల్చిచెప్పారు. ఒకవైపు రిజర్వు బ్యాంకు ఇలా చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రుణాల మాఫీ, రీషెడ్యూలు అంశంపై నిమిషానికో మాట చెబుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని అంటున్నారు తప్ప.. ఎలా చేస్తామన్న విషయం మాత్రం చెప్పలేదు. -
'బ్యాంకులు రుణమాఫీకి సానుకూలంగా లేవు'
ఏ బ్యాంకులూ రుణమాఫీకి సానుకూలంగా లేవని, పరపతి విధానం దెబ్బతింటున్న భావనతో బ్యాంకులు మాఫీని వ్యతిరేకిస్తున్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు రిజర్వు బ్యాంకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. రుణాలు రీషెడ్యూల్ చేస్తే కాస్త వెసులుబాటు వస్తుందని భావించామని, అయితే ఇప్పటికీ రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని పుల్లారావు చెప్పారు. రుణమాఫీ అమలుకు రెండు నెలల సమయం పడుతుందని, ఈలోపు వనరుల సమీకరణపై తీవ్ర కసరత్తు చేస్తున్నామని తెలిపారు. బ్యాంకులకు రూ.45 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఎఫ్ఆర్బీఎమ్ ప్రకారం 15 వేల కోట్లకు మించి రుణాలు తెచ్చుకోలేమని వివరించారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా కూడా 2 వేల కోట్ల రూపాయలకు కు మించి ఆదాయం రాదని, ఇతర వనరుల కోసం కమిటీ కసరత్తు చేస్తోందని పుల్లారావు చెప్పారు. -
రుణమాఫీపై ప్రభుత్వం చేతులెత్తేసింది!
-
చంద్రబాబుకు రిజర్వు బ్యాంక్ షాక్
గత ఏడాది ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలు పండలేదని, అందుకే రుణాలను రీషెడ్యూలు చేయాలని రిజర్వు బ్యాంకును కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిజర్వు బ్యాంకు తాజా లేఖ ఇబ్బందికరంగా పరిణమించింది. ఆంధ్రప్రదేశ్ అర్థ గణాంక శాఖ నుంచి సేకరించిన పంటల దిగుబడి వివరాల ఆధారంగా గత ఖరీఫ్‌లో పంటల దిగుబడి సాధారణం కంటే 50 శాతానికి తగ్గలేదని ఆర్బీఐ అంటోంది. కాబట్టి ప్రకృతి వైపరీత్యం ఉందని చెప్పలేమని రిజర్వు బ్యాంకు చెబుతోంది. అందుకే రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతి సాధ్యం కాదని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపావలి పంత్ జోషి లిఖితపూర్వకంగా స్పష్టంచేశారు. దీంతో గత ఖరీఫ్ రుణాలు రీ షెడ్యూల్ అయితే రుణ మాఫీపై కొంతకాలం నాన్చొచ్చన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐకి ఏమి సమాధానమివ్వాలో తేల్చుకోలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలనే జోషి లేఖలో ఉటంకించడం వల్ల దాని వాదనను ఖండించలేని పరిస్థితి ఎదురైందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఇక రుణాల రీ షెడ్యూల్‌కు దారులు మూసుకుపోయినట్లేనని వారు అంటున్నాయి. ఆర్బీఐ గవర్నర్‌తో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని తెలిసింది. రుణ మాఫీ చేయకుండా కరవు, తుఫాను పేరుతో గత ఖరీఫ్ రైతు రుణాలను రీ షెడ్యూల్ చేసి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అభిప్రాయం ఆర్బీఐ అధికారుల్లో గట్టిగా ఉందని అధికారులు భావిస్తున్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: చంద్రబాబు
రైతు రుణ మాఫీ చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్సష్టం చేశారు. అందుకోసం సమయం పడుతుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న బాబు బుధవారం మాట్లాడుతూ... రేపో మాపో రుణాల రీషెడ్యూల్‌పై ప్రకటన విడుదల అవుతుందన్నారు. రీషెడ్యూల్లో కూడా సమస్య ఉందని చెప్పారు. 12 శాతం వడ్డి కట్టాల్సి ఉందన్నారు. ఈ భారాన్ని ఎలా భరించాలన్నది ఆలోచిస్తున్నట్లు బాబు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హమీలపై ఆలోచనలతో నిద్ర పోవడం లేదన్నారు. అందరూ అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల రుణాల రీషెడ్యూల్‌పై సానుకూలంగా ఉన్నట్లు ఆర్బీఐ తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో రీషెడ్యూల్‌పై ప్రకటన విడుదల కానుందని చంద్రబాబు చెప్పారు. -
రీషెడ్యూలుతో నష్టపోయేది రైతులే
రుణాల రీషెడ్యూల్ వల్ల నష్టపోయేది రైతులేనని ఆంధ్రప్రదేశ్‌లో మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య అన్నారు. రీషెడ్యూల్‌పై చంద్రబాబుది ఓమాట..ఆర్బీఐది మరో మాటగా ఉందని, ఈ విషయంలో అబద్ధాలు ఆడుతున్నది చంద్రబాబో, రిజర్వు బ్యాంకో తేలాల్సి ఉందని అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చంద్రబాబుపై ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న ఆలోచనలు రుణాలు మాఫీ చేయడానికా లేదా ఎగ్గొట్టడానికా అని ప్రశ్నించారు. రూ.87వేల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేస్తారో ఎంత మంది రైతులకు చేస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ప్రభుత్వ పాలనే కనిపించడంలేదని చెప్పారు. విభజన బిల్లులో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లకు సరిపడ ప్రణాళికలు రూపొందించిందని, అక్కడ ఇప్పుడు ఆఫీసులు, కుర్చీలు లేవన్న చంద్రబాబు మాటలు తప్ప ప్రభుత్వపాలన కనిపించడం లేదని అన్నారు. మండల, జడ్పీ పీఠాలను దక్కించుకునేందుకు టీడీపీ చేసిన దౌర్జన్యాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా అన్న అనుమానం కలుగుతుందని రామచంద్రయ్య అన్నారు.