
ఈఎంఐ ఏ మేరకుండాలి?
ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆదాయమే చెబుతుంది. ఇంటి అద్దె, పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, రవాణా వ్యయాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, అనుకోని ఖర్చులు వంటి వాటినన్నింటినీ తీసేసిన తర్వాత మిగిలిన మొత్తం ఆధారంగా మీ ఈఎంఐని నిర్ణయించుకోవాలి. ఇక్కడ మీ ఆదాయం వృద్ధి చెందుతున్న కొద్దీ మీరు మిగిల్చే మొత్తం కూడా పెరుగుతుంటుంది. అలాగే కొన్ని ఖర్చులు కూడా పెరగొచ్చు.
ఉదాహరణకు కెరీర్ తొలినాళ్లలోనే మీకు ఉద్యోగం వచ్చింది. మీ నికర ఆదాయం నెలకు రూ.30,000గా ఉంది. అంటే మీరు మిగిల్చే మొత్తం 15–20 శాతం మధ్యలో ఉండాలి. అదే మీ ఆదాయం రూ.లక్షకు పెరిగిందనుకుంటే అప్పుడు ఈ శాతంలో కూడా మార్పు ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు మీ ఈఎంఐలను చెల్లించడానికి 40–50 శాతాన్ని మిగిలించవచ్చు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు కెరీర్ తొలినాళ్లలోనే ఉన్నారు కాబట్టి కచ్చితంగా క్రెడిట్ రిపోర్ట్‌ను సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.
అందుకే మీరు చెల్లించగలిగే సామర్థ్యం మేరకే రుణాన్ని తీసుకోండి. ఎప్పుడైనా తీసుకున్న రుణాలను ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు లేకుండా సులభంగా తీర్చగలిగేలా చూసుకోవాలి. కుటుంబంలో ఏదైనా ఊహించని సమస్య రావొచ్చు, ఉద్యోగం పోవచ్చు, పెళ్లి వంటి ఘటనలు జరగొచ్చు. ఇలాంటి సందర్భాల్లో అధిక మొత్తం అవసరమౌతుంది. అందుకే వీటి కోసం కొంత సేవింగ్స్ అవసరం. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏమేరకు ఈఎంఐ చెల్లించగలరో ఒక నిర్ణయం తీసుకోండి.